Suryaa.co.in

Telangana

అరాచక వాదుల నుంచి ధర్మాన్ని పరిరక్షిస్తాం

కర్తవ్యభావన – దేశభద్రత ప్రతి యువకుడి బాధ్యత
భారతీయ వాస్తవ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
కామన్ సివిల్ కోడ్ సాధించి సమన్యాయం పొందాలి
మతాలకు అతీతంగా జనాభా సమతూల్యత పాటించాలి
మెజారిటీ – మైనారిటీ అనే తేడా లేకుండా తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షలు విధించాలి
దేశం అభివృద్ధి చెందాలంటే యువత జాగృతం కావాలి
హక్కులతో పాటు సమాజంపై యువత బాధ్యతగా నడుచుకోవాలి
యువతను మేల్కొల్పేందుకు ఈనెల 30 నుంచి వచ్చే నెల 14 వరకు బజరంగ్దళ్ ఆధ్వర్యంలో “శౌర్య జాగరణ యాత్ర”

నేడు సమాజంలో భారతీయతపై.. హిందుత్వంపై అరాచకవాదులు దాడులకు తెగబడుతున్నారు. సనాతన ధర్మాన్ని పెకిలించి వేస్తామని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి అరాచక, ఉగ్రముఖలకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలి. ధర్మరక్షణలో ఎంతటి త్యాగానికైనా బజరంగ్ దళ్ సంసిద్ధమే. హేతువాదులు, లౌకిక వాదుల ముసుగులో ధర్మాన్ని కించపరిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని విశ్వహిందూ పరిషత్ నేతలు తేల్చి చెప్పారు.

సోమవారం భాగ్యనగర్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు విలేకరులతో మాట్లాడారు.

దేశంలోని యావత్ యువతను మేల్కొల్పేందుకు విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర చేపడుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి జిల్లాలో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈనెల 30వ తేదీ నుంచి వచ్చే నెల (అక్టోబర్ )14 వరకు శౌర్య జాగరణ యాత్ర నిర్వహిస్తామని వివరించారు. భారతీయ యువతను మేల్కొల్పి దేశ చరిత్ర, భద్రత విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.

భారతీయం కోసం.. సనాతన ధర్మం కోసం పోరాడిన పరాక్రమ వీరుల చరిత్రను నేటి సమాజానికి తెలియజేసి, జాగృతం చేస్తామని అన్నారు. వక్రీకరించిన చరిత్ర కాకుండా, వాస్తవ చరిత్రను నేటి సమాజం తెలుసుకోవాలని.. ఆ విషయంలో అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. మన పుణ్యభూమి.. వేద భూమి.. కర్మభూమి అయినా భరత భూమి గొప్ప చరిత్ర కలిగి ఉందని విశ్వహిందూ పరిషత్ నేతలు చెప్పారు.

మహా పురుషులు, స్వాతంత్ర సమరయోధులు, వీర వనితలు, వీరమాతల ధైర్య శౌర్య పరాక్రమాలు నేటి సమాజానికి తెలియాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఈ దేశంపై దండెత్తి వచ్చిన దుర్మార్గుల అన్యాయాలు వివరించి, ధర్మంపై జరిగిన దాడి గురించి అవగాహన పరచడంతో పాటు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ దేశ సమగ్రతకు పెనుముప్పుగా సంక్రమిస్తున్న పలు ప్రమాదకర విషయాలపై యువతను మేల్కోల్పుతామన్నారు. ఈ దేశ పౌరులందరూ సమానమే అయినప్పుడు, సమన్యాయం కోసం పోరాడాలనే విషయాలు అవగాహన పరుస్తామన్నారు. మెజారిటీ- మైనారిటీ అంటూ ఒకే దేశంలోని ప్రజలు రెండు రకాలుగా రెండు న్యాయవ్యవస్థలను, రెండు చట్టాలను కలిగి ఉండటం అసహజం అని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ ప్రజలందరూ ఒకటే అనే భావన తీసుకొచ్చేందుకు కామన్ సివిల్ కోడ్ ను తీసుకొచ్చే విషయంలో మద్దతుగా ఉండటం.. వర్గాల వారిగా, మతాలవారీగా పనిగట్టుకొని జనాభాను పెంచుతున్న వారిని అదుపు చేసి జనాభా సమతుల్యం పాటించడం అత్యవసరం అన్నారు. జిహాదీల ముసుగులో చేస్తున్న అరాచకాలు.. ఆడపిల్లల అవహరణ (లవ్ జిహాద్).. మతమార్పిడులు.. దేవాలయల భూకబ్జాలు.. గోహత్యలు.. తదితర విషయాలపై అవగాహన పరచడంతో పాటు యువతను చైతన్యం చేస్తామని నాయకులు చెప్పారు.

“ముఖ్యంగా దేశం అభివృద్ధి చెందాలంటే యువత జాగృతం కావాలి. జరుగుతున్న పరిణామాలపై సంపూర్ణ సమాచారం తెలిసి ఉండాలి. రాజ్యాంగంలోని హక్కులు పొందడంతో పాటు, దేశ భద్రతను బాధ్యతగా మసులుకోవడం యువత కర్తవ్యం” అని బజరంగ్ దళ్ నేతలు గుర్తు చేశారు. ఇదే సందర్భంగా దేశంలోని అనేక విషయాలను, పూర్వ చరిత్రను అవగాహనపరిచి యువతను జాగృతం చేసేటందుకోసమే బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో “శౌర్య జాగరణ యాత్ర ” చేపడుతున్నామని వారు చెప్పారు.ఈ సందర్భంగా శౌర్య జాగరణ యాత్ర గోడపత్రికలు, కరపత్రాలు, స్టిక్కర్లు ఆవిష్కరించారు.

LEAVE A RESPONSE