ఇవాళ సజ్జాద్ హుసైన్ జయంతి..
ప్రత్యగ్రం; ప్రశస్తం
మనదేశ సినిమాలో అనన్యమైన (none such), అతి విశిష్టమైన పాటలు చేసిన సంగీత దర్శకుడు సజ్జాద్ హుసైన్ (హుస్సేన్, హుస్సైన్ రెండూ సరికావు). సంగీతం ఒక అద్భుతమైతే ఒక అద్భుతం సంగీతమైతే అది సజ్జాద్ సంగీతం. సజ్జాద్ సంగీతం అపూర్వమైనది; అసాధారణమైనది! సజ్జాద్ సంగీతం ప్రత్యగ్రం; ప్రశస్తం.
స్వరాలకు పైన
సంగీతం స్వరాలలో ఉంటుందా? సంగీతం స్వరాలకు పైన నెలకొని ఉంటుంది! ఈ జ్ఞానం ఉన్న సంగీతజ్ఞుడు సజ్జాద్ హుసైన్ కురైషీ. బాలమురళీకృష్ణ, మెహ్దీహసన్, మొహమ్మద్ రఫీ, లతామంగేష్కర్ వంటి కళాకారులకు ఈ జ్ఞానం ఉంది. సినిమా సంగీతం విద్వత్తుకు, కృషికి, ప్రతిభకు, సృజనాత్మకతకు, ప్రజ్ఞకు, నిర్వహణా సామర్థ్యానికి సంబంధించింది.
సినిమా సంగీత దర్శకుడికి శాస్త్రీయ సంగీతంపై, సంగీత వాయిద్యాలపై, టెక్నాలజీపై, sound designingపై గాయనీగాయకుల గాత్ర ధర్మంపై, సాహిత్యంపై, సినిమా కథ, కథనంపై సరైన తెలివిడి ఉండాలి. మనదేశ సినిమా సంగీతంలో పలువురు మేధావులు, ప్రతిభావంతులు, దార్శనికులు వచ్చారు. మనదేశ సినిమాలో ప్రత్యగ్రమైన, ప్రత్యేకమైన, ప్రశస్తమైన సంగీతం చేసిన వారు సజ్జాద్ హుసైన్.
మేండలిన్తో శాస్త్రీయ సంగీతం
విదేశీ వాయిద్యం మేండలిన్తో భారతదేశ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన తొలి సంగీత కళాకారుడు సజ్జాద్ హుసైన్ కురైషీ. మేండలిన్ శ్రీనివాస్ మేండలిన్పై కర్ణాటక సంగీతాన్ని నినదిస్తే సజ్జాద్ తొలిసారి మనదేశ శాస్త్రీయ హిందూస్థానీ సంగీతాన్ని మేండలిన్పై పలికించారు. ఒక్క మేండలిన్ వాదనలో మాత్రమే కాదు వీణ, వైఅలిన్, పిల్లనగ్రోవి, పీఅనో (piano), జలతరంగం, హార్ప్, బాన్‌జో, అకాడిఅన్, గిటార్, సితార్, క్లారినట్ వాయిద్యాలు వాయించడంలో దిట్ట సజ్జాద్.
ఉస్తాద్ బడే గలామ్ అలీ ఖాన్
ఒక సభలో ఉస్తాద్ బడే గులామ్ అలీ ఖాన్ గాత్ర కచేరీ ప్రారంభానికి ముందు విరామ సమయంలో వేదికపై సజ్జాద్ మేండలిన్ వాయించారు. బడే గులామ్ అలీ ఖాన్ దాన్ని విని తన గదికి పిలిపించుకుని సజ్జాద్‌ను “ఈ సంగీతాన్ని దేనిపై వాయించావు?” అని అడిగారట. మేండలిన్ను
చూపించారు సజ్జాద్.
ఆశ్చర్యపోయిన బడే గులామ్ ఆలీ ఖాన్ “ఇంత చిన్న వాయిద్యం నుంచి అంత గొప్ప సంగీతం వచ్చిందా?” అని అంటూ “నేనే కాదు ఏ సంగీత ఉస్తాద్ కూడా నీ కాలిగోటికి సరిరారు” అన్నారట. అంత గొప్ప సంగీత స్రష్ట సజ్జాద్ హుసైన్. మేండలిన్తో హిందూస్థానీ సంగీత కచేరీలు చేశారు ఆయన. మేండలిన్ శ్రీనివాస్ మేండలిన్పై కర్ణాటక సంగీతాన్ని నినదిస్తే సజ్జాద్ హుసైన్ తొలిసారి మనదేశ శాస్త్రీయ హిందూస్థానీ సంగీతాన్ని మేండలిన్పై పలికించారు. మేండలిన్ వాయిస్తున్నప్పుడు ఆయన చేతి వేళ్లు కళ్లకు కనిపించనంత వేగంగా కదిలేవట.
ఎస్. బాలచందర్
ఒకసారి మద్రాస్‌లో సజ్జాద్ మేండలిన్ కచేరి విన్న వీణ ఎస్. బాలచందర్ ఇది అద్భుతమైన సంగీతం అన్న అర్థంలో తమిళ్ష్ వాడుకలో “ఇతనెక్కడి వాడు? ఇదేం సంగీతం?” అంటూ ఆశ్చర్యపోయారట. వీణ బాలచందర్ మామూలు కళాకారుడు కాదు; ఆయన వీణా వాదనా దురంధరుడు; సంగీత చండశాసనుడు. ఆయన సజ్జాద్ హుసైన్‌ను అలా మెచ్చుకోవడం ఎంతో గొప్ప విషయం. మేండలిన్పై సంగతుల్ని పలికించడం సామాన్యమైన విషయం కాదు. అలాంటిది సజ్జాద్ చాల క్లిష్టమైన సంగతుల్ని కూడా మేండలిన్పై అలవోకగా పలికిస్తారు. మేండలిన్తో ఆయన చేసే స్వర ప్రస్తారం అనితరసాధ్యం. ఆయన note – phrases అమోఘమైనవి; అసదృశమైనవి. సమతౌల్యం, విద్వత్, ప్రజ్ఞ వీటితోఆయన మేండలిన్ వాదన ఒక సంగీత ఝరి.
1944లో
సజ్జాద్ కొన్ని హిందీ చలన చిత్రాలకు సంగీతం చేశారు. మనదేశ సినిమాల్లో Sound designing అన్నది సజ్జాద్, శంకర్-జైకిషన్ ఈ ఇద్దరితో మొదలయింది. సజ్జాద్ తొలిగా 1944లో వచ్చిన గాలీ అన్న హిందీ సినిమాలో 3 పాటలు చేశారు సజ్జాద్. గాయని నిర్మలా పాడిన “అబ్ లాగీ పే లాగీ రామ్…” పాట సజ్జాద్ తొలి సినిమా పాట. ఆ సినిమాకు హనుమాన్ ప్రసాద్ అన్న మరొకరూ సంగీతం చేశారు. 1944లో వచ్చిన దోస్త్ సినిమా పూర్తిగా సజ్జాద్ సంగీతం చేసిన తొలి సినిమా.
అప్పటి నుంచీ 1973లో వచ్చిన మేరే షికార్ సినిమా వరకూ 19 సినిమాలకు సంగీతం చేశారు. వాటిల్లో కొన్ని సినిమాలకు ఆయన పూర్తిగా సంగీతం చెయ్యలేదు. దిలీప్‌కుమార్ కథానాయకుడుగా చేసిన హల్చల్ (1951) సినిమాలో 3 పాటలు మాత్రమే సజ్జాద్ చేశారు. అవి రాజ్‌కుమారి పాడిన “కోయీ కిస్ తర్హా…”, లతామంగేశ్కర్ పాడిన “లుటా దిల్ మేరా…”, “ఆజ్ మేరీ నసీబ్…” పాటలు.
మెరుపు
“ఆజ్ మేరీ నసీబ్…” పాటను విని ఉత్తమాభిరుచి ఉన్నవాళ్లు విస్తుపోయారు. ఆ పాటలో landing notes రసజ్ఞత ఉన్న వాళ్ల తలలు తిప్పేట్టు చేశాయి. Metronomic balanceతో (గాయని లతా మంగేష్కర్) పాడబడిన ఒక విలువైన నిర్మాణంతో ఉంటుంది ఆ పాట. 1946లో వచ్చిన 1857 అన్న సినిమాతో సజ్జాద్ ఒక గొప్ప సినిమా సంగీత దర్శకుడుగా తెలియవచ్చారు. 1950లో వచ్చిన ఖేల్ సినిమాలో “భూల్ జాయే దిల్…” అంటూ లతా మంగేష్కర్ పాడిన పాట అనాటికి భారతదేశ సినిమా పాటల్లో ఒక మెరుపు.
Countermelodies
1951, 52 లలో సజ్జాద్ సంగీతంలో వచ్చిన సయ్యాన్, సంగ్దిల్ సినిమాల్లో అద్భుతమైన సంగీతం పండింది. సయ్యాన్ సినిమాలో “తుమే దిల్ దియా …” అంటూ లతా మంగేష్కర్ పాడిన పాట ఆ రోజుల్లో సజ్జాద్ మస్తిష్కం నుంచి పుట్టడం ఆశ్చర్యకరం. ఇప్పటికీ విస్మయాన్నిస్తుంది ఆ పాట. ఆయన ఎలా ఆ పాటను ఆలోచించగలిగారో? ఆ సినిమాలో మరో గొప్పపాట “వొ రాత్ దిన్ వొ చాందినీ…” అంటూ లతా మంగేష్కర్ పాడిన పాట. ఆ పాటలో countermelodies లేదా countersubjects ఉంటాయి.
మనదేశంలో అరుదుగా వచ్చిన countermelodies పాటల్లో ఆ పాట ఒకటి. “ఏ హవా ఏ రాత్ ఏ చాందినీ…”, “దిల్ మే సమాగయే సజన్…”, “కహాహో కహా మేరే జీవన్ సహారే…” వంటి శ్రేష్ఠమైన పాటల్ని సంగ్దిల్ సినిమాలో చేశారు సజ్జాద్. సంగ్దిల్ సినిమాలోని “కహాహో కహా మేరే జీవన్ సహారే…” మరో లోకపు పాట. ఆ పాటలో prelude గా సజ్జాద్ పీఅనో (piano) వాయిద్యాన్ని అద్భుతంగా పలికించారు. Emotive excellence ఈ పాట.
హంసధ్వని
సంగ్దిల్ సినిమాలో ఒక నాట్య సన్నివేశానికి హంసధ్వని రాగంలో సజ్జాద్ కల్పించిన వాద్య సంగీతం ఎంతో గొప్పది. ఆ సినిమాలో ఆశాభోస్లే చేత “దర్ద్ భరీ కిసికి యాద్…” అంటూ గొప్పగా పాడించారు సజ్జాద్. ఓ.పీ. నయ్యర్ కన్నా ముందే సజ్జాద్ ఆశాభోస్లే చేత గొప్పగా పాడించారు; గొప్ప పాటలు పాడించారు. 1955 లో వచ్చిన రుఖ్సానా సినిమాలో ఆశాతో “దిన్ రాత్ …” అన్న కవ్వాలిని కూడా పాడించారు సజ్జాద్.
న భూతో న భవిష్యతి పాట
1963లో వచ్చిన రుస్తమ్ సొహ్రాబ్ సినిమా ఒక సంగీత అద్భుతం. అందులో అన్ని పాటలూ మహోన్నతమైనవే. “ఏ దిల్ రుబా…” అంటూ లతా మంగేష్కర్ పాడినది అత్యంత అద్భుతమైన పాట. అది న భూతో న భవిష్యతి పాట. ఒక్క సజ్జాద్ మస్తిష్కానికి తప్ప మరెవరి ఆలోచనకూ అందని పాట. మరే సంగీత దర్శకుడూ కలగనని, కలగనలేని పాట.
ఇలాంటి పాట ఇదొక్కటే. ఆ సినిమాలో “ఫిర్ తుమ్హారీ యాద్ ఆయే ఏ సనమ్…” పాట మరో అద్భుతం. మన్నాడే, మొహమ్మద్ రఫీ, సాదత్ ఖాన్ ముగ్గురు పాడారు. అనూహ్యమైన కల్పనా చాతుర్యం ఈ పాటలో వినిపిస్తుంది. రుస్తమ్ సొహ్రాబ్ ఒక్క సినిమా చాలు ఆయన ఒక అపూర్వమైన సంగీత మేధావి అని తెలుసుకోవడానికి. గాయని సురైయా చివరి గొప్ప పాట “యే కైసీ అజబ్ దాస్తాన్ హోగయీ…” ఈ సినిమాలోదే.
ఆరబీ, పెర్షియా
అరబీ సంగీతానికి, పెర్షియా సంగీతానికి బాగా దగ్గరి పొలికలు ఉన్నా రెండిటికీ తేడా ఉంది. అరబీ సంగీతమూ, పెర్షియా సంగీతమూ ఒకటి కాదు.
(అరబీ సంగీతాన్ని శంకర్-జైకిషన్ చక్కగానూ, చిక్కగానూ వాడారు) అరబీ సంగీతానికి, పెర్షియా సంగీతానికి ఉండే తేడా సరిగ్గా తెలిసిన సజ్జాద్ రుస్తమ్ సొహ్రాబ్ సినిమాను (అరబీ ధోరణిలో కాకుండా) పెర్షియా సంగీతంగా చేశారు; ఆ పెర్షియా సంగీతాన్ని చాల ప్రతిభావంతంగానూ, ప్రభావవంతంగానూ ప్రయోగించారు. అందుకు ఋజువు ఈ సినిమాలో ఆశా పాడిన “అబ్ దేర్ హో గఈ వల్లాహ్…” పాట.
శబ్ద-ఔన్నత్యం
సయ్యాన్, సంగ్దిల్, రుస్తమ్ సొహ్రాబ్ సినిమాల్లో ఆయన కూర్చిన, సమకూర్చిన నేపథ్య సంగీతం (re- recording) మహోన్నతమైనది. ఒక conceptualized re- recording సజ్జాద్ది. శబ్ద-ఔన్నత్యం ఆయన సంగీతంలో తొణికిసలాడుతూంటుంది. పాటలకు rhythmగా తబలా వంటి చర్మ వాయిద్యాల్ని (membrano phonesను) ఆ కాలంలోనే తీసేశారు సజ్జాద్. అది ఆయన దార్శనికత. ఈ కాలంలో ఎ.ఆర్. రహ్మాన్ పాటల్లో ఈ అంశం మనకు తెలుస్తోంది.
Contrapuntals
సినిమా పాట అంటే ఒక్క మట్టు లేదా బాణి (tune) మాత్రమే కాదు. ఆ బాణికి వాయిద్య సంగీతమూ ఎంతో ముఖ్యం. ఒక పాటలో వాయిద్య సంగీతం ఏదో ఖాళీలు నింపడం లాంటిది కాదు. బాణి, వాద్య సంగీతం కలిస్తేనే పాట. పాట అన్నది సాహిత్యాన్ని స్వరబద్ధం చేసి గాత్రంతో వెలిబుచ్చడం కాదు. ఈ విషయం బాగా తెలిసినవారు సజ్జాద్. ఆయన బాణి వాద్య సంగీతం నైపుణ్యంతోనూ, నాణ్యమైనవిగానూ, సృజనాత్మకంగానూ ఉంటాయి. Counterpoints (contrapuntals)ను వాద్య సంగీతంలో అమర్చేవారు సజ్జాద్.
100కు తక్కువగా
1973లో సజ్జాద్ తన కొడుకు పేరుతో జీయా రాత్ గాహే హిందీ అన్న సినిమాకు సంగీతం చేశారు అని వీ.ఎ.కె. రంగారావు తెలియజేస్తున్నారు. 1975లో కూడా సజ్జాద్ ఒక సినిమా చేసినట్టు వినికిడి. 1959లో సజ్జాద్ దెయ్వయోగాయా అన్న సింహళ సినిమాకు సంగీతం చేశారు. 19 + ఈ రెండూ కలుపుకుంటే సజ్జాద్ మెత్తం 21 సినిమాలకు చేశారు.
సజ్జాద్ 100కు తక్కువగా సినిమా పాటలకు సంగీతం చేశారు (ఈ విషయంగా నేనేమైనా పొరబడి ఉంటే క్షంతవ్యుణ్ణి). మొహమ్మద్ రఫీ పాడగా కొన్ని పంజాబీ ‘హీర్’లు కూడా చేశారు సజ్జాద్.
Original
స్వీయ సృజన (original) సంగీతం మాత్రమే చేశారు సజ్జాద్. “ఇతరుల సంగీతాన్ని తస్కరించని ఏకైక సంగీత దర్శకుడు సజ్జాద్” అనీ, “మనదేశంలోనే గొప్ప చలనచిత్ర సంగీత దర్శకుడు సజ్జాద్” అనీ సంగీత దర్శకులు మదన్ మోహన్, సీ. రామ్‌చంద్ర , సలిల్ చౌధరీ ప్రభృతులు తమ మనసుల్లోని మాటలుగా చెప్పారు. సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ “సజ్జాద్, మనదేశంలో ఒక విశిష్టమైన సంగీత దర్శకుడు” అని చెప్పారు. మదన్ మోహన్, సీ. రామ్‌చంద్ర , నొ(నౌ)షాద్ సజ్జాద్ ప్రభావంతో కొన్ని పాటలు చేశారు.
మదన్ మోహన్ ఆఖ్రీదాఁవ్ సినిమాలో “తుఝే క్యా సునాఉన్ మేరే దిల్రుబా…” పాటను సజ్జాద్ చేసిన “యే హవా యే రాత్ యే చాంద్నీ…” పాట ప్రభావంతో చేసి సజ్జాద్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. 1949లో నొ(నౌ)షాద్ చేసిన దులారీ సినిమాలో మొహమ్మద్ రఫీ పాడిన “సుహానీ రాత్ దల్ చుకీ…” పాటకు సజ్జాద్ చేసిన (విడుదలవని సినిమాలోని) ఒక పాట ఆధారమట. “సజ్జాద్ అత్యంత ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడు” అని నొషాద్ చెప్పారు.
“ఎవరైనా తనను తాను గాయకుడు అనో గాయని అనో అనిపించుకోవాలంటే సజ్జాద్ పాటలు పాడాలి అప్పుడు కానీ వాళ్లు గాయకులో కాదో తెలుస్తుంది” అని లతా మంగేష్కర్ ఒక సందర్భంలో అన్నారు. ఆమె 2012లో ఒక ముఖాముఖిలో తన అభిమాన సంగీత దర్శకుడు సజ్జాద్ అని చెప్పారు.
గోరంతదీపం, ముత్యాలముగ్గు
సజ్జాద్ హుసైన్ తెలుగులో గోరంతదీపం మొత్తం సినిమాకు మేండలిన్తో నేపథ్య సంగీతం చేశారు. ముత్యాలముగ్గు చిత్రంలో ప్రారంభం నుంచి నాయికానాయకుల తొలిరాత్రి సన్నివేశం వరకూ నేపథ్య సంగీతంగా తన మేండలిన్ వాదనను అందించారు. ఈ రెండు సినిమాలకు కె.వీ. మహాదేవన్ సంగీత దర్శకుడు అయినా సజ్జాద్ అందించిన వేండలిన్ సంగీతం పూర్తిగా సజ్జాద్ సృష్టే. బాపు వల్ల సజ్జాద్ తెలుగుకు వచ్చారు; పీ.బీ.శ్రీనివాస్ వల్ల సజ్జాద్ బాపుకు తెలియవచ్చారు.
నిజం
సజ్జాద్ చాల కరుకు మనిషి. తన ప్రవర్తనవల్లా, తన మాటలవల్లా ఎన్నో సినిమాలను పోగొట్టుకున్నారు. ఆయన మాత్రమే చెయ్యగలిగిన ఎన్నో గొప్ప గొప్ప పాటలు ఆయన వల్లే రూపొందకుండాపోయాయి. రూపొంది మనకు అందిన సజ్జాద్ పాటలు ప్రత్యేకమైనవి ఆపై అనన్యమైనవి (unique and none such). సజ్జాద్ మేండలిన్ సంగీతమూ, సినిమా సంగీతమూ అసాధారణమైనవి. Out landish and out standing సంగీతం సజ్జాద్ హుసైన్ సంగీతం. ఆయన musical flair and flavour విలక్షణమైనవి ఆపై విశిష్టమైనవి. “నా సంగీతాన్ని ఎవరూ వెలకట్టి కొనలేరు” అన సజ్జాద్ ఈ రచయితతో అన్నారు; అది నిజం! (బాగా చిన్నప్పుడు ఆయన ఇంట్లో ఆయన పక్కన కూర్చుని ఆయన మేండలిన్ సంగీతం వినడం ఈ రచయిత భాగ్యం)
మరో స్థాయి
మన దేశ సినిమాల్లో మరోస్థాయి సంగీత దర్శకుడు సజ్జాద్. శంకర్-జైకిషన్, ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్, ఆర్.డీ. బర్మన్, ఎ.ఆర్. రహ్మాన్ ఈ నలుగురిలా దార్శనిక (visionary) సంగీత దర్శకుడు కాదు సజ్జాద్. సలిల్ చౌధరీ, ఓ.పీ. నయ్యర్, ఇళైయరాజా ఈ ముగ్గురిలా ట్రెండ్ సెట్టర్ కాదు సజ్జాద్. (శంకర్-జైకిషన్, ఆర్.డీ. బర్మన్, ఎ.ఆర్. రహ్మాన్ దార్శనికులు మాత్రమే కాదు ట్రెండ్ సెట్టర్స్ కూడా) అయినా సజ్జాద్ సంగీతం మనదేశ సినిమా సంగీతంలో ప్రత్యగ్రమైంది; విశిష్టమైంది; అత్యంత ప్రత్యేకమైంది, ప్రశస్తమైంది. An out landish, an out of the world, an out and out ‘extra’ ordinary సంగీత దర్శకుడు సజ్జాద్. మరెవ్వరూ సజ్జాద్కు పోటీ కాదు. ‘సజ్జాద్ = సజ్జాద్’. (జూన్ 15, 1917లో పుట్టిన సజ్జాద్ 21 జూలై 1995న తమ 78యేళ్ల వయసులో మరణించారు.) “ఒక విశేష సంగీత శేముషి సజ్జాద్ హుసైన్ కురైషీ”
– రోచిష్మాన్
9444012279