-మీ మాటలన్నీ నీటిమీద రాతలేనా?
-కేసీఆర్ హామీలపై సంజయ్ ఫైర్
ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ మాటలన్నీ నీటిమీద రాతలేనని తెలంగాణ బీజేపీ దళపతి బండి సంజయ్ విమర్శించారు. మిగిలిన 63,425 పోస్టుల సంగతేమిటో టీఆర్‌ఎస్ సర్కారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ మేరకు సంజయ్, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..
గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
నమస్కారం …
విషయం: మిగతా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారు?
బిజెపి ప్రజా సంగ్రామ యాత్రలో అనేక చోట్ల నిరుద్యోగ యువత పోస్టుల భర్తీలో ప్రభుత్వ జాప్యంపై నా దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరు నీటి మీద రాతలుగా మిగిలిపోతున్నాయి.
మీ ప్రభుత్వం కేవలం పోలీస్‌శాఖలో రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ జారీచేసి విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేశామని మీకు మీరు డబ్బా కొట్టుకోవడం కాదు. మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విధంగా మిగతా 63,425 పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని బిజెపి తెలంగాణశాఖ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా వున్న పోస్టులు భర్తీ చేసేవరకు విద్యావంతులైన యువతకు బిజెపి అండగా వుంటుంది. వారి కోసం పోరాటం చేస్తుంది.
వనపర్తిలో మార్చి 7 న నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా మీరు నిరుద్యోగులకు ప్రభుత్వంవైపు నుండి తీపి కబురు చెప్తామని ఊరించారు. మార్చి 8న ఉదయం 10 గం॥లకు ఎవరూ మిస్‌కాకుండా టీవీ చూడాలని ఆర్భాటం చేశారు. రాష్ట్రంలో బిస్వాల్ కమిటి నివేదిక ప్రకారం ప్రభుత్వ శాఖల్లో 1 లక్షా 91 వేల పోస్టులు ఖాళీగా వున్నాయి. కానీ మీరు 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మీరు అసెంబ్లీలో చేసిన ప్రకటన లక్షలాది మంది నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
మీరు అసెంబ్లీలో ఆర్భాటంగా ప్రకటన చేసి 45 రోజులు కావొస్తున్నది. 16,614 పోలీసుపోస్టుల భర్తీకి మాత్రమే నిన్న నోటిఫికేషన్లు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కేవలం పోలీసుపోస్టుల మాత్రమే భర్తీ చేస్తూ ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. పోలీసు పోస్టుల భర్తీ కూడా మీ నియంతృత్వ పాలనకు అడ్డురాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ పోలీసు పోస్టుల భర్తీ చేస్తున్నారు తప్ప విద్యావంతులైన నిరుద్యోగులపై ప్రేమతో కాదు.
రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఇంకా రెండు నెలల్లో ప్రారంభమవుతుంది. వాస్తవానికి రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో టీచర్లు లేక విద్యావ్యవస్థ అస్థవ్యస్థంగా మారింది. రాష్ట్రప్రభుత్వం ప్రప్రథమంగా టీచర్ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావాలంటే టెట్ పరీక్ష నిర్వహించాల్సి వుంది. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. టెట్ పరీక్ష పూర్తయి ఫలితాలు రావడం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగే నాటికి సగం విద్యాసంవత్సరం పూర్తవుతుంది. నోటిఫికేషన్లు, టెట్ నిర్వహణలో ప్రభుత్వ అలసత్వం వల్ల నిరుద్యోగులు బలికావాల్సి వస్తుంది. రాష్ట్రప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయపోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాం.
మీరు మార్చి 8, 2022 అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విధంగా మిగతా 63,425 పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్లను విడుదల చేస్తారు? ఆ పోస్టులను ఎంతకాలంలో భర్తీ చేస్తారో వెంటనే ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదలచేయాలని బిజెపి తెలంగాణ శాఖ తరుపున డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో, 2014, 2018 ఎన్నికల్లో ఊరు`వాడ మీరు, మీ కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో మీ కుటుంబంలో ఐదుగురు రాజకీయ
ఉద్యోగాలు పొంది అప్పనంగా ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా ప్రతీ ఒక్క విద్యావంతులైన నిరుద్యోగ యువతీయువకులకు నెలకు 3,016/` లు నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి 2018 బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మూడున్నర సంవత్సరాలు కావొస్తున్నా ఏ ఒక్క యువతకు నిరుద్యోగభృతి ఇవ్వకుండా ఈ మూడున్నర సంత్సరాల కాలంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు రూ.1,20,640/`లు బకాయి పడ్డారు. ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని బిజెపి రాష్ట్ర శాఖ తరుపున డిమాండ్ చేస్తున్నాం.
11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 50 వేల వరకు వున్నారు. ఈ లెక్కన కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌లో మీరు ఇచ్చిన హామీ నామా మాత్రమే. రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్
ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం.ఉద్యోగాల నుంచి తొలగించిన 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన హామీ ఇప్పటికి అమలు కాలేదు.
ఏళ్ళ తరబడి ఉద్యోగ నియామకాలు ఆలస్యం కావడం వల్ల పాత, కొత్త జనరేషన్ల మధ్య నైపుణ్యంలో వచ్చే సమస్యలతో నిరుద్యోగులు తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీల భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చేవిధంగా తక్షణం జాబ్‌క్యాలెండర్‌ను ప్రకటించాలని కోరుతున్నాం.
ఎనిమిదేండ్ల తర్వాత వస్తున్న నోటిఫికేషన్లకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గ్రంథాలయాల్లో విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, పుస్తకాలు అందుబాటులో లేదు. నిరుద్యోగులకు తగినన్ని ప్రభుత్వ కోచింగ్ కేంద్రాలు లేవు.
ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలపై ప్రభుత్వం నుండి ఎటువంటి అజమాయిషి లేదు. ఇదే అదునుగా ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు నిరుద్యోగ యువతను నిలువుదోపిడి చేస్తున్నాయి. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సి బాధ్యత ప్రభుత్వానిదే. ఎటువంటి కాలాయాపన లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్రశాఖ డిమాండ్ చేస్తోంది.
అభినందనలతో …
బండి సంజయ్‌కుమార్, ఎం.పి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి.