Suryaa.co.in

Andhra Pradesh

జీ-20 సదస్సు వేళ ఏమిటీ అరాచకం?

– దానిని దృష్టి మరల్చేందుకే బాబు అరెస్టు
– ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకున్నా అరెస్టు చేస్తారా?
– బాబు అరెస్టు అప్రజాస్వామ్యం
– కేంద్రమాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుజనాచౌదరి విస్మయం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామమన్నారు. ఆయన అరెస్టు సమయంలో జగన్ ప్రభుత్వం, చట్టాన్ని గౌరవించలేదని దుయ్యబట్టారు. ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండే చంద్రబాబును, అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేయడం పైశాచిక ఆనందానికి పరాకాష్ఠ అన్నారు.

ప్రధానంగా ప్రపంచదేశాల అధినేతలు ఢిల్లీ వేదికగా హాజరైన జీ-20 సదస్సుకు హాజరైన రోజునే, చంద్రబాబును అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. దానిని ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబును అరెస్టు చేసినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. బాబు అరెస్టుతో జగన్ ప్రభుత్వం ఏం సందేశం ఇస్తోందని ప్రశ్నించారు. రాజకీయాల్లో కక్షసాధింపు వైఖరి ఎవరికీ మంచిదికాదన్నారు. ఏపీలో హుందాతనమైన రాజకీయాలకు వైసీపీ పాతరవేయటం బాధగా ఉందన్నారు.

గతంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తమ పార్టీ కార్యకర్త తలపై , పోలీసు కాళ్లతో తొక్కివేశారని గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించి, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తే ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు. అసలు ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని సుజనా ప్రశ్నించారు. ఏపీలో దారితప్పుతున్న శాంతిభద్రతల పరిస్థితిని కేంద్రం గమనిస్తోందని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE