– త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర
– అక్కడే అభ్యర్ధుల ప్రకటన
– కార్యకర్తల్లో పెరిగిన ఉత్సాహం
– ఐటీడీపీపై గురుతర బాధ్యత
– తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామని తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. రాజకీయ ప్రత్యర్ధులకు టీడీపీ సత్తా చాటే రోజు, అతి త్వరలోనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న కష్టాలను, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ఐటిడిపి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి కాసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ సహా, ఇతర నేతలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఐటిడిపి కార్యవర్గాన్ని అభినందించిన కాసాని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఐటిడిపి క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఐటిడిపిపై గురుతర బాధ్యత ఉందన్నారు.
తెలంగాణలో టీడీపీ బలపడుతోందని, అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించిన తర్వాత, కార్యకర్తల్లో ఉత్సాహం పెరగడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో బస్సు యాత్ర ప్రారంభం కానుందని, అక్కడే అభ్యర్ధుల ప్రకటన కూడా చేస్తామని వెల్లడించారు. అక్కడే అన్నీ మాట్లాడతామని, తెలంగాణ ప్రజలు మళ్లీ టీడీపీ పాలన కోసం ఎదురుచూస్తున్నారని కాసాని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి , జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కాసాని వీరేశం , నందమూరి సుహాసిని, తిరునగరి జ్యోత్న్స, శ్రీపతి సతీష్, తెలంగాణ రాష్ట్ర ఐ.టిడిపి అధ్యక్షుడు హరికృష్ణ , యం.డి.గౌస్ పాల్గొన్నారు.