Suryaa.co.in

Editorial

అసెంబ్లీ కమిటీలకు మోక్షం

  •  ‘సూర్య’ కథనానికి స్పందన

  • ఫలించిన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కృషి

  • ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా పితాని

  • ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా మండలి బుద్దప్రసాద్

  • కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన రఘురామ

  • ఎమ్మెల్యేల అసంతృప్తిపై ‘సూర్య’లో ‘అటకెక్కిన అసెంబ్లీ కమిటీలు’ పేరుతో వార్తా కథనం

  • దానితో స్పీకర్ చాంబర్‌కు వెళ్లి చర్చించిన సీఎం చంద్రబాబు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ కమిటీలకు మోక్షం కల్పించింది. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదినెలలయినప్పటి కీ ఇప్పటివరకూ కమిటీలు ఏర్పాటుచేయని ఎమ్మెల్యేల అసంతృప్తిపై ‘సూర్య’లో.. ఇటీవల ‘అటకెక్కిన అసెంబ్లీ కమిటీలు’ శీర్షికన వార్తా కథనం వెలువరించిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన ప్రభుత్వం, తాజాగా అసెంబ్లీ కమిటీలు ఏర్పాటుచేసింది.

అసెంబ్లీలో ప్రతిష్ఠాత్మకమైన కమిటీలు గత తొమ్మిది నెలల నుంచి పెండింగ్‌లో ఉండటంపై, శాసనసభ్యుల్లో అసంతృప్తి నెలకొంది. గతంలో ఎప్పుడూ ఇంత ఆలస్యం ఎప్పుడూ జరగలేదన్న అసంతృప్తి వ్యక్తమయింది. కేవలం ఒకరోజు కూర్చుని, కసరత్తు చేసి నిర్ణయం తీసుకునే దానిని.. తొమ్మిదినెలల సాగదీయడంపై కూటమి ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మేరకు చాలామంది ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వద్ద వ్యక్తం చేశారు. దానికి స్పందించిన ఆయన.. గత కొద్దినెలల నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుతో చాలాసార్లు చర్చించారు. దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

అయితే కమిటీల వ్యవహారాన్ని పార్టీ ఆఫీసుకు వదిలేద్దామని ఒకరు, లోకేష్ నిర్ణయానికి వదిలేద్దామని మరొకరు, సీఎం చంద్రబాబు నిర్ణయానికి విడిచిపెడదామని మరొకరు అభిప్రాయపడటంతో, కమిటీల ఎంపిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. మొత్తంగా.. తమకు ఉన్న అధికారాలు వినియోగించుకోకుండా, చంద్రబాబు-లోకేష్ నిర్ణయానికి వదిలేయాలన్న భావనతో కనిపించారు.

ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలయినా.. కమిటీలు వేయని ఎమ్మెల్యేల అసంతృప్తిపై, ‘సూర్య’ వార్తా కథనం వెలువరించింది. దానితో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పీకర్ చాంబర్‌కు వచ్చిన సందర్భంగా, అసెంబ్లీ కమిటీలపై చర్చించారు. అసెంబ్లీ-కౌన్సిల్ ఉమ్మడి కమిటీలు అసెంబ్లీ కమిటీలపై ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

కౌన్సిల్‌లో కమిటీలు వేస్తే వైసీసీకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, అసెంబ్లీ కమిటీల వరకూ పరిమతం కావాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఆ ప్రకారంగా అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున అసెంబ్లీ కమిటీలు ఖరారు చేశారు. నిజానికి కమిటీల్లో సభ్యుల పేర్లు చాలారోజుల క్రితమే ఖరారయినట్లు సమాచారం. దానిని గురువారం అధికారికంగా ప్రకటించారు.

కాగా రూల్స్ కమిటీ చైర్మన్‌గా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పిటిషన్ల కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రివిలేజీ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ నియమితులయ్యారు. అసెంబ్లీ కమిటీ చైర్మన్లుగా మాజీ మంత్రులను నియమించడం విశేషం.

LEAVE A RESPONSE