– మళ్లీ చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల బీభత్సం
– ఒక రైతును తొక్కి చంపి, పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు
– ఏపీకి మేలో 4 కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్నాటక సర్కారు
– పవన్ కల్యాణ్ చొరవతో ఆగస్టు 8న ఏపీకి వచ్చిన కుంకీ ఏనుగులు
– 27న విజయవాడలో కర్నాటకతో పవన్ ఒప్పందం
– రెండునెలలు శిక్షణ ఇచ్చిన కర్నాటక మావటీలు
– కుంకీ ఏనుగుతో అడవి ఏనుగులను అడ్డుకోవచ్చన్న వ్యూహం
– ఏపీలో జయంత్, వినాయక్ మాత్రమే కుంకీలు
– వాటికి వయసుపైబడటంతో సంరక్షణ కేంద్రాల్లో విశ్రాంతి
– కర్నాటకలోని దుబరే, నక్రేబైలులో కుంకీలకు మావటిలతో ప్రత్యేక శిక్షణ
– రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్రను ఏపీకి తెచ్చిన సర్కారు
– పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్‌లో ఉంచి శిక్షణ
– వచ్చిన వాటిలో రంజన్ పిచ్చిది.. దేవ గుడ్డిది..ట
– వచ్చిన రెండునెలల వరకూ ఆపరేషన్ లేదు
– ఒక్కో ఏనుగుకు ఏడాదికి 25 లక్షల ఖర్చు
– అయినా మళ్లీ పొలాలపై పడ్డ ఏనుగుల గుంపు
– అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
– గ్రామస్తులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసుకోవాలని సలహా
– పోలాలలో సిగ్నల్స్ అందుబాటులో ఉంటాయా?
– మరి తెచ్చిన కుంకీలు ఏమయినట్లు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం, ఒడిషా సరిహద్దు ప్రజలకు మళ్లీ గజరాజుల గండం మొదలయింది. పచ్చని పంటపొలాల్లో స్వైర విహారం చేస్తున్న ఏనుగుల మంద, రైతులను భీతావహులను చేస్తోంది. అడవి నుంచి డజన్ల సంఖ్యలో వచ్చి పడుతున్న ఏనుగుల మందతో.. గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టి బతుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మదగ జాలను అణచివేసి, వాటిని తిరిగి అడవుల్లోకి తరిమేందుకు ప్రభుత్వం, కర్నాటకు తెచ్చుకున్న ఆ కుంకీ ఏనుగులు ఏమయ్యాయి? ఏం చేస్తున్నాయి? ఆపరేషన్‌లో ఎందుకు పాల్గొనడం లేదు? అన్న ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
ఏపీ సరిహద్దు గ్రామాల రైతులు పండించిన పంటను తొక్కి నాశనం చేస్తున్న ఏనుగుల సైర్వవిహారాన్ని.. కర్నాటక కుంకీలు అడ్డుకోలేకపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కర్నాటక ప్రభుత్వంతో చర్చించారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌తో చర్చించి, ఏపీకి సుశిక్షితులైన కుంకీ ఏనుగులను తీసుకువచ్చారు. అటవీ శాఖ దానికి పెద్ద హడావిడి చేసింది. అంతవరకూ బాగానే ఉంది.
కోతులను భయపెట్టి, వాటిని వెళ్లగొట్టేందుకు కొండముచ్చులను ఎలా ప్రయోగిస్తామో.. అడవి నుంచి జనావాసాల్లోకి దూసుకువచ్చే మద గజాలను నియంత్రించి, తిరిగి అవి అడవిలోకి వెళ్లగొట్టడం ఈ కుంకీ ఏనుగుల ప్రత్యేకత. ఆ రకంగా మగ ఏనుగులకు సుదీర్ఘకాలం శిక్షణ ఇచ్చి, మావటి వారి ఆదేశాలు పాటించేలా వాటికి తర్ఫీదు ఇస్తుంటారు.
ఏదైనా ఏనుగు మంద ఫలానా గ్రామంలోకి వచ్చిందన్న సమాచారం తెలిసిన వెంటనే.. అటవీ శాఖ అధికారులు తమ వద్ద ఉన్న కుంకీలను అక్కడి తీసుకువెళ్లి, వాటిని అడవుల్లోకి తరిమి వేస్తుంటారు. ఇదీ కుంకీ ఏనుగుల ప్రత్యేకత.
అదే ఆశతో.. అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కర్నాటకకు వెళ్లి తన పలుకుడి వినియోగించి, కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చారు. ఆ మేరకు స్వయంగా కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో పెద్ద సభ నిర్వహించారు. దానికి మీడియా కూడా భారీ ప్రచారం ఇచ్చింది. ఇక ఏపీ సరిహద్దుల్లో ఏనుగుల దాడి ఉండదని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కానీ అందుకు భిన్నంగా… కుంకీలను ఏపీకి తీసుకువచ్చిన తర్వాత కూడా ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం, ఒడిషా సరిహద్దుల్లో ఏనుగుల స్వైర విహారం ఇంకా విజయవంతంగానే కొనసాగుతుండటంతో, మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో రామకృష్ణంరాజు అనే రైతు ఏనుగుల దాడికి బలయ్యాడు. చివరకు భక్తులు తిరిగే శ్రీవారి మెట్ల వద్ద ఉన్న పంప్‌హౌస్ వద్ద కూడా, ఏనుగులు కనిపించడంతో భక్తులు హడలిపోయారు.
దీనితో కర్నాటక నుంచి తెప్పించిన కుంకీ ఏనుగులు ఏమయ్యాయి? వాటిని ఆపరేషన్‌కు ఎందుకు వినియోగించడం లేదు? వినియోగిస్తే మళ్లీ అడవి ఏనుగులు ఎందుకు గ్రామాల్లోకి వస్తున్నాయన్న సందేహాలు సహజంగానే తెరపైకి వస్తున్నాయి. అసలు ఏపీకి సైతం జయంత్, వినాయక్ అనే రెండు కుంకీ ఏనుగులున్నాయి. కానీ వాటికి వయసుమీదపడటంతో ఆ రెండింటిని సంరక్షణ కేంద్రంలో ఉంచారు.
నిజానికి ఏపీకి కర్నాటక సర్కారు రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లున్న కుంకీ ఏనుగులను తెప్పించింది. వాటిని పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్‌లో ఉంచి, శిక్షణ ఇప్పించారని అప్పట్లో అటవీశాఖ అధికారులు మీడియాకు చెప్పారు. అయితే వాటిని తెచ్చిన 2 నెలల వరకూ ఒక్క ఆపరేషన్‌కూ వినియోగించలేదన్న సమాచారంతో, రైతులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. మరి ఆపరేషన్ చేయని వాటిని కర్నాటక నుంచి ఎందుకు తీసుకువచ్చారన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
నిజానికి ఏనుగుల పోషణ అంత సులభం కాదు. కర్నాటక నుంచి తెప్పించిన ఒక్కో కుంకీ ఏనుగుకు ఏడాదికి 25 లక్షల ఖర్చవుతుందని చెబుతున్నారు. అయినా వాటిని ఆపరేషన్‌కు ఎందుకు తీసుకువెళ్లడం లేదన్న ప్రశ్నలకు, అటవీ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు. నిజంగా వాటిని ఏనుగుల ఆపరేషన్‌కు పంపిస్తే, వాటి వివరాలను మీడియాకు ఎందుకివ్వలేదన్న ప్రశ్నలూ దానితోపాటే తెరపైకి వస్తున్నాయి. దీనితో సహజంగానే వాటి సామర్థ్యంపై అనుమానాలు తెరపైకి వచ్చాయి.
అయితే.. కర్నాటక నుంచి తెచ్చిన కుంకీ ఏనుగుల్లో రంజని పిచ్చిదని, అది మావటి వారికి సైతం లొంగడం లేదన్న వార్తలు అప్పట్లో వచ్చినా.. అటవీ శాఖ అధికారులు దానిని ఖండించలేదు. ఇక దేవ అనే మరో కుంకి గుడ్డిదని, దానికి ఒక కన్నుమాత్రమే ఉండటంతో అది ఆపరేషన్‌లో ఏం పాల్గొంటుందన్న ప్రశ్నలకు అటవీశాఖ అధికారుల నుంచి ఇప్పటిదాకా సమాధానమే లేదు.
అసలు ఆపరేషన్‌కు పనికిరాని వాటిని ఎలా తీసుకువచ్చారు? వాటి ఆరోగ్యాన్ని పరీక్షించకుండానే కర్నాటక ఇచ్చింది కాబట్టి ముందూ వెనకా చూసుకుండానే తీసుకువచ్చారా? మిగిలిన కృష్ణా, అనిమన్యు, మహేంద్ర కుంకీలను ఎక్కడ ఉంచారు? ఎన్ని ఆపరేషన్లకు వాటిని వినియోగిస్తున్నారన్న సమాచారం రహస్యంగానే ఉంచుతుండటంపై, సహజంగానే మరిన్ని అనుమానాలకు కారణమవుతున్నాయి.
కాగా కుంకీలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో నిర్నిరోధంగా జరుగుతున్న ఏనుగుల దాడిపై.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సమీక్షలు నిర్వహించారు. చంగ్రిరి నియోజకవర్గంలో 11 ఏనుగులు పొలాలపై పడి.. కల్యాణి డ్యామ్ సమీపంలోని శ్రీ సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, పంటను తొక్కివేయడంతోపాటు ఒక రైతును తొక్కి చంపేయడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అటవీ-పర్యావరణ శాఖ కూడా పవన్ వద్దే ఉన్న విషయం తెలిసిందే.
దానితో ఏనుగుల దాడి నుంచి రక్షించుకునేందుకు.. ముందుగా గ్రామస్తులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసుకోవాలని పవన్ సలహా ఇచ్చారు. ఏనుగులు ఏ మార్గం ద్వారా డ్రోన్ ద్వారా తెలుసుకునే క్రమంలో, ఆయా గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి, ఏనుగులు వచ్చే సమాచారాన్ని వాట్సాప్ ద్వారా రైతులకు అందించాలని పవన్ అధికారులను ఆదేశించారు.
బాగానే ఉంది. మరి ఊరికి చివరలో ఉండే పొలాలకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోతే పరిస్థితి ఏమిటి? ఒకవేళ ఉన్నప్పటికీ.. తమ
గ్రామంపై పడే ఏనుగుల మందను గ్రామస్తులు ఎలా నియంత్రించాలన్నదే ప్రశ్న.
ఏనుగుల నియంత్ర ణపై పవన్ నిర్వహించిన సమీక్షలో కూడా.. కర్నాటక నుంచి ఎంతో మక్కువతో తెప్పించిన కుంకీ ఏనుగుల ఆపరేషన్ పురోగతి గురించి ప్రస్తావించకపోవడమే ఆశ్చర్యం. ఆ విషయాన్ని అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తావించలేదు. ఇటు అటవీశాఖ అధికారులు కూడా పవన్‌కు వివరించే ప్రయత్నం చేయకపోవడే వింత. నిజానికి అధికారులు కుంకీల పనితీరును పవన్‌కు వివరించాల్సి ఉంది.