Suryaa.co.in

Andhra Pradesh

నాడు-నేడుతో పాఠశాలలకు రంగులేయడం తప్ప జగన్ రెడ్డి చేసిందేమిటి?

– గిరిజన విద్యార్ధులను విద్యకు దూరం చేసేలా గిరిజన గురుకులాలను రద్దు చేస్తామనడం దుర్మార్గం
– రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం. ధారు నాయక్

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 12 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పుడు మరలా గిరిజన విద్యార్ధుల విధ్యోన్నతికి కృషి చేస్తున్న గిరిజన గురుకులాలను ఎత్తేస్తాం అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016 లో గిరిజనులకు నాణ్యమైన విద్య అందించాలని 81 స్కూళ్లను గిరిజన గురుకులాలుగా మార్చడం జరిగింది.

అంతేకాకుండా ఆ స్కూళ్లలో రూ.126 కోట్లతో క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేసి జాతీయ క్రీడలకు గిరిజన పిల్లలను ప్రోత్సహించడం జరిగింది. టిడిపి హయాంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఒక్కోదానికి రూ.12 కోట్లు కేటాయించి మౌళికసదుపాయాలు ఏర్పాటు చేస్తే.. నేడు జగన్ రెడ్డి నాడు నేడు పేరుతో రంగులేస్తూ హడావుడి చేస్తున్నారు.

తెలుగుదేశం స్పెషల్ డీఎస్సీ నిర్వహించి 301 ఉపాధ్యాయ ఖాళీలను ఎస్టీలతో భర్తీ చేసింది. గిరిజన ప్రాంతాల్లోని టీచర్ పోస్టులను 100% గిరిజనులతోనే భర్తీ చేసేలా జీవో ఎం.ఎస్ నెం.3ని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. ఇటీవల ఈ జీవోను సుప్రీం కోర్టు కొట్టేసినా.. జగన్ రెడ్డి ప్రభుత్వం కనీసం అప్పీల్ కు కూడా వెళ్లలేదు. శాసన సభలో దీనిపై కనీసం తీర్మానం చేయలేదు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజనులకు తీరని అన్యాయం జరగుతోంది. తరాతరాలుగా విద్యకు దూరమైన గిరిజనుల పిల్లలు ఇప్పుడిప్పుడే విద్యోన్నతి వైపు అడుగులు వేస్తుంటే నేడు జగన్ రెడ్డి వాటిని రద్దు చేయాలని నిర్ణయించడం దుర్మార్గం. గిరిజన గురుకులాలను రద్దు చేయాలనే ఆలోచనను వైసీపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. లేకుంటే గిరిజనులంతా ఏకమైన ఈ ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE