– రెండు కార్డుల విధానం సరికాదు
– బిజెపి ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రతినిధులు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని హైదరాబాద్లో కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మహేశ్వర్ రెడ్డి దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. గతంలో ఉన్న జీవో 239 ప్రకారం సుమారు 23 వేల మందికి అక్రిడిటేషన్ కార్డులు లభించేవని, కానీ నూతన జీవో 252 వల్ల దాదాపు 13 వేల మంది జర్నలిస్టులు కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ముఖ్యంగా డెస్క్, బ్యూరో జర్నలిస్టులంటూ విభజించి, రెండు కార్డుల విధానాన్ని తీసుకురావడం వల్ల జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు గీసినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై అసెంబ్లీలో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, కోశాధికారి పి.యోగనంద్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర అధ్యక్షులు రాకేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ తదితరులు ఉన్నారు.