Suryaa.co.in

Andhra Pradesh

అమరావతిపై హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు

– ముఖ్యమంత్రి మూర్కత్వం వీడి అమరావతిని అభివృద్ది చేయాలి
– నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని కోణాల్లో ఆలోచించే సీఆర్డీయే చట్టాన్ని తీసుకువచ్చారు
– హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ కార్యాలయంలో కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆధ్వర్యంలో నేతలు కేక్ కట్ చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ…. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన నవ్యాంధ్రకు ప్రజల ఆకాంక్షల మేరకు అన్ని చట్టాలకనుగుణంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిగా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా సీఆర్డీయే చట్టం రూపొందించారు.

కానీ అమరావతి నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అమరావతిపై కుట్రలు పన్నుతూ అడుగడుగునా అడ్డుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా అంతిమ విజయం అమరావతిదే అని హైకోర్టు తీర్పుతో రుజువైంది.

కోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు. ముఖ్యమంత్రి ఇకనైనా తన మూర్ఖత్వాన్ని వీడి 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల మేరకు అమరావతి రాజధానిగా అభివృద్ది చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులు కొమ్మారెడ్డి పట్టాభిరాం, గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యధ్ రఫీ, మీడియా కోఆర్డినేటర్ దారపనెనీ నరేంద్ర బాబు,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాం ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు, ఎస్పీ సాహెబ్, వల్లూరి కిరణ్, కూచిపూడి దేవేంద్ర కాటేపల్లి సత్యనారాయణ, పల్లి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE