– హోంమంత్రి అనిత ఇష్టానుసారంగా మాట్లాడ్డం చట్ట విరుద్ధం
– కొమ్మినేని పై ఉద్దేశ పూర్వకంగా విషం కక్కుతున్నారు
– వైయస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి
తాడేపల్లి: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని నుద్దేశించి దుర్మార్గుడు అంటూ హోంమంత్రి అనిత మాట్లాడడం హేయం. కొమ్మినేని విషయంలో హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తాం. డిబేట్‌లో పార్టిసిపెంట్ మాటలను కొమ్మినేని కి ఎలా ఆపాదిస్తారని సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని కడిగేసింది.
కొమ్మినేని విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగింది కాబట్టే సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు ఇచ్చింది. తన విచక్షణాధికారాన్ని వినియోగించి ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు కొమ్మినేని విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే కొమ్మినేని పై ఉద్దేశ పూర్వకంగా విషం కక్కుతున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ ప్రభుత్వం కుట్రను బద్దలు చేశాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలను తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తాము చేసిన ఆరోపణలనే ఈ రాష్ట్రం, దేశమే కాదు, కోర్టులు కూడా నమ్మాలన్న భావనలో ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాలన్న విజ్ఞత హోంమంత్రి చూపడంలేదు. ఒక హోంమంత్రికి సుప్రీంకోర్టు ఆదేశాల విలువ తెలియకపోవడం దురదృష్టకరం. హోంమంత్రి అనిత మాటలు సుప్రీంకోర్టును తప్పుబట్టేలా ఉన్నాయి.
ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు, విచారణలో ఉందనే విషయం ఆమెకు తెలియదా?సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై ఒక హోంమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడ్డం చట్ట విరుద్ధం. కొమ్మినేని అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది. డిబేట్లు చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి దేశాలు ఇవ్వలేదు.
జర్నలిస్టుగా ఆయన వాక్ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యతనూ సుప్రీంకోర్టు గుర్తుచేసింది. కావాలంటే ఆ తీర్పు కాపీని మంత్రికి పంపిస్తాను. తాను అనని మాటలను కొమ్మినేనికి ఆపాదించి, ఆ ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడులకు పోలీసులు పహారా కాశారు. దాడుల్లో పాల్గొన్న వారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలే.
వీడియో, ఫొటోల రూపంలో అన్ని ఆధారాలున్నాయి. తుదపరి విచారణలో మొత్తం ఈ వ్యవహారాన్ని కోర్టు ముందుపెడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. లేకుంటే అరాచకం ప్రబలుతుంది.