– ప్రజా సమస్యల పరిష్కారానికై… ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో పాదయాత్ర
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 6వ రోజు మండలంలోని బాణాపురం నుంచి వల్లభి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో పాదయాత్ర కు తాటి వనాల వద్ద కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రోడ్డు పక్కన వారు వేసుకున్న పాకలోకి CLP నేతను తీసుకెళ్ళారు.
గీత కార్మికుడు వత్సవాయి కుటుంబరావు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం తాటిచెట్లు ఎక్కడానికి ఎలక్ట్రానిక్ మొక్కులు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. మత్స్య
కార్మికులు చేపలు పట్టుకుని అమ్మడానికి టీవీఎస్ లూనాలను ప్రభుత్వం ఇచ్చిందని,తమకు కూడా ఇవ్వాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హులైన సభ్యులందరికీ లైసెన్సులు ఇవ్వడం లేదన్నారు. తాటి చెట్టు పై నుంచి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఏడాదైనా ఎక్స్గ్రేషియా రావడంలేదని తెలిపారు. తాటి వనాల పెంపకం కోసం ప్రభుత్వం సొసైటీలకు కేటాయిస్తామని ప్రకటించిన మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వకపోవడంతో భవిష్యత్తులో తమ వృత్తి మనుగడ లేకుండా పోయే ముప్పు ఉందని వివరించారు.
విచ్చలవిడిగా వైన్స్ దుకాణాలు , ఊరూర బెల్టుషాపులు రావడం వల్ల కల్లు గిరాకీ దెబ్బతింటుందని చెప్పారు. ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ కోసం గళం వినిపించాలని గౌడన్న లు సీఎల్పీ నేత కు విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యలను ఏకరువు పెట్టిన తర్వాత గీత కార్మికులు సీఎల్పీ నేతను కల్లు రుచి చూడాలని బ్రతిమిలాడారు. వారి అభిమాన ఒత్తిడికి ఆయన కల్లు రుచి చూశారు.