Suryaa.co.in

పోలీసులు అనుమతించకపోయినా తిరుపతిలో సభ నిర్వహిస్తాం
Andhra Pradesh

పోలీసులు అనుమతించకపోయినా తిరుపతిలో సభ నిర్వహిస్తాం

అమరావతి రైతుల మహా పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. చింతలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఊరందూరు వరకు సాగనుంది. శ్రీకాళహస్తిలో బస చేసేందుకు అన్నదాతలు ఏర్పాటు చేసుకోగా..వైకాపా నేతల ఒత్తిడితో కల్యాణమండపం నిర్వాహకులు వెనక్కి తగ్గారు.
అమరావతి రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 38వ రోజుకు చేరింది. చిత్తూరు జిల్లా చింతలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఊరందూరు మీదుగా శ్రీకాళహస్తికి చేరుకోనుంది. రాత్రికి శ్రీకాళహస్తిలోనే రైతులు బస చేయనున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలో రాజధాని రైతుల బసకు వైకాపా నేతల అడ్డంకులు సృష్టించారు.
బస చేసేందుకు ఓ కల్యాణమండపాన్ని రైతులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే స్థానిక వైకాపా నేతల ఒత్తిడితో కల్యాణమండపం నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ఫలితంగా అన్నదాతలు వేరే ప్రాంతంలో బస ఏర్పాటు చేసుకుంటున్నారు. చింతలపాలెం వద్ద మహిళా రైతులకు అపూర్వ స్వాగతం లభించింది. శ్రీకాళహస్తి వాసులు మహిళా రైతులకు సారె పెట్టి గౌరవించారు. పసువు, కుంకుమ ఇచ్చి శాలువాతో సత్కరించారు.
బిడ్డను మళ్లీ గర్భంలోకి తీసుకెళ్లడం అసాధ్యం: సీపీఐ నేత నారాయణ
చింతలపాలెం వద్ద రైతుల పాదయాత్రకు సీపీఐ నేత నారాయణ సంఘీభావం తెలిపారు.
తల్లి కడుపు నుంచి పుట్టిన బిడ్డను మళ్లీ గర్భంలోకి తీసుకెళ్లడం అసాధ్యమని నారాయణ అన్నారు. రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వ తీరు ఇలాగే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసికందును 3 ముక్కలు చేసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
పోలీసులు అనుమతించకపోయినా తిరుపతిలో సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. “నాకు కాలు బెణికినా.. రైతులను చూస్తుంటే నాది పెద్ద దెబ్బ కాదు. పసికందును 3 ముక్కలు చేసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పోలీసులు అనుమతించకపోయినా తిరుపతిలో సభ ఖాయం. సభకు నాతోపాటు డి.రాజా, ఇతర ముఖ్యనేతలు వస్తారు.” అని సీపీఐ నేత నారాయణ అన్నారు.

LEAVE A RESPONSE