Suryaa.co.in

Andhra Pradesh

కొడాలి నాని దుర్భాషలకు బదులు తీర్చుకుంటాం

– గుడివాడ గెల్చుకుని చంద్రబాబుకు కానుకగా ఇస్తాం
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

విజయవాడ, నవంబర్ 4: తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్న దుర్భాషలకు బదులు తీర్చుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గాన్ని గెల్చుకుని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ విస్తృతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పదే పదే చంద్రబాబును, లోకేష్ ను ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై దుర్భాషలాడడాన్ని గుడివాడ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు రాజేష్ అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే కొడాలి నాని వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులను రాత్రి వేళల్లోనే అరెస్ట్ చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని చెప్పారు.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2024 ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలుగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. దేశంలో మొదటిసారిగా టీడీపీ హయాంలోనే మైనార్టీలకు కార్పోరేషన్ ఏర్పాటు జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీని తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను చంద్రబాబు ఇచ్చారన్నారు.

దేశ చరిత్రలో ముస్లిం పెద్దలకు ఆర్థికసాయం చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని అన్నారు. ఏటా 10వేల మంది ముస్లింలకు రుణ సదుపాయాన్ని కల్పించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో అన్నివర్గాల సంక్షేమానికి కృషి జరిగిందని గుర్తుచేశారు. కాగా, ఇటీవల విజయవాడలో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సంఘీభావం ప్రకటించడంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు.

పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వాహనాలు తిరగాయని, కొత్త వ్యక్తుల సంచారంపై అభిమానులు ఆందోళన చెందారన్నారు. ప్రభుత్వం స్పందించి దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద జరిగిన రెక్కీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే విధంగా కొంత మంది వైసీపీ నేతలు మాట్లాడడం దురదృష్టకరమని శిష్ట్లా లోహిత్ అన్నారు.

LEAVE A RESPONSE