పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం

-అధికారంలోకి వచ్చాక పేదల అభిరుచులకు అనుగుణంగా.. పక్కా ఇళ్ళను నిర్మించి ఇచ్చి.. పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు

తాము అధికారంలోకి వచ్చాక పేదల అభిరుచులకు అనుగుణంగా పక్కా ఇళ్ళను నిర్మించి ఇచ్చి పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరుల (జూమ్) సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం…!

రాష్ట్రంలో పేదవాడి పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తిగా పడకేసింది. ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు ఇంటింటికి తిరిగి ఇల్లు లేని ప్రతి పేదవాడికి నవరత్నాలు అనే పథకం కింద 5 సంవత్సరాల్లో పాతిక లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఊదరగొట్టారు. ఈ మూడున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేసిన ఇళ్లు 60 వేలు కూడా లేవు. మిగిలిన ఏడాదిన్నర కాలంలో ఎన్నికల హడావిడిలో అధికార యంత్రాంగం ప్రజలు పక్కా గృహాల పథకానికి అంతగా శ్రద్ధ పెట్టే అవకాశంలేదు. మిగిలిన ఈ పది నెలల కాలం పూర్తి చేయడం ఎలా సాధ్యమో తెలపాలి. ప్రభుత్వం వచ్చిన ప్పటి నుండి కాకమ్మ కబుర్లు చెబుతూ, ప్రజల్ని మభ్య పెడుతూ, మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటోందే తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం చెప్పినదానికి, చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. పక్కా గృహ నిర్మాణానికి 28,30,000 ఇళ్లులేని పేదలుంటే 80 వేల ఇళ్లు కూడా పూర్తి చేయలేదు. 2019-20 బడ్జెట్ లో 3,600 కేటాయించి ఖర్చు చేసింది రూ.760 కోట్లు మాత్రమే. 2020-21లో 3,690 కోట్లు కేటాయించి 1,141 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

పేదల పక్కా ఇళ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. టీడీపీ హయాంలో బ్రహ్మాండంగా ఉన్న గృహ నిర్మాణ పథకం నేడు కుదేలైంది. జగనన్న కాలనీలు జనావాసాలకు అనుగుణంగా పూర్తి చేసుకోవడం అసాధ్యం. పక్కా గృహాలకిచ్చే లక్షా 80 వేలల్లో లక్షా 50 వేలు కేంద్రం, 30వేలు ఉపాధి హామీ పథకం డబ్బులు ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి పేదల ఇళ్లకు వస్తున్న సాయం గుండుసున్నా. కాకమ్మ కబుర్లు చెబుతూ ఇచ్చిన మాట నిలబట్టుకోవాలనే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి కించెత్తు కూడా లేదు. 25 లక్షల ఇళ్ల హామీ ఇచ్చారు. హామీ హామీగానే మిగిలింది. పేదలు సొంత ఇళ్ల కోసం ఆతృతతగా ఎదురుచూస్తున్నారు, వారి ఆశలు అడియాశలే. ముఖ్యంగా మూడో ఏడాది ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పెద్ద ప్రకటనలు చేశారు. వేల ఎకరాల ప్రైవేటు భూముల సేకరణ పేరుతో ఒక ఎకరా మూడు లక్షలు మొదలుకొని 6 లక్షల వరకు ధర పలికే భూములను 20 నుంచి 60 లక్షల ధర ప్రభుత్వానికి చూపించి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు స్వాహా చేశారు. ఈ విషయంలో వైసీపీ నాయకులు దళారులుగా మారారు. పేదల పేరు చెప్పి వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని స్వాహా చేశారు. పేదల స్థలాల పేరుతో వైసీపీ సాగించిన ధన యజ్ఞం వేల కోట్ల రూపాయల్లో ఉంది. ఎక్కడో జనావాసాలకు దూరంగా 5 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇంటి స్థలాలు ఉన్నాయి. జగన్ సెంటు స్థలం ఇచ్చారు. సెంటు స్థలంలో అభిరుచులకు అనుగుణంగా ఇళ్లు నిర్మించుకోమని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఆ వెసలుబాటు ఎక్కడుంటుందో చెప్పాలి. డిజైన్లు ఇచ్చి ఆ డిజైన్ లో మాత్రమే ఇళ్లు నిర్మించుకోవాలంటున్నారు.

ఎవరైనా తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో తన ఆస్తికి, అభిరుచులకు, ఆలోచనలకు అనుగుణంగా ఆ ఇంటి నిర్మాణం జరగాలని కోరుకుంటారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేశాం. టిడ్కో ద్వారా మరో 2 లక్షల 12 వేల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయగలిగాం. అన్ని లక్షల ఇళ్ల నిర్మాణం చేయగలిగిన ప్రభుత్వం ఆకాలంలో బహుశ ఎక్కడా లేదు. దేశంలోని పలు రాష్ట్రాల అధికారులు, నాయకులు వచ్చి గృహ నిర్మాణ పథకం అమలు తీరును చూసి ప్రశంసించారు. టీడీపీ హయాంలో బహుళ అంతస్తుల్లో అందమైన ఇళ్లు నిర్మించి ఇచ్చాం. సమాజ హితం కోరేవారందరూ సంతోషపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేసుకున్న టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇంతవరకు అప్పగించలేదు. అనేకచోట్ల ఆగిపోయిన నిర్మాణ పనులు ఈరోజుకూ ప్రారంభం కాలేదు. ప్రారంభమైన గృహ నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయి. వీటన్నింటికి జగన్ సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లను ప్రారంభించి ఇప్పటికి పూర్తయిన ఇళ్లను లబ్దిదారుకు ఇవ్వలేదు. ఈ సంవత్సరంలో ఇళ్లను పూర్తి చేసుకున్నవారికి ఇంతవరకు బిల్లులు రాలేదు.

సొంత స్థలాలుండి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ సహాయం చేయమని కోరినవారికి ఈ ప్రభుత్వం సహాయం చేయడంలేదు. తెలుగుదేశం హయంలో కేంద్రం ఇచ్చే లక్షా 50 వేలు ఆర్థిక సాయానికి అదనంగా లక్ష రూపాయలు చేర్చి సొంత స్థలాలలో ఇళ్లు నిర్మించుకుంటామంటే 2లక్షల 50 వేలు సహాయం చేశాం. గృహ నిర్మాణ శాఖామంత్రి జగనన్న కాలనీలవైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. జగనన్న కాలనీలు భవిష్యత్తులో నిరర్థక ఆస్తులుగా మిగులుతాయే తప్ప ఎక్కడా అవి ఉపయోగపడవు. అందులో జీవనం సాగించలేము. ఊరికి దూరంగా ఉండే ఈ కాలనీల్లో నేటికీ మౌలిక వసతులు లేవు. నీటి సదుపాయం లేదు. ఎక్కడా రోడ్లు లేవు. నిర్మాణ కార్యక్రమాలు చేసుకుందామంటే సిమెంటు సక్రమంగా సరఫరా కావడంలేదు. ఇటుక, స్టీలు ధరలు ఐదు రెట్లు పెరిగిపోయాయి. ఒక్కొక్క ఇంటికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం నిర్మించుకోవాలన్నా దాదాపు 5 లక్షలు కావాలి. లబ్దిదారులు సమకూర్చుకోలేక సతమతమౌతున్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే తప్ప ఈ పేదల ఇళ్లనిర్మాణ పథకం ముందుకు వెళ్లే అవకాశమే లేదు. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం గృహ నిర్మాణ పథకాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తామని పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు వివరించారు.

Leave a Reply