– కోర్టు ఆదేశించినా పట్టించుకోరా?
– నాడు బాబును మేం ఇలాగే చూశామా?
– సెంట్రల్‌జైలులో కొడుకు మిథున్‌తో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ములాఖత్
రాజమండ్రి: సెంట్రల్ జైలులో ఉన్న తన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పించడం లేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని , వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రస్తుత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటాం. జైలు నుంచి బయటకు వచ్చాక మిథున్ రెడ్డి మరింత సమర్థవంతంగా రాణిస్తారని నేను భావిస్తున్నాను అని ధీమా వ్యక్తం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విమర్శించారు. గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరూ గమనిస్తున్నారు. ఇది స్పష్టంగా కక్ష సాధింపు చర్యే అన్నారు.
కోర్టు ఆదేశించినప్పటికీ, జైలులో మిథున్ రెడ్డికి ఆ మేరకు సౌకర్యాలు అందడం లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఇదే జైలులో చంద్రబాబు ఉన్నప్పుడు తమ ప్రభుత్వం ఎప్పుడూ ఈ విధంగా ప్రవర్తించలేదని ఆయన గుర్తుచేశారు.