– ఇందిరమ్మ రాజ్య మంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా?
– ఆర్మూర్ లో యదేచ్ఛగా పోలీసు ఆరాచకాలు
– అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారిన కొందరు పోలీసు అధికారులు
– లేకుంటే 10వేల మందితో పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తా
– పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్:: ఇందిరమ్మ రాజ్య మంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలో యదేచ్ఛగా పోలీసు ఆరాచకాలు కొనసాగుతున్నాయని, కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి కాంగ్రెస్ సేవలో తరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆర్మూరు లో యువకులు పెద్దఎత్తున డీజే ల లో మళ్లీ కేసీఆరే రావాలి, కారే రావాలి అని పాటలు వింటూ డ్యాన్స్ లు చేస్తే వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని జీవన్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ పాటలు వింటే పోలీసుల కెందుకు అభ్యంతరం అని ఆయన నిలదీశారు. దళిత యువకుడు రోహిత్ ను పోలీసులు అక్రమంగా నిర్బంధించి రెండు రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారని, రోహిత్ కోసం ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నా పోలీసులకు కనికరం లేదని జీవన్ రెడ్డి అన్నారు.
తాను ఎన్ని సార్లు ఫోన్ చేసినా పోలీసు అధికారులు స్పందించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.మీరు ప్రజలను కాపాడే పోలీసులా?, హింసించే కాంగ్రెస్ కార్యకర్తలా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కు తొత్తులుగా మారి అరాచకాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామన్నారువచ్చేది కేసీఆర్ ప్రభుత్వ మేనని, కాంగ్రెస్ కు ఊడిగం చేస్తున్న వారి లెక్కలు తెలుస్తామని ఆయన హెచ్చరించారు.