Suryaa.co.in

Andhra Pradesh

నా రాజీనామాతో ప్రజలకు ఉపయోగమేమిటి?

-మళ్లీ పోటీ చేసి నెగ్గుతాను… జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారా??
-కుప్పం ప్రజా చైతన్యం చూశాకైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి
-తన సర్వే రిపోర్ట్ లో చెప్పిందే… పీకే నివేదిక ద్వారా వెళ్లడయ్యింది
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తనపై అనర్హత వేటు వేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన ఏ 1, ఏ 2లు ఇప్పుడు తనని రాజీనామా చేయాలని కోరడం అర్థరహితమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. తన రాజీనామా వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను ఇప్పుడు రాజీనామా చేసిన, మళ్లీ పోటీ చేస్తే నెగ్గుతాననే ధీమాను వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని అయితే తాను పోటీ చేసి గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, తిరిగి ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.

శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మద్య నిషేధం హామీ మాదిరిగా ఉత్తుత్తి మాటలు కాదని, తాను రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచిన వెంటనే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఎన్నికలకు వెళ్తానని జగన్మోహన్ రెడ్డి లిఖితపూర్వక హామీ ఇవ్వాలన్నారు. సిబిఐకి తనపై ఫిర్యాదు చేస్తానని ఏ 2 పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి గతంలోనే
ఎన్నో లుచ్చా పనులను చేశారు కదా అంటూ విరుచుకపడ్డారు. ఏ 1, ఏ 2 లు కలిసి 43 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. అయినా సిబిఐ విచారణను ఎదుర్కోకుండా, కోర్టులకు హాజరు కాకుండా, అన్నింటిని సూట్ కేసులతో మేనేజ్ చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు.

బ్యాంకుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న రుణాలెన్ని , వాటిలో వెనక్కి వేసుకున్నది ఎంతో, అంతా తెలుసునని రఘురామకృష్ణం రాజు అన్నారు. కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులన్నీ అక్రమం, అవినీతిమయమని కేంద్ర ప్రభుత్వం పిలిచి చివాట్లు పెట్టిందన్నారు. సోమనాథన్ కలిసి తరువాత పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు సోమ నాథన్ కు, పోలవరం కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చివాట్లు పెట్టారని… రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అరాచకాలు, అప్పులపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి బయటికి వచ్చి ఏవో కబుర్లను చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ సమావేశంలో జరిగిందేమిటో రాస్తే, సాక్షి దినపత్రిక మాత్రం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి ఆహా … ఓహో అంటూ కథనాలను రాసిందని విమర్శించారు. ప్రధానితో సమావేశం అనంతరం షెడ్యూల్ ప్రకారమే పోలవరం పూర్తి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, షెడ్యూల్ ప్రకారమే అంటే ఎప్పటి వరకూ అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు. ఇప్పటికే పూర్తికావచ్చిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, పూర్తి చేయకపోతే ఓట్లు అడగమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు మధ్య నిషేధం చేస్తామని చెప్పామని, ఒకవేళ మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగబోమన్నామని, ఆ మాటకే కట్టుబడి ఉండాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల, తప్పులపై సోమనాథ్ కు తాను లేఖ రాసినట్లు, లేఖ ప్రతులను మీడియా ముందు ప్రదర్శించారు.

బ్రిటిష్ పాలన… జగన్ పరిపాలన కంటే 100 రెట్లు నయం
బ్రిటిష్ పాలన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే 100 రెట్లు నయమని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. స్వాతంత్రోద్యమ సమయంలో శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని బ్రిటిష్ పాలకులు ఏమీ అనలేదని, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అన్యాయంగా కాల్చి చంపిన రూథర్ఫోర్డ్ పై అనంతరం విచారణ చేపట్టి అతన్ని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చే వారిని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఒక చెల్లమ్మ తెలంగాణలో తిరుగుతుంటే, మరొక చెల్లి ఢిల్లీలో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారని, ఇక తల్లి వాహనం రెండు ట్యూబ్ లెస్ టైర్లు నడిరోడ్డుపై బద్దలయ్యాయన్నారు. పెదనాన్నను చంపిన వంశం నీదని విజయసాయి రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన రఘురామకృష్ణంరాజు, బ్రిటిష్ కాలంలో కొందరు పంది మాంసాన్ని అమ్ముకునే టైంలో తన తాత అమెరికాకు వెళ్లి చదువుకొని వచ్చారని, అటువంటి తన గురించి వ్యాఖ్యలు చేస్తే జనాలు చెప్పులు తీసుకుని కొడతారని హెచ్చరించారు.

కుప్పం ప్రజా చైతన్యం చూసిన తర్వాత అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా… నేను కొడతాను, నా చేతిలో పోలీసులు ఉన్నారు, కేసులు పెడతానంటే వ్యవస్థలు ఊరుకోవు… సోకాల్డ్ ప్రభుత్వ పెద్దలారా? అంటూ రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. పాలకపక్ష ఎంపీ నైనా తనని నియోజకవర్గంలో తిరగనివ్వరని, నియోజకవర్గంలో అడుగుపెడితే కేసులు పెట్టి వేధిస్తారని, ఇప్పుడు ప్రతిపక్ష నేతను ఆయన నియోజకవర్గంలోని అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కుప్పంలో ఎలాగో తమకు కార్యకర్తలు లేరని, పక్క అసెంబ్లీ నియోజకవర్గాల నుండి కార్యకర్తలను తరలించి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం పరిశీలిస్తే, అమ్మ పెట్టదు… అడక్కు తిననివ్వదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నదని విమర్శించారు. అన్నా క్యాంటీన్ ల ద్వారా పాలకొల్లు, మంగళగిరిలో ఇప్పటికే పేదలకు పట్టెడన్నం పెడుతున్నారని, ఇప్పుడు కుప్పంలోనూ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు కడుపు నింపే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోవడం అవివేకం కాక మరేమవుతుందని ప్రశ్నించారు. కుప్పంలో తొలుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, టిడిపి ఫ్లెక్సీలను చించి వేశారన్న ఆయన, వాళ్ల ఫ్లెక్సీలను చించితే తమ పార్టీ ఫ్లెక్సీలను చించకుండా ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అయినా సాక్షి ఛానల్ లో మాత్రం రౌడీ బాబు అంటూ కథనం ప్రసారం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం కాదా అంటూ మండిపడ్డారు. సొంత పార్టీ ఎంపీ తో పాటు, జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేతపై రాళ్ల దాడి చేయించే స్థితికి ప్రభుత్వ పెద్దలు వచ్చారంటే పతనం అంచుల్లో ఉన్నట్లే నని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. తమ వికృత చేష్టల ద్వారా ఇటువంటి సన్నాసులకు, పనికిమాలిన వారికి, రౌడీలకా ఓట్లు వేసింది అని ప్రజలను ప్రశ్నించినట్లుగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నదన్నారు.

గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇలాగే వ్యవహరించి ఉంటే ఓదార్పు యాత్ర పేరిట జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి ఉండేవారా? అని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. పారిశ్రామిక సమ్మిట్ ను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆయన పర్యటనకు బాబు ప్రభుత్వం అనుమతించలేదని, మిగిలిన అన్ని సమయాలలో రక్షణ కల్పించి, రోప్ పార్టీలను ఏర్పాటు చేసి ఈ మూల నుంచి, ఆ మూలకు తిరిగే అవకాశాన్ని కల్పించారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు తప్పు చేశారని, తాను ఆ తప్పు చేయబోను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని, ఈ ధమన కాండను ఆపివేసి, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయాలని సూచించారు.

తాను సర్వేలో చెప్పిందే…నిజం
తన సర్వే రిపోర్ట్ తప్పని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం పట్ల రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి 93 స్థానాలు విజయం సాధిస్తుందని తన సర్వే రిపోర్ట్ లో పేర్కొన్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రశాంత్ కిషోర్ సర్వే నివేదిక ప్రకారం.. రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే 75 స్థానాలలో అభ్యర్థులను మార్చనున్నామని ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారన్న ఆయన, ప్రస్తుతం టిడిపికి 18 స్థానాలు ఉన్నాయన్నారు. 75 ప్లస్ 18 స్థానాలు కలిస్తే 93 స్థానాలే అవుతాయని, తన సర్వే నివేదిక ఇంకా ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ తన నివేదికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 నుంచి 44 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నట్లు తెలిసిందన్న ఆయన, తాను 68 స్థానాలలో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంటుందని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ స్థానాలలో సగం స్థానాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారన్నారు.

హేమంత్ పై చర్యలుంటే.. జగన్ కు ఇబ్బందులే
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై అనార్హత వేటు వేయాలని గవర్నర్ చేసిన సిఫార్సులను ఎన్నికల సంఘం ఆమోదిస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చునని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధుల చట్టం ప్రకారం హేమంత్ సోరెన్ చేసినది తప్పే అయితే, అంతకంటే పెద్ద పెద్ద తప్పులు చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకని గాంధారి చూపు చూస్తున్నదో అర్థం కావడం లేదన్నారు. సోరెన్ పై చర్యలు తీసుకుంటే, అంతకంటే పెద్ద, పెద్ద అవినీతి అక్రమాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డిపై కూడా చర్యలు తప్పకపోవచ్చునని అన్నారు. తన సొంత కంపెనీ అయినా సరస్వతి పవర్ కు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనుమ తులను ఇచ్చారని, ఇక సాక్షి దినపత్రికలో ఈ మూడున్నర ఏళ్ల వ్యవధిలో 150 నుంచి 200 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారన్నారు. కేంద్రంలో ఉన్న శ్రీ కృష్ణులు శిశుపాలుడు చేసే 100 తప్పుల కోసం వేచి చూస్తున్నారని గతంలో బిజెపి కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆ 100 తప్పులు ఇప్పటికే పూర్తయ్యాయని ఇక శిశుపాలునికి రాజకీయ శిరచ్ఛేదం తప్పకపోవచ్చునని రఘురామ కృష్ణంరాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షిస్తే రాష్ట్రంలో ప్రజలు బ్రతికే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారంపై తాను అవసరమైతే రాష్ట్రపతికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలన ఎంతో దూరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

సలహాదారులారా పదవుల నుంచి తప్పుకోండి
ప్రభుత్వ ఖజానాను జలగల్లా పీలుస్తున్న సలహాదారులారా పదవుల నుంచి తప్పు కావాలంటూ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ప్రజల్లో కాస్తో కూస్తో గౌరవం ఉండాలంటే, సలహాదారులు తక్షణమే తమ పదవుల నుంచి తక్షణమే వైదొలగాలన్నారు. తమ బంధువులను, బంధువుల బంధువులను పందుల్లా మేపుకునే ఈ విధానం మారాలన్నారు.

పవన్ కళ్యాణ్ ఒక ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అని, ఆయనతో పెట్టుకోవద్దని పార్టీ మేలుకోరి చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు అన్నారు. పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి పేర్ని నాని చేత విమర్శలు చేయించడం మానుకోవాలన్నారు. లేకపోతే అగ్నితో పెట్టుకుంటే మాడి మసైపోతారని హెచ్చరించారు.

వ్యవస్థకే వన్నెతెచ్చిన సీజే రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంకటరమణ పదవీ విరమణ చేయడం కాస్త బాధాకరమైనప్పటికీ, ఆయన తన అనుభవంతో తెలుగువాడిగా, తెలుగు ప్రజల కష్టాల గురించి ఆలోచించి, వారి కష్టాలను దూరం చేయడానికి మార్గనిర్దేశం చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 16 నెలల పదవి కాలంలో 270 మంది హైకోర్టు న్యాయమూర్తులను నియమించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వెంకటరమణ పదవీ విరమణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు సైతం కన్నీళ్లను పెట్టుకొని, ఆయనకు వీడ్కోలు పలకడం చూస్తే… ఆయన ఔన్నత్యం తెలిసిపోతుందన్నారు.

LEAVE A RESPONSE