– ప్రవాసాంధ్రుల సాధికారత సంబరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి: నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి, అలజడుల మధ్య చిక్కుకున్న తెలుగు పౌరులను తిరిగి స్వస్థలాలకు తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం శక్తి వంచనలేకుండా పనిచేస్తుందని రాష్ట్ర యం ఎస్ యం ఈ, సెర్ప్, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. యువనేత నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్ర సచివాలయంలోని రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కంట్రోల్ రూమ్, ఢిల్లీలోని ఏపీ భవన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన అధికారులతో సమన్వయం చేసుకుంటూ రెస్క్యూ ప్రయత్నాలలో ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ రాష్ట్ర హోం, పర్యాటక శాఖ మంత్రులతోపాటు భాగస్వాములు అవుతున్నారు.
ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సుమారు మూడు వందల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ నివాసితులు నేపాల్‌లో అనేక ప్రదేశాలలో చిక్కుకున్నారన్న సమాచారం ఉందని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. చైనా సరిహద్దుకు సమీపంలోని పింగల్స్థాన్లో 90 మంది, పశుపతిలో 55 మంది, బఫల్‌లో 27 మంది, సిమికోట్‌లో 12 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత వారిని స్వస్థలాలకు తరలించేందుకు వీలుగా వారి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి రెండు గంటలకు రియల్ టైమ్ అప్డేట్ తో తాము సమాచారాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. అక్కడ చిక్కుకున్న వారందరూ “దయచేసి ఇంట్లోనే ఉండాలని, ఫోన్ బ్యాటరీలను జాగ్రత్తగా చూసుకోని ఫోన్ కాల్ కు అందుబాటులో ఉండాలని సూచించామని అన్నారు.
అక్కడ చిక్కుకు పోయినవారు, వారి కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ తమ స్వస్థలాలలోని ఇళ్ళకు తిరిగి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. నేపాల్ లో చిక్కుకున్న వారితో ఎప్పటి కప్పుడు సంప్రదిస్తూ క్షేమసమాచారాన్ని తెలుసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు. పత్రాలు పోగొట్టుకున్న వారికి తాత్కాలిక పాస్‌పోర్ట్‌లు జారీ చేసి ఖాట్మండు విమానాశ్రయం తిరిగి తెరిచిన తర్వాత విశాఖపట్నం లేదా విజయవాడ కు విమానాలను ఏర్పాటు చేయడం లేదా అవసరమైతే లక్నో మరియు వారణాసి ద్వారా సరిహద్దు క్రాసింగ్ లను ఉపయోగించడం వంటి ఎటువంటి పరిస్థితి కైనా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించామని, ప్రతి పౌరుడిని స్థానిక కలెక్టర్ల సమన్వయంతో సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ లోని ఆయా జిల్లాలలో స్వస్థలాలకు తిరిగి పంపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి శ్రీనివాస్ చెప్పారు.
వారి కుటుంబాలు సమాచారం పొందడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ (9818395787) ప్రారంభించామని తెలిపారు. ఏపీ భవన్ నుంచి వివరాలను సేకరించి పౌరులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నామని తెలిపారు. సున్నితమైన ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యలోని మంత్రులు, అధికారుల కమిటీ అనుక్షణం పర్యవేక్షిస్తున్నామని ప్రతి తెలుగు వ్యక్తిని తిరిగి తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.