Suryaa.co.in

Andhra Pradesh

ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ లో లోపాలు సవరిస్తాం

-భక్తులందరికీ మౌలిక వసతులు
-దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఇంద్రకీలాద్రి ,జూలై 16: భక్తులందరికీ మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రంపై వేంచేసిన దుర్గమ్మ వారికి మంగళవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఆలయ కార్యనిర్వణాధికారి కె ఎస్ రామారావు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు వేద పండితులు వేద ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు అందించవలసిన వసతులు, జరుగుతున్న అభివృద్ధి పనులపై దుర్గగుడి అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.

2014 నుంచి 19 వరకు అప్పటి మాస్టర్ ప్లాన్ ఏమైంది అన్నారు. తర్వాత కాలంలో వైకాపా పాలనలో నాటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు కొనసాగుతోందని, అందుకు సంబంధించిన విషయాలను అధికారులు వివరించారు.

అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ మౌలిక వసతులు ఏ విధంగా అందిస్తున్నారని వారికి సదుపాయాలు పూర్తిస్థాయిలో అందక పోవడానికి గల కారణాలు, పార్కింగ్ సమస్య తలెత్తుతున్న తీరు , ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మంది పనిచేస్తున్నారని , ఆయా పనులకు కాంట్రాక్టర్లు ఎవరని పూర్తిస్థాయి వివరాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

ఇంకా పూర్తిస్థాయి పనులు చేపట్టాలని తెలియజేశారు. భక్తులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో సమన్వయం చేసుకొని అభివృద్ధి పనులు చేస్థామని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది.

గత ప్రభుత్వంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఏకపక్షంగా అమ్మవారి అంతరాలయ టికెట్టు 300 రూపాయలు నుంచి 500 రూపాయలు చేశారని భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రస్తుతం మౌలిక వసతులు , అభివృద్ధిపై సమావేశమైనట్లు తొలి సమావేశం అని సుజనా చౌదరి మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి, పూర్తిస్థాయి సమీక్షలు, నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు.

ఈ సమావేశంలో దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు కోటేశ్వరావు, రమా, పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన వారి లో ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన నేత బాడిత శంకర్, ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE