Suryaa.co.in

Editorial

గుంటూరు సీఐతో ‘గోవిందుడి’కి ఏం పని?

  • సంబంధం లేని జిల్లాలో ఆ చైర్మన్ జోక్యం

  • పట్టాభిపురం సీఐ పోస్టింగ్‌పై చైర్మన్ పెత్తనంపై తమ్ముళ్ల ఫైర్

  • సీఐ పోస్టింగ్ లో ఎందుకీ తడబాటు?

  • నిఘా నిద్రపోతోందా?

  • పోస్టింగులకు ముందు వడపోత ఏదీ?

  • అసలు జాబితా ఇంటలిజన్స్‌కు పంపిస్తున్నారా?

  • మాజీ ఐజీ సమన్వయం విఫమవుతోందా?

  • వైసీపీ హయాం అధికారుల జాబితా చెక్ చేసే తెలివి లేదా?

  • వైసీపీ సర్కారు బాధితులు ఇంకా వెయిటింగ్‌లోనే

  • నాలుగేళ్లు వీఆర్‌లో చేసిన కమ్మ సీఐలకు ఏదీ గౌరవం

  • గుంటూరు రేంజ్ ఐజీ పనితీరుపై నేతల అసంతృప్తి

  • ప్రజా ప్రతినిధుల సమన్వయ లోపమా?

  • పోలీసు బాసుల నిర్లక్ష్యమా?

  • పట్టాభిపురంలో సీఐ పోస్టులలో కొనసాగుతున్న కుర్చీలాట

  • వైసీపీలో అంటకాగిన సీఐలకు కీలక పోస్టింగుల ఎందుకీ తడబాటు?

  • ఈసారి పోస్టింగ్ లోనైనా దిద్దుబాటు జరుగుతుందా?

(సుబ్బు)

ఆయనో చైర్మన్. చెర్మనంటే అట్టాంటిట్లాంటి చైర్మన్ కాదు. రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయానికి చైర్మన్ ఆయన. అది ప్రపంచంలోని కోట్లాదిమంది హిందువులకు ఇష్టదైవమైన దేవదేవుడి ఆలయం. అక్కడ దర్శనానికి ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సు లెటర్లు ఉండాలి. అంత పెద్ద ఇమేజ్ ఉన్న ఆలయానికి చైర్మన్‌గా ఉన్న ఆయనకు.. ఎక్కడో గుంటూరు లోని ఒక పోలీసుస్టేషన్ సీఐ పోస్టింగ్‌తో పనేంటి? దానికోసం కేంద్రమంత్రిపై ఒత్తిడి తెచ్చి, ఎమ్మెల్యేతో లెటర్ ఇప్పించ డమేమిటి?

చివరాఖరకు చైర్మన్‌గారి ముద్దుల సీఐ పేరు బయటకు పొక్కడం ఏమిటి? అదంతా మీడియా-సోషల్‌మీడియాలో గబ్బవడం ఏమిటి? చివరకు తప్పు తెలుకుసుకున్న సర్కారు, మళ్లీ ఆ సీఐని వీఆర్‌కు పంపించడం ఏమిటి? ఒకే పోలీసుస్టేషన్‌లో తొమ్మిదినెలలు ముగ్గురు సీఐలు మారడం ఎవరికి సిగ్గుచేటు? అంటే ఎవరి సమర్ధత, ఎవరి చరిత్ర ఏమిటో తెలియకుండా గుడ్డిగా పోస్టింగులిస్తున్నారా? ఒక గుంటూరులోనే కాదు. రాష్ట్రంలోని అన్నిచోట్లా ఇదే పరిస్థితి.

అసలు పోలీసుశాఖలో ఏం జరుగుతోంది? పోస్టింగులపై అజమాయిషీ ఎవరిది? తెరవెనుక ఉందెవరు? మాజీ ఐజీగారి దిశానిర్దేశంలో పోస్టింగులు ఇంత ఘోరంగా ఎలా అఘోరిస్తున్నాయి? మరి వైసీపీ సీఐలకు పోస్టింగులిస్తుంటే నిఘా విభాగం నిద్రపోతుందా? అంటే అసలు ఆ జాబితా ఇంటలిజన్స్‌కు వెళ్లడం లేదా? లేక వెళ్లినా నిఘా నేత్రాలు కనిపించడం లేదా? ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు. డజన్ల సార్లు ఇదే వరస.

ముందు పోస్టింగులివ్వడం.. తర్వాత వారిపై తమ్ముళ్లు సోషల్‌మీడియాలో శివమెత్తగనే వీఆర్‌కు పంపించడం. అంటే నిఘా వ్యవస్థ పనిచేయడం లేదా? అసలు వైసీపీ హయాంలో సుదీర్ఘకాలం లా అండ్ ఆర్డర్‌లో ఎంమంది చేశారు? ఎవరు లూప్‌లైన్‌లో పనిచేశారన్న జాబితా రూపొందిస్తే, ఇలాంటి పంచాయతీ ఉండదన్న తెలివి కూడా లేనివారు, పోలీసుశాఖకు మార్గదర్శకులుగా ఉన్నారా?
కేవలం రాజధాని ప్రాంతమైన గుంటూరు రేంజ్ పరిథిలోనే ఇలాంటి చిత్రవిచిత్రాలు, గోడదూకుళ్లు జరుగుతుంటే రేంజ్ ఐజీ ఏం చేస్తున్నట్లు? వైసీపీ జమానాలో ఏళ్ల తరబడి వీఆర్‌లో మగ్గిన వారికి న్యాయం చేయడం చేతకాదా? ఐదేళ్లు వీఆర్‌లో ఉన్న వారికి కొద్దినెలలు పోస్టింగు ఇచ్చి, ఎమ్మెల్యేల ఒత్తిడితో మళ్లీ వీఆర్‌కు పంపిస్తే, అప్పుడు వైసీపీ-టీడీపీకి తేడా ఏమిటి? అది గుర్తించాల్సిన బాధ్యత ఐజీకి లేదా?
సమర్ధులెవరో.. అసమర్ధులెవరో.. వైసీపీకి ఊడిగం చేసినవారెవరో.. టీడీపీ సామాజికవర్గ ముద్రతో ఐదేళ్లు నష్టపోయిన వారెవరో తెలుసుకోరా? అయినా అసలు.. చిత్తూరు జిల్లాకు చెందిన టెంపుల్ చైర్మన్‌కు, గుంటూరు సీఐ పోస్టింగ్‌తో పనేమిటి? అంటే ఇక్కడ మేమంతా అసమర్ధులమా?.. ఇదీ ఇప్పుడు రాజధాని తెలుగుతమ్ముళ్ల ఆక్రోశం.

గుంటూరు నగరంలోని పట్టాభిపురం అనే పోలీసుస్టేషన్ సీఐగా మధుసూదన్‌రావు అనే అధికారిని నియమించారు. ఆయన పేరును రాష్ర్టంలోనే అతి పెద్ద ఆలయ చైర్మన్ సిఫార్సు చేశారట. కేంద్రమంత్రి, గుంటూరు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చిన సదరు ఆలయ చైర్మన్ కృషి ఫలించింది. దానితో ఆయన కోరుకున్న మధుసూదన్‌రావుకు సీఐ పోస్టింగ్ దక్కింది.

అయితే విచిత్రంగా అప్పటికే అక్కడ వీరేంద్ర అనే సీఐ, కొద్దినెలల క్రితం నుంచే పనిచేస్తున్నారు. అంతకుముందు కిరణ్ అనే సీఐ వివాదాలతో సస్పెండయ్యారు. అలా కేవలం ఏడాది కాలంలో, ఒకే పోలీసుస్టేషన్‌లో పనిచేసే ముగ్గురు సీఐలు బదిలీ అయ్యారు.

పోనీ సదరు ఆలయ చైర్మన్ సిఫార్సు చేసిన సీఐకు, గతంలో మంచి చరిత్ర ఉందా అంటే అదీ లేదట. వైసీపీ సకల శాఖల మంత్రి ద న్నుతో, జిల్లాను దున్నేసిన ఓ మంత్రిగారి భర్తతో సదరు సీఐ అంటకాగారన్న ఆరోపణలున్నాయట. వైసీపీ జమానాలో చెలరేగిన ఓ వివాదాస్పద ఐపిఎస్‌కు, ఆయన శిష్యుపరమాణువన్న విమర్శలూ లేకపోలేదు. గతంలో పిహెచ్‌డి రామకృష్ణ గుంటూరు ఎస్పీగా వచ్చీ రావడంతోనే, ఆ సీఐని బదిలీ చేశారట.

వీటికిమించి.. మరో వైచిత్రి. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు, బీటెక్ విద్యార్ధిని రమ్య హత్యకు గురైంది. ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన యువనేత లోకేష్‌ను, నాడు నగరంపాలెం సీఐగా ఉన్న ఇదే మధుసూదన్‌రావు అడ్డుకుని, ఆయనను పత్తిపాడు పోలీసుస్టేషన్‌కు బలవంతంగా తరలించారు. ఆ సందర్భంలో ఆగ్రహించిన లోకేష్.. తమను వేధించిన ఎవరినీ విడిచిపెట్టనని, మధుసూదన్‌రావును హెచ్చరించారు.

విచిత్రంగా అదే మధుసూదన్‌రావును, ఇప్పుడు ఒక ఆలయ చైర్మన్ సిఫార్సుతో సీఐగా నియమించడం అంటే, అది లోకేష్‌ను అవమానించడమే కదా? అయినా ఒక సీఐ వచ్చి ఏడాది కాకపోయినా, ఆయనను మార్చేందుకు ప్రయత్నిస్తే దానిని ఎస్పీ, రేంజ్ ఐజీ అడ్డుకోవసిన బాధ్యత లేదా? అని టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి.

వైసీపీ జమానాలో మాకినేని శ్రీనివాసరావు అనే సీఐని.. కమ్మకులానికి చెందిన వాడన్న ఏకైక కారణంతో, నాలుగున్నరేళ్లు వీఆర్‌లో ఉంచారు. ఎన్నికల ముందు లూప్‌లైన్ పోస్టింగ్ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత, ఎట్టకేలకూ అమరావతి సీఐగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే వైసీపీకి చెందిన దళితులపై కేసులు కాకుండా.. పోలీసుస్టేషన్‌కు పిలిచి కొట్టాలన్న ఆ నియోజకవర్గ ప్రతినిధి ఆదేశాలు పాటించనందున, రెండునెలలకే మళ్లీ ఆయనను వీఆర్‌కు పంపించడం ఆశ్చర్యం.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కూడా కమ్మ వర్గానికే చెందిన విజయకృష్ణ అనే సీఐని, అక్కడి ఎమ్మెల్యేకి తెలియకుండానే ఎంపీ అనుచరుడు బదిలీ చేయించారు. కమ్మ వర్గానికి చెందిన ఈ ఇద్దరూ ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు. వీరిలో విజయకృష్ణ వైసీపీ హయాంలో లా అండ్ ఆర్డర్‌లో చేసినప్పటికీ, మాకినేని శ్రీనివాసరావు మాత్రం నాలుగున్నరేళ్లు వీఆర్‌లో ఉండటమే విషాదం. అయినా ఒక ఎమ్మెల్యే ఒత్తిడి చేశారన్న కారణంగా, వైసీపీ హయాంలో వేధింపులకు గురై నాలుగున్నరేళ్లు పోస్టింగ్ లేకుండా పోయిన సీఐ శ్రీనివాసరావును, నిర్దయగా మరోసారి వీఆర్‌కు పంపించడమంటే.. గుంటూరురేంజ్‌లో అధికారులు ఎంత దివ్యంగా, ‘సొంత మెదళ్ల’ తో పనిచేస్తున్నారో స్పష్టమవుతోందని తెలుగుతమ్ముళ్లు ఎద్దేవా చేస్తున్నారు.

అయినా చిత్తూరు జిల్లాకు చెందిన ఆలయ కమిటీ చైర్మన్‌కు.. తమ జిల్లా పోలీసు పోస్టింగులతో పనేమిటని, తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు. ‘‘కేంద్రమంత్రి, ఎమ్మెల్యే తెలిసినంతమాత్రాన.. లోకేష్‌ను అవమానించిన సీఐ పేరు ఎలా సిఫార్సు చేస్తారు? కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే మాధవి ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో పనిచేసి, పోలీసులతో దెబ్బలు తిని, కేసులతో కోర్టుల చుట్టూ తిరిగితే కదా ఎవరేమిటో తెలిసేది? అదృష్టానికి పదవులొస్తే ఇలాగే ఉంటుంది. అసలు ఆ చైర్మన్‌కు ఏం తెలుసని మధుసూదన్‌రావు పేరు సిఫార్సు చేశారు? చైర్మన్ తో ఉన్న వ్యక్తి చెప్పినంత మాత్రాన, టీడీపీ కార్యకర్తలను వేధించిన సీఐకి ఇక్కడ పోస్టింగ్ ఇప్పిస్తారా? ఆ చైర్మన్‌కు అంత ప్రేమ ఉంటే ఆయన సొంత చిత్తూరు జిల్లాలోనో, ఆయన చైర్మన్‌గా ఉన్న ఆలయంలోనే నియమించుకోమనండి’’ అంటూ తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు.

పోస్టింగుల లెక్క తేల్చడం కూడా రాదా?

కాగా వైసీపీ హయాంలో ఓవర్‌యాక్షన్.. తమపై భౌతికదాడులు చేసి, జైళ్లు-కోర్టులకు తిప్పిన సీఐ, డీఎస్పీలకు కూటమి ప్రభుత్వంలో కీలకమైన పోస్టింగులు ఇస్తున్న వైనంపై.. టీడీపీ సీనియర్ల నుంచి, కార్యకర్తలవరకూ విరుచుకుపడతున్నారు. వైసీపీ హయాంలో పోస్టింగులు లేకుండా వీఆర్, లూప్‌లైన్లలో మగ్గిన సీఐలను గుర్తించలేని వ్యవస్థ ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

‘‘అసలు ఈ గంద రగోళం అంతా ఎందుకు? ప్రభుత్వం వాళ్లను నియమించడం, గత వైసీపీ హయాంలో వాళ్లు చేసిన అకృత్యాలను మీడియా-సోషల్‌మీడియా బయటపెట్టడం, వారిని వీఆర్‌కు పంపించడం చూస్తే, అసలు మతి ఉన్న వాళ్లే ఈ పోస్టింగులు ఇస్తున్నారా అనిపిస్తుంది. ఐదేళ్ల వైసీపీ హయాంలో ఏ స్థాయి అధికారి లా అండ్ ఆర్డర్‌లో పనిచేశారు? ఎంతమంది లూప్‌లైన్, వీఆర్‌లో పనిచేశారన్న జాబితా తయారు చేసి, దాని ప్రకారం పోస్టింగులిచ్చి, అప్పుడు లా అండ్ ఆర్డర్‌లో పనిచేసిన వారిని ఇప్పుడు లూప్‌లైన్‌కు పంపిస్తే అసలు ఈ గొడవ, ప్రభుత్వానికి అవమానం, టీడీపీ కార్యకర్తల అలజడి ఉండదు కదా? కనీసం ఆ తెలివి కూడా లేకుండా పనిచేస్తున్నారా? అని ఓ రిటైర్డ్ ఐజీ వ్యాఖ్యానించారు.

అమరావతిలో ఎందుకీ అయోమయం?

రాజకీయ ఉద్దండుల జిల్లా గుంటూరు. కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రి లోకేష్ జిల్లా గుంటూరు. అలాంటి ప్రాంతంలో రాజకీయ నాయకులు, కీలక నేతలు ఉండే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సీఐ పోస్టింగ్ లో ఎందుకీ తడబాటు. ఎవరిది లోపం? ఎందుకిలా జరుగుతుంది? ప్రజాప్రతినిధులా? పార్టీ పెద్దల సమన్వయ లోపమా? ఇంటెలిజెన్స్ వర్గాల సమాచార నిర్లక్ష్యమా? తొమ్మిది నెలల కూటమి పాలనలో ముగ్గురు సీఐలు మారడం ఏమిటి?

మొదటి సీఐ కిరణ్ పేకాట క్లబ్ అనుమతి విషయంలో వేటు పడింది. ఆయన నెల రోజులు మాత్రమే పని చేశారు. వీరేంద్ర ను హడావుడిగా నియమించారు, ఇక ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం లో అంటకాగిన సీఐగా అనేకమంది తెలుగుదేశం కార్యకర్తలపై డిసెంబర్ 31 సందర్భంగా అమాయకులపై అక్రమంగా కేసులు పెట్టారన్న అపవాదు లేకపోలేదు. అయినా మరి ఎందుకు ఆ సిఐని, ఇలాంటి కీలక పోలీస్ స్టేషన్ కు నియమించారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

అనేక విమర్శలు, నాయకుల అభ్యంతరాల తో ఆ సీఐను మార్చారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, పడిన తప్పటడుగులను సరి చేసుకోకుండా గత వైసీపీ ప్రభుత్వం లో పార్టీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించి, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ పర్యటనలో కూడా అత్యుత్సాహం ప్రదర్శించిన మధుసూదన్ రావు ను హడావిడిగా నియమించారు.

అయితే ఆ పోస్టింగ్ పై ప్రజాగ్రహం వ్యక్తం అవడంతో, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సందర్భంగా మూడురోజులు కూడా గడవకముందే మధుసూదన్ రావును విఆర్ కు పంపారు. ఇలా ఎందుకు జరుగుతుంది? రాజకీయ చైతన్యంతో పాటు, తెలుగుదేశానికి పట్టున్న గుంటూరు నగరంలో కీలకమైన పట్టాభిపురం సీఐ ఎంపికలో ఎందుకు ఈ తడబాటు అనేది కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితిగా మారింది.

ముఖ్యంగా రాజధాని ప్రాంతం. అనేకమంది వీఐపీలు నివసించే ప్రాంతం. మంత్రి లోకేష్ బా ఉన్న జిల్లాలో కీలకమైన సీఐ పోస్టు ఎంపికలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గుంటూరు నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో అంటగాగిన సీఐలకు పెద్దపీట వేయడం వెనుక, పోస్టింగుల్లో వైసీపీ నేతలు చక్రం తిప్పుతున్నారు అన్న అపవాది కూడా మూటగట్టుకుంటున్నారు.

గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అంటకాగిన సీఐలకు మంచి పోస్టింగులు ఇచ్చి, ఆ ప్రభుత్వంలో వెలివేయబడ్డ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారికి, పార్టీకి అండగా ఉండే ప్రధాన సామాజిక వర్గాల సిఐలను పోస్టింగులకు దూరంగా ఉంచడం పై కూడా విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు.

లోకేష్ సొంత జిల్లాలోనే ఇలా ఉంటే.. ఇక?

లోకేష్ సొంత జిల్లాలోని కీలక పోలీస్ స్టేషన్లలో సిఐ పోస్టింగుల్లోనే ఇంతగా తడబాటు ఉంటే.. ఇక మిగతా ప్రాంతాలలో ఎలా ఉంటుందన్న చర్చ కూడా నడుస్తుంది. పార్టీ కేంద్రాలయం, పార్టీ కీలక నేతలు ఉండే ఈ ప్రాంతంలో సీఐ పోస్టుల నియామకంలో రేంజ్ స్థాయి అధికారి పాత్ర కీలకంగా మారడమే ఇందుకు కారణంగా ఆ శాఖలో బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.

ఏది ఏమైనా ఇప్పటివరకు జరిగిన తడబాటును.. దిద్దుబాటుగా మార్చుకొని.. ఇకనైనా కీలకమైన పట్టాభిపురం లాంటి అనేక పోలీసుస్టేషన్లలో, మరోసారి సీఐ పోస్టింగ్ వివాదంగా మారకుండా చూడాలని కూటమిలోని కొందరు కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం లో ఇదే పోలీస్ స్టేషన్ లో ఆనాటి ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన సీఐ ఐదేళ్లపాటు కొనసాగారు.

మరి కూటమి ప్రభుత్వంలో వైసిపి బాధితులుగా ఉండి, శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అధికారులను ఎందుకు నియమించుకోలేకపోతున్నామన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పట్టాభిపురం లాంటి అనేక పోలీసుస్టేషన్లలో సిఐ పోస్టింగ్ లో కుర్చీలాటకు పుల్ స్టాప్ పెట్టి, ఆచితూచి సీఐ పోస్టింగ్ ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు సూచిస్తున్నారు.

LEAVE A RESPONSE