Suryaa.co.in

Editorial

అప్పుడేటి సేసినవు సత్తిపండూ..?

– లైవ్ ఇవ్వాలని అప్పుడు జగన్ బాబును అడిగినవేటి?
– జగన్-కేసీఆర్ భేటీ లైవ్ ‘సాచ్చి’లో ఇచ్చినరేటి సత్తిబాబూ
– జగన్ బాబు సమీక్షలు లైవ్ ఇచ్చినరేటి?
– అన్నీ ఎడిట్ వీడియోలే కదా సత్తిపండూ..
– మైండుగాని పోయినాదేటి?
– మరిప్పుడు ఎట్లస్తిరప్పా?
– ‘బొత్స’ను ఆడేసుకుంటున్న నెటిజన్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇజియనగరం సత్తిబాబుకు కూసింత ఎటకారాలెక్కువ. ఆయన ఇజియనగరం తెలివితేటలు, సత్తిపండు ఇంగిలిపీసు మాదిరిగానే అఘోరిస్తుంటాయి. ఏదో మాట్లాడబోయి ఏదేదో మాట్లాడుతుంటారు. అయ్యవారిని చేయబోతే కోతి అయిందంటారే అట్లన్నమాట. ఇప్పుడూ అంతే. చంద్రబాబు-రేవంత్ భేటీపై సత్తిపండు చేసిన వ్యాఖ్యలు బూమెరాంగయి.. అది జగన్ బాబుకే తగులుకుంది.

అసలు సత్తిబాబు.. తన పార్టీ అధినేత జగన్ బాబును, ప్రత్యర్థులతో తిట్టించేందుకే ఇలాంటివి కావాలని కెలుకుతారన్నది.. పార్టీలో ఆయనంటే పడని వారు విప్పి చెప్పిన రహస్యం. అంటే తాను ఒకటి ఎదుటివారిని విమర్శించడం ద్వారా.. జగన్ బాబుపై పది విమర్శలకు అవకాశం ఇవ్వడమే, సత్తిబాబు టెక్నిక్కన్నది గిట్టని వారి ఉవాచ. నిజం ‘జగన్నాధుడి’కెరుక!

ఇక ఇజయనగరం ‘మేతా’వి, సత్తిబాబు చేసిన అమూల్యమైన సూచన ఏమిటంటే.. హైదరాబాద్ ప్రజాభవన్‌లో… అదేనండీ అప్పుడు జగన్ బాబు-కేసీఆరన్న కలసి నాటుకోడి, రాగిసంకటి, బిర్యానీ కలసి తిన్నారే.. ఆ ప్రజాభవన్ లో జరిగిన చంద్రబాబు-రేవంత్ భేటీని టీవీలలో లైవ్ ఇవ్వాలని సత్తిపండు సూచన.

ఇంకా నయం.. వారి భేటీ మధ్యలో మన ‘సాచ్చి’ మీడియా హసీనానో, లేకపోతే నిష్పక్షపాత జర్నలిస్టు కొమ్మినేనినో.. వారిద్దరికీ కుదరకపోతే టీవీ9 ‘సాచ్చి’ రజనీకాంతుడినో.. అదీకాకపోతే మొన్నటి ఎన్నికల్లో మూతి ముప్పయి వంకర్లు తిప్పుతూ, గసలు పెడుతూ వైకాపాకు శ్రమదానం చేసిన యూట్యూబర్లనో, వైకాపా గెలవకపోతే తన ఫొటోకు దండేసి వెళ్లాలన్న టీవీ ప్యానలిస్టులనో, వైకాపా గెలవకపోతే ఫలానా వాడు ఉండడన్న సెఫాలజిస్టునో కూర్చోబెట్టమని కోరనందుకు సంతోషం. బతికించారు.

సత్తిబాబు కోరిక విన్న శిక్కోలు అచ్చెన్న, చిత్తూరు అమరన్న ఆయనను ఫుట్‌బాల్ ఆడేసినారనుకోండి. అది వేరే విషయం. వారిద్దరి బంతాట పక్కనపెడితే.. సోషల్‌మీడియాలో నె టిజన్లు సత్తిబాబును, వాలీబాల్-ఫుట్‌బాల్ కలసి ఆడేసుకుంటున్నారు. అదే అసలు కథ.

ఇదే ఇప్పటి ప్రజాభవన్-అప్పటి ప్రగతిభవన్‌లో జగన్ బాబు-కేసీఆరన్న కలసి మూతులు మూతులు రాసుకుని (అమ్మతోడు.. ఆ ఫొటోలు గూగుల్‌మాతను అడిగితే అరక్షణంలో ఇస్తుంది), రాగి సంకటి-నాటుకోడి పులుసు, చికెన్ బిర్యానీ తిన్నప్పుడు ఎందుకు లైవ్ ఇవ్వలేదన్నది నెటిజన్ల ప్రశ్న. ఇద్దరి మాట ముచ్చటను, కనీసం మన ‘సాచ్చి’ టీవీ కూడా ఎందుకు లైవ్ ఇవ్వలేదు?

కేసీఆరన్న నగరి వెళ్లి రోజక్క ఇంట్లో నాటుకోడి తిన్నప్పుడయినా, మన ‘సాచ్చి’ ఎందుకు లైవ్ ఇవ్వలేదు? ప్రగతిభవన్‌లో ఆఫీసర్ల భేటీని అప్పటి మిత్ర మీడియా (ఇప్పుడంటే గతి లేక బాబు సర్కారుకు భజన చేస్తున్నాయనుకోండి) ఎన్టీవీ-టీవీ9 ఎందుకు లైవ్ టెలీకాస్టు చేయలేదు? అప్పుడు ఆరోవేలుగా ఉన్న మిగిలిన మిత్ర మీడియా చానెళ్లూ లైవ్ ఇవ్వవచ్చు కదా ? అన్నది నెటిజన్ల ప్రశ్న.

అప్పుడేటి సేస్తున్నవు సత్తిపండూ?.. జగన్ బాబుకో, భారతమ్మకో ఇప్పుడిచ్చిన సలహా అప్పుడెందుకు ఇవ్వలేదు? అప్పుడు ఈ తెలి- నోరేమయింది? చీపురుపల్లిలో తొంగున్నాదేటి? మైండుగానీ దొబ్బేసినాదేటి? అని.. అచ్చం సత్తిబాబు మాదిరిగానే ఎటకారాలాడుతున్నారు. ప్చ్.. సత్తిబాబుకు ఎన్ని కష్టాలో?

అసలు సత్తిబాబుకు ఇవన్నీ తెలిసే.. కావాలని, మా జగన్ బాబును టీడీపీతో తిట్టించడానికే మాట్లాడుతున్నారన్నది వైకాపేయుల డౌటనుమానం. ఎందుకంటే.. తాను ఇద్దరు సీఎంల మీటింగ్ లైవ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. అప్పుడు జగన్-కేసీఆర్ మీటింగ్ లైవ్ ఇచ్చారా? సీఎం జగన్ సమీక్ష సమావేశాలను ఎడిట్ చేసి రికార్డెడ్ వీడియో ఇచ్చారు కదా? వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ లైవ్ ఎందుకివ్వలేదు? అని టీడీపీ ప్రశ్నించి, జగన్‌ను ముక్కచీవాట్లు తిడుతుందని సత్తిబాబుకు తెలుసు.

అందుకే కావాలని మా జగన్ బాబును, టీడీపీ వాళ్లతో తిట్టించడానికే సత్తిబాబు ఇజయనగరం తెలివితేటలు ప్రదర్శించారన్నది వైకాపేయుల విమర్శ. అప్పట్లో ‘సొమ్ములు పోనాయి మరేటిసేత్తాం’ అన్నట్లే.. ఇప్పుడు ‘మాట జారాం.. మరేటిసేత్తామ’నుకోవడమే!

LEAVE A RESPONSE