– టీడీపీ అధినేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన విజయసాయి
– సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటూ ట్వీట్
– గతంలో బాబుపై ట్వీట్లలో విరుచుకుపడిన విజయసాయి
– ముసలోడు, బొల్లి, మతిరుపుమారాజు అంటూ దూషణలు
– రఘురామకృష్ణంరాజు, లోకేష్, అయ్యన్నపాత్రుడుపైనా మాటల మంటలు
– గత కొద్దిరోజుల నుంచి మారిన విజయసాయిరెడ్డి ట్వీట్ల వరస
– బాబు సహా ఎవరినీ దూషించని మార్పు
– మారిన విజయసాయిరెడ్డి ట్వీట్ల వరస
– ప్రత్యేక కథనాలు, ప్రపంచ విశ్లేషణ
– తారకరత్న మరణానికి ముందు నుంచీ ఇదే తీరు
– మారిన మనిషంటూ రఘురామకృష్ణంరాజు కితాబు
-తాజా బాబుకు బర్త్‌డే గ్రీటింగ్స్‌పై జగన్ అభిమానుల ఫైర్
– మీరూ మీరూ బాగుండాలి, ఇక్కడ మేమూ మేమూ కొట్టుకోవాలా అంటూ వ్యంగ్యాస్త్రాలు
– పార్టీలో పెద్దగా కనిపించని విజయసాయి
– సీఎంఒతో పెరిగిన దూరం
– ఢిల్లీకే పరిమితమైన వైనం
– వైసీపీలో విజయసాయి వ్యవహారశైలిపై చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
కొద్దికాలం క్రితం వరకూ వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్లు ప్రత్యర్ధులపై నిప్పులు రాజేసేవి. తన పార్టీకి కాపుకాస్తూ, ప్రత్యర్థి నేతలపై మాటల తూటాలతో ఫిరంగి రాముడయ్యేవారు. ప్రధానంగా టీడీపీ-జనసేనపై ఆయన అగ్గిరాముడి అవతారమెత్తేవారు. ఆయన మాటల తూటాలు ఒక్కోసారి పరిమితులు దాటేవి. ‘ఓరేయ్, వాడు, వీడు, ముసలోడు’ అంటూ పరిథులు దాటేవి.
అలాంటి ఆయన ఇప్పుడు తిబ్రుల్ ఎక్స్ ‘సంస్కారవంతమైన సబ్బు’ మాదిరిగా మారిపోయారు. రాముడు మంచిబాలుడిలా ‘విజయసాయి మంచిబాలుడ’య్యారు, వాడు, వీడు, ముసలోడు నుంచి.. శ్రీ, గారు వరకూ వచ్చారు. హటాత్తుగా వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం? ఊహించని స్థాయిలో వచ్చిన మార్పునకు కారణమేమిటి? రాజకీయ ప్రత్యర్ధులపై ఏవీ నాటి మాటల తూటాలు? ఎవరినీ నిద్రపోనివ్వని ఆ మాటల కొరడాలేవీ? ఉన్నట్లుండి వాటిని ఎందుకు జమ్మిచెట్టు ఎక్కించారు? ఇదీ .. ఇప్పుడు వైసీపీలో బిగ్ టాక్.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాధిపతి పవన్, యువనేత లోకేష్, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేత పట్టాభి, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితర నేతలపై ట్వీట్ల యుద్ధం చేసి, జగన్ అభిమానుల పెదవులపై చిరునవ్వులు పూయించిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జగన్‌కు సన్నిహితుడైన వేణుంబాక విజయసాయిరెడ్డిలో వచ్చిన గుణాత్మక మార్పు.. జగనన్న అభిమానులను విస్మయపరుస్తోంది.
వైసీపీ పక్షాన టీడీపీపై యుద్ధం చేసే సైన్యానికి.. చాలాకాలం పాటు నాయకత్వం వహించిన విజయసాయిరెడ్డి చేసే ట్వీట్లు, ఘాటుగా, పదునుగా ఉండేవి. టీడీపీ-జనసేనపై ఆయన సంధించే ట్వీట్లు అనేక సందర్భాల్లో వివాదమయ్యాయి. ముఖ్యంగా చంద్రబాబు ను ముసలోడు, అల్జీమర్స్, బొల్లి, నీకు ఎక్సపయిరీ డేటు వచ్చింది, ఫెవికాల్ బాబా అంటూ దారుణమైన భాష వాడేవారు. ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య వెనుక చంద్రబాబు ఉన్నారన్న ఆరోపణ సంధించారు. మూడుసార్లు సీఎం చేసి ఏం పీకావ్? అని ట్వీటేవారు.
ఇక లోకేష్‌ను పప్పు, రెండవ పులకేశీ, మాలోకం అంటూ విమర్శనాస్ర్తాలు సంధించేవారు. టీడీపీ నేత పట్టాభిని చాలాసార్లు పందితో పోల్చారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై అయితే ఒంటికాలితో లేచేవారు. ఎంపి రఘురామకృష్ణంరాజును విగ్గురాజు, ఏకాకరాజు అని విమర్శించేవారు.
అలాంటి విజయసాయిరెడ్డి.. టీడీపీ యువనేత లోకేష్ జన్మదనం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. లోకేష్‌కు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులుండాలని ఆకాంక్షించి, అందరినీ ఖంగుతినిపించారు. అదే బాటలో తాజాగా చంద్రబాబునాయుడుకూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పి, జగన్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచారు.
గతంలో బాబుకు ‘‘420 చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసిన అదే విజయసాయిరెడ్డి… ఇప్పుడు ‘‘ టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేయడం, వైసీపీ శ్రేణులు, జగనన్న అభిమానులను విస్మయంతోపాటు, అసంతృప్తిని మిగిల్చింది.
ప్రధానంగా జగనన్న అభిమానులు, విజయసాయి ట్వీట్‌పై బహిరంగంగానే తమ అసంతృప్తి ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ‘‘మేమూ మేమూ తన్నుకున్నా ఫర్వాలేదు. మీరు మాత్రం బాగుండాలా? ఇదేం న్యాయం సాయి గారూ? కార్యకర్తలేమో ఊర్లలో తన్నుకోవాలి. మీరేమో కలసి ఉండాలి. ఎందుకు సార్ ఈ రాజకీయాలు.. మా బతుకులకు’’ అంటూ జగనన్న అభిమానులు తమ ఆవేదనను టన్నుల కొద్దీ కురిపిస్తున్నారు. దీన్నిబట్టి.. చంద్రబాబుకు జన్మదినశుభాకాంక్షలు చెప్పిన విజయసాయి తీరుపై వైసీపీలో ఏ స్థాయిలో ఆగ్రహం కట్టలు తెంచుకుందో అర్ధమవుతుంది.
గతంలో చంద్రబాబును 420గా అభివర్ణిస్తూ ట్వీట్ చేసిన, అదే విజయసాయిలో ఇంతలోనే మార్పు రావడంపై వైసీపీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దానివెనుక కారణమేమిటన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చకు తెరలేచింది. నటుడు నందమూరి తారకరత్నకు, మామ వరసయ్యే విజయసాయిరెడ్డి చాలా సందర్భాల్లో, చంద్రబాబు తనకు అన్నయ్య అవుతారని చెప్పేవారు. పలుసార్లు ఆయన అన్నయ్యా అంటూ బాబుపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. అయితే తారకరత్న చావుబతుకుల్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుతోపాటు తారకరత్నకు వైద్యం విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు.
ఆ క్రమంలో తారకరత్న కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న బాలకృష్ణకు, విజయసాయి కృతజ్ఞతలు కూడా చెప్పారు. తారకరత్న ఎపిసోడ్‌లోనే చంద్రబాబు-విజయసాయి తొలిసారి భేటీ అయి, పక్కనే కూర్చుని మంతనాలు సాగిస్తున్న ఫొటోలు సంచలనం సృష్టించాయి. ఉప్పు-నిప్పుగా ఉన్న ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మంతనాలు జరపడాన్ని అటు వైసీపీ శ్రేణులు, జగనన్న అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు.
నిజానికి తారకరత్న ఆసుపత్రి ఎపిసోడ్ నుంచే ..విజయసాయిరెడ్డి ట్వీట్లలో, మార్పు రావడం ప్రారంభించిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అప్పుడే చంద్రబాబుపై విమర్శల వైఖరి తగ్గించుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. పైగా ఆయనను విశాఖ ఇన్చార్జిగా తొలగించిన వైనం కూడా విజయసాయి అసంతృప్తికి కారణమంటున్నారు.
అయితే విజయసాయిరెడ్డి ట్విట్టర్ అకౌంట్‌ను , ఆయనకు తెలియకుండానే సీఎంఓలో ఒక వ్యక్తి నిర్వహించేవాడని, ఇప్పుడు విజయసాయిరెడ్డి సొంతంగా చూసుకుంటున్నట్లు కనిపిస్తోందని, ఎంపి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ‘మా ప్రాంతీయపార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిలో వచ్చిన మార్పు మంచిదే. మార్పు ఎవరికైనా అనివార్యం’ అని ఎంపి రాజు అన్నారు.
తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో.. ఆయన కోలుకుంటున్నారని విజయసాయి మీడియాకు చెప్పారు. అయితే అందుకు భిన్నంగా.. తారకరత్న చనిపోయి చాలారోజులవుతున్నా, చంద్రబాబు తన కొడుకు భవిష్యత్తు కోసం, చనిపోయిన వార్తను దాచిపెట్టారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఆరోపించడం కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఇది కూడా విజయసాయి ఆగ్రహానికి ఒక కారణమంటున్నారు.
కాగా ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న దాఖలాలు లేవని పార్టీ వర్గాల్లో చర జరుగుతోంది. ఆయన ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారని, తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి సైతం పెద్దగా వస్తున్న దాఖలాలు లేవంటున్నారు. ప్రధానంగా సీఎంఓతో విజయసాయిరెడ్డికి దూరం పెరిగిందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
అయితే వ్యక్తిగతంగా జగన్‌ను- పార్టీపరంగా వైసీపీని, ప్రతిరోజూ విమర్శించే ఒక మీడియా అధిపతిని.. గన్‌మెన్ లేకుండా విజయసాయి, ఒంటరిగా వెళ్లి కలిశారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అది కూడా ఆయన ప్రాధాన్యం తగ్గించేందుకు, ఒక కారణమని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
అందుకు తగినట్లుగానే .. సీఎం జగన్ కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి-సుబ్బారెడ్డి- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోనే అన్ని అంశాలు చర్చిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో విశాఖలో విజయసాయి పాత్రను, ఇప్పుడు చెవిరెడ్డి పోషిస్తున్నారన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.