* రాష్ట్రంలో విస్తారంగా పనస మొక్కల పెంపకం
* ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రూపకల్పన
* రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షోరూమ్ ల ఏర్పాటు
* ఆకట్టుకునేలా ప్రస్తుత షో రూమ్ ల అభివృద్ధి
* బొబ్బిలి చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పిస్తాం
* హస్త కళాకారులను ప్రోత్సహించండి
* అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత
అమరావతి : బొబ్బిలి వీణ తయారీదారులకు అవసరమైన ముడి సరకు పనస చెక్కను ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి అందజేయనుందని సమాధానమిచ్చిన రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షో రూమ్ లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి స్పందించారు.
ప్రపంచ గుర్తింపు పొందిన బొబ్బిలి వీణ తయారీదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారికి అవసరమైన ముడి సరకు పనస చెక్కను అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో విస్తారంగా పనస చెట్ల పెంపకానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించినట్లు వెల్లడించారు.
ఇదే విషయమై ఇప్పటికే అటవీ, గిరిజన సంక్షేమ శాఖాధికారులతో చర్చించామన్నారు. వీణ తయారీకి 30 ఏళ్లు పెరిగిన పనస చెట్టు కలప మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పనస కలప కొనుగోలు చేసి వీణ తయారీదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షో రూమ్ ల ఏర్పాటు
తయారైన బొబ్బిలి వీణలు మార్కెటింగ్ సదుపాయానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షో రూమ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లేపాక్షి షో రూమ్ లను వినియోగదారులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తిరుపతిలో నిలిచిపోయిన హ్యాండ్ క్రాఫ్ట్ విలేజ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
బొబ్బిలి చేనేత చీరలకు ప్రాచుర్యం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తయారవుతున్న చేనేత వస్త్రాల మాదిరిగా బొబ్బిలి చీరలకు కూడా ప్రాచుర్యం తీసుకొస్తామని మంత్రి సవిత వెల్లడించారు. ఓడీ ఓపీ కింద బొబ్బిలి చేనేత చీరల అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. చేనేత వస్త్రాల రూపకల్పనలో నూతన డిజైన్లపై శిక్షణ అందజేస్తోందన్నారు. చేనేతలకు అవసరమైన పనిముట్లు సైతం అందజేస్తున్నామన్నారు. విజయనగరం సంగీత కళాశాల సమస్యల పరిష్కరిస్తామని మరో పశ్నకు మంత్రి సవిత జవాబిచ్చారు.
హస్త కళాకారులకు అండగా నిలవండి
హస్త కళాకారులకు సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోడి ఎంతో ప్రోత్సహిస్తున్నారని మంత్రి వెల్లడించారు. హస్త కళల ఉత్పత్తులు కొనుగోలు చేసి, హస్త కళాకారులకు రాష్ట్ర ప్రజలంతా అండగా నిలవాలని సభా వేదికగా మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా శాసనసభ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు బనానా ఫైబర్ తో రూపొందించిన హ్యాండ్ బ్యాగ్ లను అందించామని మంత్రి సవిత తెలిపారు.