– సీఎం రేవంత్‌కు సోనియా ప్రశంస
– గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై అభినందన
– సోనియా గాంధీ ని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సోనియా గాంధీకి అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ నేత సోనియాగాంధీ అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణలో డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ను సోనియా గాంధీకి ముఖ్యమంత్రి వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా గాంధీకి వివరించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టిని అభినందించిన సోనియా గాంధీ.. ప్రజా సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలపై మరింత దృష్టి సారించాలని సీఎంకు సూచించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.