– పోర్ట్బ్లెయిర్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి
– బీజేపీ మద్దతుతో గెలిచిన టీడీపీ అభ్యర్ధి సెల్వి
– మూడేళ్లు టీడీపీ మద్దతుతో చైర్మన్గా చేసిన బీజేపీ నేత
– పొత్తును స్వాగతించి, అభినందిస్తూ బీజేపీ అధ్యక్షుడు నద్దా ట్వీట్
– కుటుంబపార్టీలతో పొత్తు ఉండదంటున్న సోము వీర్రాజు
– ‘ఎల్లోస్నేక్స్’తో ప్రమాదమన్న సునీల్ దియోథర్
– మరి అదే కుటుంబపార్టీకి బీజేపీ ఎలా మద్దతిచ్చినట్లు?
– మూడేళ్లూ అదే కుటుంబపార్టీ మద్దతు ఎలా తీసుకున్నట్లు?
– ఆంధ్రాలో సోము వీర్రాజుకు ‘అండమాన్ అవస్థలు’
( మార్తి సుబ్రహ్మణ్యం)
– మేం టీడీపీ లాంటి కుటుంబపార్టీతో పొత్తు పెట్టుకోం. ప్రాంతీయ పార్టీలు దేశానికి ప్రమాదకరం. కలసి వస్తే జనసేనతో పొత్తు. లేకపోతే మా పొత్తు ప్రజలతోనే.
– ఎల్లోస్నేక్స్ పార్టీతో కలవం. దానిని అణచివేస్తాం.
ఏపీలో టీడీపీ-బీజేపీ పొత్తుపై వచ్చే వార్తలకు సంబంధించి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోథర్ తరచూ చేసే గంభీర ప్రకటనలివి.
సీన్ కట్ చేస్తే..
అండమాన్ అని ఓ కేంద్రపాలిత రాష్ట్రం. దానికో మున్సిపాలిటీ. పేరు పోర్ట్బ్లెయిర్. అక్కడ గత మూడేళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. బీజేపీ-టీడీపీ కలసి పోటీ చేసి, మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాయి. అక్కడ బీజేపీకి 10, కాంగ్రెస్కు 11 సీట్లు రాగా… టీడీపీకి వచ్చిన స్థానాలు రెండు. కానీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అవే కీలకమయ్యాయి. దానితో రెండు పార్టీలూ ఒప్పందానికొచ్చాయి. తొలి మూడేళ్లు బీజేపీ, మిగిలిన రెండేళ్లు టీడీపీ చైర్మన్ సీటు పంచుకోవాలన్నది ఆ ఒప్పంద సారాంశం.
ఆ ప్రకారంగా బీజేపీ వంతు పూర్తవడంతో, ఇప్పుడు చైర్మన్ సీటుకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి సెల్విని బీజేపీ బలపరచడంతో, ఆ స్థానం టీడీపీ వశమయింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నిజానికి అది ఒక సాధారణ చైర్మన్ ఎన్నిక. అలాంటి దానికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. కానీ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆ విజయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకోవడమే ఆశ్చర్యం. దాని వెనుక వ్యూహాలు- భవిష్యత్తు అవసరాలు- ఆలోచనలు ఏమిటన్నది తర్వాత ముచ్చట.
సహజంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా, పొత్తులో గెలిచిన తన పార్టీ అభ్యర్ధికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇంతకూ..పొత్తులో పోటీ చేసి గెలిచిన అండమాన్ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి ఎవరో కాదు. ఏపీకి చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్! అదో విశేషం. అండమాన్లో కమలవికాసానికి ఆయన వ్యూహమూ ఒక ప్రధాన కారణం. అండమాన్లో తెలుగువారి సంఖ్య అధికం. ప్రధానంగా శ్రీకాకుళం వాసులు అక్కడ ఎక్కువ. గతంలో అండమాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఈశ్వర్ తెలుగువాడే.
అంతా బాగానే ఉంది. ఇక్కడే బుద్ధిజీవులకు బోలెడు సందేహాలు. నోరు తెరిస్తే టీడీపీని కుటుంబపార్టీ అని తిట్టిపోసే సోము వీర్రాజు- సునీల్.. మరి అండమాన్లో టీడీపీ-బీజేపీ పొత్తును ఎందుకు అడ్డుకోలేకపోయారు? కుటుంబ పార్టీతో మనకు సాంగత్యమేమిటని, హస్తినకు వెళ్లి మరీ ఎందుకు హల్ చల్ చేయలేదు?సోము ప్రవచిత సిద్ధాంతాల మడిబట్టను, అండమాన్ బోటు పైన ఎందుకు ఎక్కించినట్లు? పోనీ.. ఆ ముందు మూడేళ్లూ, అదే కుటుంబ పార్టీ అయిన టీడీపీ మద్దతు ఎందుకు తీసుకున్నారని నద్దాపై ఎందుకు నటరాజ నాట్యమాడలేదు?
సరే. గతంలో ఐదేళ్లు తెలిసో.. తెలియకో.. బుద్ధి గడ్డితినో.. తెలివిలేకనో.. చిన్నమెదడు చితికిపోయో.. మెదడులో గుజ్జు లేకనో.. గ్రహచారం బాగలేకనో.. కుటుంబ పార్టీ అయిన టీడీపీతో, అధికారం కలసి పంచుకున్నారే అనుకుందాం. మరి.. ఏపీ ఎన్నికల తర్వాతనే కదా అండమాన్లో టీడీపీ-బీజేపీ కలసి పోటీ చేసింది? ఆ ప్రకారంగా తన పార్టీ.. కుటుంబపార్టీ అయిన టీడీపీ మద్దతు తీసుకుంటుంటే, అప్పుడు సోము వీర్రాజు ఎందుకు అడ్డుపడలేదు?
మీరు కుటుంబపార్టీ అయిన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాషాయం వదిలేసి, తన ఊరు కాతేరుకు వెళ్లి.. తన మానాన తాను పాత వ్యాపారం చేసుకుని బతుకుతానని, బీజేపీ బాసులను ఎందుకు బెదిరించలేదు? అలా బెదిరించి ఉంటే, నద్దా అండ్ కో గజ గజ వణికిపోయే వారే కదా? వీర్రాజు లాంటి అంకితభావం ఉన్న నేతను శాంతింపచేయడానికయినా, అండమాన్లో పోత్తు పెట్టుకోవడానికి భయపడి ఉండేవారు కదా? సోము వీర్రాజు నిజంగా ఆ పనిచేసి ఉంటే, ఆయన ఇంటిపేరు ‘సిద్ధాంతాల సోము వీర్రాజు’గా మారేది కదా? అంతటి చక్కని అవకాశాన్ని సోమన్న ఎందుకు వదులుకున్నట్లు?
సరే అండమాన్ గోల వదిలేద్దాం. పక్కనే ఉన్న మహారాష్ట్రలో శివసేనతో.. ఇటు పక్కన ఉన్న కర్నాటకలో జనతాదళ్ వంటి కుటుంబపార్టీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడయినా వీర్రాజు తన సిద్ధాంత వీరత్వాన్ని ఎందుకు ప్రదర్శించలేదు? ఇవీ.. బుద్ధిజీవుల సందేహాలు. మరి దీనికి వీర్రాజన్న సమాధానమిస్తారా అన్నదే ప్రశ్న.
బుద్ధిజీవుల సందేహాలకు సోమన్న సమాధానాలు ఇస్తారో లేదో తెలియదు గానీ.. ఇలా స్థాయికి మించి మాట్లాడితే, నలుగురిలో నవ్వులపాలు కావడం మాత్రం ఖాయమన్నది కమలదళాల ఉవాచ. రేపు మీడియా ప్రతినిధులు.. ‘కుటుంబపార్టీతో పొత్తులుండవని చెబుతున్న మీరు.. మరి అండమాన్లో టీడీపీతో కలసి ఎలా పనిచేస్తున్నార’ని ప్రశ్నిస్తే… ఏం సమాధానం చెప్పాలన్నది, ఇప్పుడు కమలదళాల అండమాన్ అవస్థ. పోనీ.. ఆ రాష్ట్రం వేరు.. ఈ రాష్ట్రం వేరు అని జవాబు చెబితే.. జాతీయ పార్టీకి రాష్ట్రానికో పాలిసీ ఉంటుందా? అని ఏ తుంటరి జర్నలిస్టో అడిగితే, ముఖం ఎక్కడ పెట్టుకోవాలన్నది ఆంధ్రా కమలదళాల అసలు అవస్థ.