– డిజిటల్ మాయాజాలం vs లోహాల లోకం
– భవిష్యత్తు కేవలం స్క్రీన్ల మీద లేదు.. కరిగే లోహాలలో, పెరిగే పరిశ్రమలలో ఉంది
– మెటలర్జీని ‘లాస్ట్ ఆప్షన్’గా కాదు.. ‘బెస్ట్ ఆప్షన్’గా ఎంచుకోండి
– ఆంధ్రా అందిస్తున్న అద్భుతమైన అవకాశం ఏమిటి?
ఒకప్పుడు ‘ఇంజనీరింగ్’ అంటే సివిల్, మెకానికల్, మెటలర్జీ వంటి ‘కోర్’ రంగాలు గుర్తుకు వచ్చేవి. కానీ గత రెండు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థుల కలల ప్రపంచం కేవలం సాఫ్ట్వేర్ చుట్టూనే తిరుగుతోంది. ఐఐటీల్లో కూడా మెటలర్జీ సీటు వస్తే, దానిని కేవలం ఆ ప్రతిష్టాష్టాత్మక సంస్థలో అడుగుపెట్టడానికి ఒక ‘మెట్టు’గా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప, ఆ సబ్జెక్టుపై మక్కువతో కాదు. కానీ, నేడు మారుతున్న ప్రపంచ సమీకరణాలు ఈ ధోరణిని ప్రశ్నిస్తున్నాయి.
ఏఐ భయం.. లోహాల అభయం!
ప్రస్తుతం ఐటి రంగం ఒక విలక్షణమైన సంక్షోభంలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాధారణ కోడింగ్ ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారాయి. కానీ మెటలర్జీ వంటి రంగాలు ఇప్పుడు “ఏఐ-ప్రూఫ్” కెరీర్లుగా అవతరిస్తున్నాయి. కంప్యూటర్ స్క్రీన్ మీద బొమ్మలు గీయడం ఏఐకి సులభమే కావచ్చు, కానీ ఒక స్టీల్ ప్లాంట్‌లో లోహాన్ని కరిగించి, కొత్త అల్లాయ్‌ను సృష్టించడం కేవలం మానవ మేధస్సు మరియు భౌతిక సమక్షంలోనే సాధ్యం.
చిప్ వార్స్ – మెటలర్జీయే కీలకం!
భారతదేశం ఇప్పుడు సెమీకండక్టర్ల తయారీలో గ్లోబల్ హబ్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ‘చిప్ తయారీ’ వెనుక ఉన్నది కోడింగ్ మాత్రమే కాదు, అత్యంత శుద్ధమైన లోహాల ప్రాసెసింగ్. గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, మరియు రక్షణ రంగంలో వాడే అత్యాధునిక క్షిపణులు.. వీటన్నింటికీ మూలాధారం మెటలర్జీయే. ఐటి రంగంలో ప్యాకేజీలు స్థిరంగా మారిపోతున్న తరుణంలో, ఈ ‘కోర్’ రంగాలలో నిపుణుల కొరత వల్ల జీతాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.
విశాఖ తీరాన కొత్త శకం: ఆదిత్య మిట్టల్ సంచలన ప్రకటన!
ఈ రంగం పట్ల అపోహలను పటాపంచలు చేస్తూ నిన్న (మార్చి 23, 2026) అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఒక అద్భుతమైన ముందడుగు పడింది. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ఇండియా భారీ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆదిత్య మిట్టల్ ఒక గొప్ప శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక మేరకు విశాఖపట్నంలో అత్యాధునిక ‘మెటలర్జికల్ ఇన్స్టిట్యూట్’ ఏర్పాటు కాబోతోంది!
ఇది కేవలం ఒక కాలేజీ కాదు.. అదొక ‘జాబ్ గ్యారెంటీ’ వేదిక. ఇక్కడ మెటలర్జికల్ డిగ్రీ పొందిన విద్యార్థులకు నేరుగా స్టీల్ ప్లాంట్‌లోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విశేషమేమిటంటే, ఈ ప్లాంట్ పాతకాలం నాటిది కాదు.. ఇందులో రోబోటిక్స్ మరియు ఏఐ (AI) వంటి అధునాతన సాంకేతికతను వినియోగిస్తారు. అంటే మీరు మెటలర్జీ చదువుతూనే, లేటెస్ట్ టెక్నాలజీతో పని చేసే అవకాశం లభిస్తుంది!
ఇక చదువు పూర్తి కాగానే సాఫ్ట్వేర్ బెంచ్‌ల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. విశాఖ తీరంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమయ్యే స్టీల్ ప్లాంట్ మీ కోసం ఎదురుచూస్తోంది. అత్యున్నత భద్రత (Safety), అంతర్జాతీయ స్థాయి పని వాతావరణం, మరియు నేరుగా ఉద్యోగం – ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకేముంటుంది?
భవిష్యత్తు కేవలం స్క్రీన్ల మీద లేదు, కరిగే లోహాలలో, పెరిగే పరిశ్రమలలో ఉంది. విశాఖలో రాబోతున్న ఈ మెటలర్జికల్ ఇన్స్టిట్యూట్ మీ కెరీర్‌ను మలుపు తిప్పే బంగారు అవకాశం. మెటలర్జీని ‘లాస్ట్ ఆప్షన్’గా కాదు, ‘బెస్ట్ ఆప్షన్’గా ఎంచుకోండి.
విశాఖ సాక్షిగా.. మీ కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి!
