Suryaa.co.in

Andhra Pradesh

ఆ డ్యామ్‌ గేట్‌కు, జగన్‌కి ఏమిటి సంబంధం?

-డ్యామ్‌ నిర్వహణ బాధ్యత తుంగభద్ర బోర్డుది
– మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

గుంటూరు: వరద ఉధృతికి తుంగభద్ర డ్యామ్‌లో ఒక గేట్‌ కొట్టుకుపోతే, దానికి జగన్‌గారిని బాధ్యులను చేస్తూ, మీడియా నానా దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. తుంగభద్ర డ్యామ్‌ నిర్వహణను తుంగభద్ర బోర్డు చూస్తోందన్న ఆయన, అందులో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రాతినిథ్యం కలిగి ఉన్నాయని వెల్లడించారు. అలాంటప్పుడు డ్యామ్‌లో భారీ వరదకు ఒక గేట్‌ కొట్టుకుపోతే, దానికి గత ప్రభుత్వం, జగన్‌గారు ఎలా బాధ్యులవుతారని నిలదీశారు.

తుంగభద్ర డ్యామ్‌లో 19వ క్రస్ట్‌ గేట్‌ కొట్టుకుపోవడం వల్ల రిజర్వాయర్‌ నుంచి దాదాపు 90 వేల క్యూసెక్కుల నీరు అనివార్యంగా దిగువకు వస్తోందని, దీనివల్ల రాష్ట్రంలో వరదముప్పు రావడమే కాకుండా, ఆయకట్టుకు ఈ ఏడాది నీటి సరఫరాకు ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందని అంబటి రాంబాబు తెలిపారు. అందువల్ల వీలైనంత త్వరగా మరమ్మతు చేసి, రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేయాలని డిమాండ్‌ చేశారు.

గతంలో తమ ప్రభుత్వ హయాంలో పులిచింతల ప్రాజెక్టులో 16వ గేట్‌ కొట్టుకుపోతే, కేవలం 20 రోజుల్లో దాన్ని రిపేర్‌ చేశామని.. అయినా ఆనాడు మీడియాలో బురద రాతలు రాశారని అంబటి రాంబాబు తెలిపారు. అలాగే, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్‌ కూడా కొట్టుకుపోతే.. దానికీ మేమే కారణం అంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. నిజానికి చంద్రబాబు నిర్వాకం వల్లనే గుండ్లకమ్మ గేట్‌ కొట్టుకుపోయిందన్న ఆయన, ఆ ప్రాజెక్టుపై రూ.6 కోట్లు ఖర్చు చేసి రంగులు వేసి, విగ్రహం పెట్టారు తప్ప, గేట్లకు కనీస మరమ్మతులు చేయలేదని చెప్పారు.

తుంగభద్ర డ్యామ్‌ నిర్మించి 71 ఏళ్లు పూర్తయ్యాయని, కానీ నిజానికి ఆ ప్రాజెక్టు గ్యారెంటీ పీరియడ్‌ 45 ఏళ్లు మాత్రమే అని ఆయన తెలిపారు. ఇవన్నీ విస్మరించి ఏం జరిగినా.. అన్నింటికి వైయస్సార్‌ లేదా జగన్‌ని బాధ్యులను చేయడం చంద్రబాబుకి అలవాటుగా మారిందని అంబటి రాంబాబు ఆక్షేపించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్న చంద్రబాబు, ఇప్పుడు వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నానా కుట్రలు చేస్తున్నారని, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, అన్నింటికీ జగన్‌గారిని నిందిస్తున్నారని అంబటి రాంబాబు ప్రస్తావించారు.

LEAVE A RESPONSE