Suryaa.co.in

Andhra Pradesh

కలిసే పోటీ చేస్తాం… డౌటేమీ లేదు

-తనతో పాటు చంద్రబాబు, పవన్ లక్ష్యంగా వైకాపా నేతలు ట్విట్ల ద్వారా విమర్శలు
-తెర వెనుక నుంచి ఎందుకు జగన్…ట్విట్టర్ వేదిక గా నువ్వే ఎలా కావాలంటే అలా విమర్శించుకో
-9 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర అప్పులు..
-ఈసారి మరో 10 వేల కోట్ల అప్పులు పుట్టాలని కోరుకుంటున్నా
-ఎంపీ రఘురామకృష్ణంరాజు

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనలతో కలిసే తాను పోటీ చేస్తానని, అందులో ఎటువంటి సందేహం అక్కరలేదని నర్సాపురం ఎంపీ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రఘు రామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనని లక్ష్యంగా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరడజన్ మంది నాయకులు, నాయకురాళ్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి ఈ విమర్శలు చేయిస్తున్నారని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి నేరుగా తమపై విమర్శలు చేయవచ్చునని … ఆయనకు ఒక ట్విట్టర్ అకౌంట్ ఉందని గుర్తు చేశారు. తన మనసులోని భావాలను ఒకటి అర ట్విట్ల రూపంలో రాయించుకుని పోస్టు చేయాలని సూచించారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి, తనని విమర్శిస్తే ఎక్కువ మంది చూస్తారని తెలిపారు. తనపై రోజు ఐదారు మంది పార్టీ నేతల చేత విమర్శలు చేయిస్తే, తాను చదివి వినిపించాలంటే ఇబ్బంది అవుతుందని ఎద్దేవా చేశారు. రెండు క్రూర మృగాల మధ్య వన్యప్రాణులు నలిగిపోవద్దంటూ తనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన నాయకులకు సూచించారు.

ముఖ్యమంత్రి తనని ఎంతలా రెచ్చగొట్టాలని చూసిన తాను రెచ్చిపోయేది లేదని స్పష్టం చేశారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి తిట్ల పురాణం తగ్గించారన్నారు. మంచి మార్గంలో పయనిస్తున్న విజయ సాయిని అభినందిస్తున్నట్లు తెలిపారు. అయితే, తమ పార్టీకి చెందిన మరో ఆరు మంది నాయకులు, నాయకురాళ్లు ట్విట్టర్ వేదికగా తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక గంట వ్యవధిలోనే ఒకరి తరువాత మరొకరు తన పై ట్విట్ల వర్షం కురిపించారని తెలిపారు. 151 మంది తనపై ట్విట్టర్ వార్ కు వచ్చిన తనకొచ్చిన నష్టము, ఇబ్బంది ఏమీ లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. వీరంతా తనపై ఎందుకు ట్విట్లు పెట్టారన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరారు.

తాడేపల్లి కర్మాగారంలో ట్విట్ల తయారీ
తమ పార్టీకి చెందిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి మంచి వ్యాపారవేత్త. కానీ ఆయనకు తెలుగు కవిత్వం రాదు. సమాజంలో మంచి వ్యాపారవేత్తగా పేరుంది. తనపై ట్విట్టర్లో రాజు, కాజు, మోజు, రివాజు అని యతిప్రాసలతో కవిత్వాన్ని సంధించారు. ట్విట్టర్లో ఆయన పేరిట తాడేపల్లి ప్యాలెస్ లో పనిచేసే జివిడి కృష్ణమోహన్ ఈ కవితను రాశారు. మాజీ హోంమంత్రి సుచరిత అంటే తనకు గౌరవం ఉంది. ట్విట్టర్లో ఆమె తనపై చేసిన పోస్ట్ ముందు కనీసం చదివిందో లేదో… తానైన ఇప్పుడు చదివి వినిపిస్తాను . తన పబ్లిసిటీ ద్వారానైనా ట్విట్టర్లో ఆమెకు మరో వెయ్యి మంది ఫాలోవర్స్ పెరగాలని కోరుకుంటున్నా.
తనపై విమర్శలు చేసినంత మాత్రాన సుచరిత అంటే తనకు ఇసుమంతైన గౌరవం తగ్గలేదు. తన సహచర ఎంపీ మాధవి అంటే తనకెంతో అభిమానం. తన కూతురు కంటే తక్కువ వయసు ఆమెది. ఆమెను తానే స్పీకర్ కు పరిచయం చేశాను. రెండు స్థానాల్లో … 200 స్థానాల్లో అంటూ ప్రాస కోసం రాసిన ట్విట్ ను భవిష్యత్తులో సరి చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. హోంమంత్రి తానేటి వనిత తమ జిల్లాకు చెందిన వ్యక్తి. తాడేపల్లి ప్యాలెస్ లో వండిన ట్విట్ ను, ఆమె కూడా పోస్ట్ చేశారు.

భవిష్యత్ ముఖచిత్రం తమ పార్టీ పెద్దలకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తనపై ఇంతమంది చేత ట్విట్టర్ వేదికగా దాడి చేయిస్తున్నారు. తానేటి వనిత కూడా హిట్ లిస్ట్ లో ఉన్నట్లు తెలిసింది. మళ్లీ ఆమెకు టికెట్ రావాలని, ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నా. హోం మంత్రిగా ఎవరో రాసిన ట్విట్ల ను పోస్ట్ చేయడం సరికాదు. తన ట్విట్టర్ హ్యాండిల్ ను తానే ఉపయోగించుకోవాలి. తనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసినంత మాత్రాన ఆమెపై తనకున్న గౌరవం రవ్వంత కూడా తగ్గదు.

ట్విట్టర్లో తనపై మా పార్టీ నాయకులు చేసిన విమర్శలు గాడిద రాశారో… గురుజాడ రాశారో తెలియదు. శ్రీనివాస్ రెడ్డి గోపిరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదు. బాపట్ల ఎంపీ కూడా కవితాత్మకంగా విమర్శలు సంధించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వీళ్ళందరి తెలుగు భాషా ప్రావీణ్యం ఏ పాటిదో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తాను ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గ ప్రజలను, నాయకులను అత్యంత గౌరవిస్తానని తెలిపారు. తమ ముఖ్యమంత్రి మాదిరిగా మాటలలో కాదని… చేతల ద్వారా గౌరవిస్తానని వెల్లడించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ప్రజా ప్రతినిధుల చేత తనపై విమర్శలు చేయించారని, వారంటే తనకు ఎంతో గౌరవం ఉందని రఘురామకృష్ణం రాజు మరో మారు పునరుద్ఘాటించారు .

మళ్లీ ఇద్దరిని వేసేశాడు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ మళ్లీ పదవులు కట్టబెట్టారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కడప జిల్లా ఎలక్ట్రిసిటీ ఇన్స్పెక్టరేట్లో విధులు నిర్వహించిన పద్మా జనార్దన్ రెడ్డికి గతం లో ఏపీ సిపిడిఎల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. పదవీకాలం ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించారు. ఎలక్ట్రిసిటీ ఇనిస్పెక్టరేట్లో పనిచేసిన వారికి ఏపీ సిపిడిఎల్ చైర్మన్ పదవి ఇవ్వడం అసాధ్యం. ఎప్పుడూ జరగనిది జరిపించడమే జగన్ గొప్పతనం.

షిరిడి సాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ నుంచి స్మార్ట్ మీటర్లను ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి, అధిక నిర్వహణ భారాన్ని ప్రజలపై వేయాలనుకున్నారు. ఇంకా స్మార్ట్ మీటర్ల కొనుగోలు వ్యవహారం పూర్తి కాకపోవడంతో, తమ పార్టీ ప్రధాన కార్యదర్శి శివ శంకర్ రెడ్డి వియ్యంకుడైన పద్మా జనార్దన్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగించారు. షిరిడి సాయి నుంచి స్మార్ట్ మీటర్ల కొనుగోలు వ్యవహారాన్ని మరో ఆరు నెలల పాటు ఆలస్యం చేసి, పద్మా జనార్దన్ రెడ్డి తన పదవీ కాలాన్ని మరింతగా పొడిగించుకోవాలి. ఏపీ సీపీడీసీఎల్ లో మరో కీలక పదవి కోసం ఇద్దరు సీనియర్ అధికారులను తప్పించి శివ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి కట్టబెట్టారు.

సీనియర్లైన ఇద్దరు అధికారులను సెలవులపై వెళ్ళమని ఆదేశించి, సెలవులపై వెళ్లిన వారికి ప్రమోషన్ ఇవ్వలేమని చెప్పి, శివప్రసాద్ రెడ్డికి త్కాలికంగా పదవి బాధ్యతలను అప్పగించారు. తెలంగాణలో చెప్పినట్టుగానే ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ, మూడు వేల కోట్ల రూపాయలకు గాను, రైతులకు కేవలం 700 కోట్ల రూపాయలను మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. మరో 2,300 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించవలసి ఉంది. అందుకే పార్లమెంటులో ప్రతి రైతు నెత్తిన బీభత్సమైన అప్పు ఉందని కేంద్రం వెల్లడించింది.

ప్రముఖ హాస్య దర్శకులు జంధ్యాల, ఇవివి సత్యనారాయణ లేని లోటును సాక్షి దినపత్రిక పూడుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ అని సాక్షి దినపత్రిక పతాక శీర్షిక కథనం రాయడాన్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. మహారాష్ట్ర కంటే మనకే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయట. తెలంగాణతో పోలిస్తే ఐదవ వంతు, మహారాష్ట్రతో పోలిస్తే 20వ వంతు పెట్టుబడులు కూడా రాష్ట్రానికి రాలేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ అవసరానికి మెటీరియల్ సరఫరా చేసిన వారికి 1.85 లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించవలసి ఉంది. గత ప్రభుత్వాని కంటే తక్కువే అప్పులు చేశామని, ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తమ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటుంది. అయినా ప్రజలు ఎవరు విశ్వసించడం లేదు.

రేపో మాపో ఉపాధ్యాయులు జీతాల కోసం రోడ్డు ఎక్కనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. నూతన సంవత్సరం లోనైనా ఒకటవ తేదీ జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొత్త సంవత్సరంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆనందంగా గడపాలని కోరుకుంటారు. అటువంటి వారికి ఒకటవ తేదీన జీతాలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత. నూతన సంవత్సరంలో నైనా ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలపై కొత్త పన్నులు వేయవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లార్డ్ జీసస్ మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు.

ఎప్పుడు అప్పులు పుట్ట వద్దని కోరుకుంటాను… కానీ ఈసారి అప్పు పుట్టాలి
రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ అప్పులు పుట్ట వద్దని తాను కోరుకుంటానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కానీ ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా పది వేల కోట్ల రూపాయల అప్పు పుట్టాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 9 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయాయి. నిండా మునిగిన వాడికి చలి ఏమిటన్నట్లు, మరో 10 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి నూతన సంవత్సరంలో ఒకటవ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అప్పు అడిగేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది అని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు.

LEAVE A RESPONSE