– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరిక
మంగళగిరి: రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ నాయకులు, వారి అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో 52 వేల కోట్లతో జరుగుతున్న నిర్మాణాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు బ్లూ మీడియా సహకారంతో విషప్రచారం చేస్తున్నారు. ఎక్కడో వాగులు పొంగిన దృశ్యాలను తీసుకువచ్చి అమరావతి మునిగిపోయిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు అని దేవినేని మండిపడ్డారు.
ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయడంలేదని, కొండవీటి వాగు నీటితో పంటలు మునిగిపోయాయని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, ఇరిగేషన్ శాఖ అధికారులు వాటిని ఖండిస్తూ ఫిర్యాదులు కూడా నమోదు చేసిన విషయాన్ని దేవినేని గుర్తుచేశారు. కంభంపాడు ప్రాంతంలో వాగులు పొంగిన దృశ్యాలను అమరావతితో కలిపి చూపించడం వైసీపీ బ్లూ మీడియా దుష్ప్రచారానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
జగన్మోహన్ రెడ్డికి నిజంగా ధైర్యం ఉంటే అమరావతి వచ్చి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూసి వెళ్ళాలి. అక్కడ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పర్యవేక్షించి తెలుసుకోవాలి. కానీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని లేదా బెంగళూరు ప్యాలెస్లో సత్కారాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే పని చేయడం లేదని దేవినేని విమర్శించారు.
జగన్ పాలనలో అమరావతి రైతులపై దమనకాండ నడిపారని, వేలాది కేసులు పెట్టి జైలుకు పంపారని, పనులు ఆపేసి మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసగించారని ఆయన విమర్శించారు. అదే కారణంగా ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు. తాజాగా పులివెందుల, ఒంటిమిట్టలో కూడా వైసీపీ ఓటమిపాలైంది. డిపాజిట్లు కోల్పోయే స్థితికి పడిపోయింది. ఇంత పరాభవం ఎదురైనా జగన్ అసలు సత్యాన్ని అంగీకరించకుండా దుష్ప్రచారమే చేస్తున్నారు.
సూపర్ సిక్స్ పథకాలే వైసీపీ అసహనానికి కారణం
చంద్రబాబు సర్కారు ప్రారంభించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమవుతున్నాయని, రైతులు, మహిళలు, పింఛన్ దారులు అందరూ లబ్ధి పొందుతున్నారని ఉమా తెలిపారు. “అన్నదాత సుఖీభవో, తల్లికి వందనం, స్త్రీ శక్తి, మూడు గ్యాస్ సిలిండర్లు, విద్యా పథకాలు— ఇవన్నీ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. మహిళలు సోషల్ మీడియాలో తమ ఖాతాల్లో డబ్బులు పడుతున్న వీడియోలు పంచుకుంటుంటే జగన్ తట్టుకోలేక అసహనంతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు” అని ఆయన ఆరోపించారు.
జగన్ స్వాతంత్య్ర దినోత్సవం బహిష్కరణపై విమర్శ
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కూడా జగన్ హాజరుకాలేదని ఉమా విమర్శించారు. దేశమంతటా అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ పతాకాలు ఎగురవేస్తున్న వేళ, జగన్ మాత్రం ప్రజల ముందుకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో తలదాచుకున్నారు. ఓటమి భయం, మానసిక అసహనం ఆయనను ఇంతలా దిగజార్చింది అని ఆయన ఎద్దేవా చేశారు.
దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు
అమరావతి మునిగిపోయిందంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేసే బ్లూ మీడియా, సోషల్ మీడియా పేజీలపై ప్రభుత్వం ఇప్పటికే కేసులు నమోదు చేసిందని దేవినేని ఉమా గుర్తుచేశారు. ఇకపై కూడా ఎవరైతే ఇటువంటి ఫేక్ న్యూస్ వ్యక్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం టీడీపీ బాధ్యతగా కొనసాగుతుంది అని దేవినేని స్పష్టం చేశారు.