– మేము మీ దగ్గర ఏమి నేర్చుకోవాలి? చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా?
– మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా?
– సుంకిశాల ఎలా కూల్చామో చూపిస్తారా?
– వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో వివరిస్తారా?
– కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో చెప్పబోతున్నారా? అంటూ కెటిఅర్ తీవ్ర వ్యాఖ్యలు
– సభలో సమాన హక్కులు ఇవ్వండి – పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం కల్పించాలి
– అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సభను బాయ్‌కాట్ చేసింది
– ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేసిన కేటీఆర్
– మీడియాతో తెలంగాణ భవన్ లో కేటీఆర్
హైదరాబాద్ : శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు కూడా అదే అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారక రామారావు (కేటీఆర్) డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్‌లో ఈరోజు మీడియాతో మాట్లాడిన కేటీఆర్, సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. మేము అడిగింది చాలా సింపుల్, “మీరు మీ వెర్షన్ చెప్పండి, మేము మా వెర్షన్ చెబుతాం. మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వండి అని మాత్రమే కోరుతున్నాం. మేము ప్రధాన ప్రతిపక్షం.
గత పదేళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.
గతంలో 2016 మార్చి 31న కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ దాన్ని బాయ్‌కాట్ చేసి, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. “అప్పుడు తప్పు అన్న కాంగ్రెస్ పార్టీకి, ఈరోజు అదే పద్ధతి సరైనదిగా ఎలా మారింది?” అని ప్రశ్నించారు. ఈ అంశంపై స్పీకర్ గారికి లేఖ కూడా ఇచ్చామని, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని తెలిపారు.
నదీ జలాలపై, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు భాక్రా నంగల్ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని, అసలు ఆ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ నదీ బేసిన్‌లో ఉందో కూడా తెలియని ముఖ్యమంత్రి తో గోదావరి–కృష్ణా జలాలపై ఈరోజు చర్చ చేయాలా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాగునీటి రంగంలో చోటుచేసుకున్న వైఫల్యాలను కేటీఆర్ వివరించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు మరణించిన ఘటనలో ఇప్పటివరకు వారి మృతదేహాలను కూడా వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తిగా కూలిపోయినా, ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేని దుస్థితి ఉందన్నారు. ఆ ఘటనకు బాధ్యులైన ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ సిఫార్సు చేసినప్పటికీ, ఆ సంస్థపై చర్యలు తీసుకోలేని స్థాయిలో ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంటే చేతులు కట్టుకుని చూస్తూ నిలిచిపోయిన ప్రభుత్వం ఇది అని కేటీఆర్ ఆరోపించారు. “మేము మీ దగ్గర ఏం నేర్చుకోవాలి? చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చామో వివరిస్తారా? వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో చూపిస్తారా? లేక కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్‌లో చూపిస్తారా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా పూర్తిగా పక్కన పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి తరచూ “పండబెట్టి తొక్కుతాం” అంటారని, నిజంగానే ఆ పథకాన్ని పండుకోబెట్టి, తెలంగాణ రైతాంగాన్ని – ముఖ్యంగా పాలమూరు రైతాంగాన్ని తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా సాగునీరు అందించిందా? ఒక్క చెరువును బాగు చేసిందా? ఒక్క కాలువను మరమ్మత్తు చేసిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. “ఏం చేశారని మీరు ప్రజల ముందు చెప్పుకుంటారు?” అని నిలదీశారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి విస్తరణ ద్వారా తెలంగాణ వ్యవసాయాన్ని చారిత్రాత్మకంగా ముందుకు తీసుకెళ్లామని, ఆ నిజాలను శాసనసభలో వివరించేందుకు బీఆర్‌ఎస్ పూర్తిగా సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రభుత్వం అయితే, ప్రధాన ప్రతిపక్షానికి సమాన అవకాశం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.