Suryaa.co.in

Editorial

ఈటల సరే.. పవన్‌ సెక్యూరిటీ పట్టదా?

– తనకు ప్రాణహాని ఉందన్న ఈటల రాజేందర్‌
– 20 కోట్లు సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర అంటూ ఆందోళన
– రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ
– ఆగమేఘాలపై ఈటలకు వై సెక్యూరిటీ
– ఈటల భద్రతపై డీజీపీతో కేటీఆర్‌ భేటీ
– సీనియర్‌ ఐపిఎస్‌తో విచారణకు ఆదేశం
– తన హత్యకు కుట్ర జరుగుతోందన్న పవన్‌
– వారాహి యాత్రలో జనం ఎదుటే ఆందోళన
– అయినా పట్టించుకోని కేంద్రం
– సెక్యూరిటీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరని కమలదళం
– పవన్‌ మిత్రపక్షమంటూనే పక్ష పాత వైఖరి
– కేంద్రం తీరుపై జనసైనికుల ఫైర్‌
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీ తన మిత్రపక్ష నేతల విషయంలో పక్షపాతం చూపిస్తోందా? మిత్రపక్షంగా చెప్పడమే తప్ప, ఆపత్కాలంలో వారికి దన్నుగా నిలవడంలో విఫలమవుతోందా? సొంత పార్టీ నేతలకు ఒక న్యాయం, మిత్రపక్ష నేతలకు మరో న్యాయం పాటిస్తోందా? సాయం విషయంలో సమన్యాయం పాటించటం లేదా? బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మిత్రపక్షమైన జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ భద్రత విషయంలో , బీజేపీ నాయకత్వం పక్షపాతం ప్రదర్శిస్తోందా? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే వాటికి అవుననే సమాధానం వస్తోంది.

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, ఆయన భార్య జమునా రెడ్డి తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. అందులో తన ప్రాణాలకు హాని ఉందని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. తన హత్యకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కౌసిక్‌రెడ్డి 20 కోట్ల సుపారీ ఇచ్చినట్లు, కౌసిక్‌ అనుచరుల ద్వారా తెలిసిందని భార్యాభర్తలు ఆందోళన నిర్వహించారు. తన భర్తకు ఏం జరిగినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే బాధ్యత అని జమునారెడ్డి హెచ్చరించారు.

దీనితో రంగంలోకి దిగిన కేంద్రహోం శాఖ, ఈటల రక్షణపై దృష్టి పెట్టింది. ఫలితంగా ఆయనకు వై సెక్యూరిటీ ఇచ్చేందుకు రంగం సిద్ధమయింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు, త్వరలో వెలువడుతాయని పార్టీ వర్గాల్లో చర్చ మొదలయింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూడా అయిన ఈటలను రక్షించుకునేందుకు, పార్టీ నాయకత్వం ఆగమేఘాలపై స్పందించిన తీరు క్యాడర్‌ను సంతోషపరిచింది.

అయితే.. అలాంటి యుద్ధప్రాతిపదిక నిర్ణయాలు, తన మిత్రపక్షమైన పవన్‌ కల్యాణ్‌ విషయంలో చూపించకపోవడమే, జనసైనికుల ఆగ్రహానికి కారణమయింది. పవన్‌ కల్యాణ్‌ తూర్పుగోదావరిలో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని, తాను ఎక్కువ కాలం ఉంటానో లేదో తెలియదని, ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశమయింది. ఎప్పుడూ గంభీరంగా మాట్లాడే పవన్‌, ఈసారి అందుకు భిన్నంగా తన ప్రాణాలకు హాని ఉందని ప్రకటించడం, ఆయన అభిమానులను కలవరపెడుతోంది.

దానిపై జనసైనికుల్లో సహజంగానే ఆందోళన కనిపిస్తోంది. వైసీపీ సర్కారును తూర్పారపడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను వారి నియోజకవర్గాల్లోనే విప్పుతున్న పవన్‌, సహజంగానే వారి లక్ష్యానికి గురువుతున్నారని జనసైనికులు చెబుతున్నారు. సీఎం జగన్‌ను నేరుగా సవాల్‌ చేస్తున్న పవన్‌ నిర్వహిస్తున్న వారాహి యాత్రకు జనం పోటెత్తుతున్నారు. ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ కంటే, ప్రైవేటు సెక్యూరిటీనే ఎక్కువగా ఉంది. పవన్‌ తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగానే చెప్పినప్పటికీ, కేంద్రం పట్టించుకోకపోవడంపై జనసైనికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తనకు జనసేన మిత్రపక్షమని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ.. తన మిత్రపక్ష నేత ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసినప్పుడు, స్పందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని జనసేన సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఈటల తనకు ప్రాణహాని ఉందని ప్రకటించిన వెంటనే, రంగంలోకి దిగిన కేంద్రహోంశాఖ.. అదే ప్రాణహాని ఉందన్న పవన్‌ ఆందోళనను ఎందుకు పట్టించుకోవడం లేదని జనసైనికులు నిలదీస్తున్నారు.

అటు ఏపీ బీజేపీ నేతలు సైతం.. పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర బలగాల భద్రత కల్పించాలని, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటిదాకా కేంద్రాన్ని కోరకపోవడంపై, జనసైనికులలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఇప్పటిదాకా పవన్‌ వ్యాఖ్యలపై స్పందించకపోవడంపై, జనసేన నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు, రాష్ర్టానికి చెందిన జాతీయ నాయకులు గానీ స్పందించకపోవడం మరో విశేషం. దీన్ని బట్టి బీజేపీ పవన్‌ కల్యాణ్‌కు, బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విషయం స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు జనసైనికుల్లో వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE