– పండగ రోజు కూడ పాత మొగుడేనా అనే సామెత ఎందువల్ల వచ్చింది?
ప్రచారంలోని కంచుకోత్సవ కథ :
చరిత్రలో, రవికల పండుగ అనేది ఒకప్పుడు కొన్ని ప్రాంతాలలో ఆచరించే కంచుకోత్సవం అనే ఉత్సవానికి సంబంధించినదిగా చెబుతారు.
కంచుకం అంటే రవిక అని అర్థం. ఈ ఉత్సవంలో, గ్రామ స్త్రీలు తమ రవికలను విడిచి ఒక చోట గుట్టగా పోయడం లేదా నదిలో వదలడం చేసేవారని తెలుస్తోంది.
పురుషులు ఆ రవికల గుట్టలోంచి లేదా నదిలోంచి ఒక రవికను తీసుకొని, ఆ రవిక ఎవరిదో కనుగొనేవారు. ఆ రవిక ఎవరిదైతే, ఆ స్త్రీ ఆ రాత్రికి ఆ రవికను తీసుకున్న పురుషునితో సంయోగంలో పాల్గొనవలసి వచ్చేది అని కథనాలు చెబుతున్నాయి.
రవికల పండుగ రోజున, ఒక పురుషుడు రవికను తీయగా, అది తన సొంత భార్యది అయ్యిందట. ఆ భార్య నిరాశతో “పండగ నాడు కూడా పాత మొగుడేనా?” అని నిట్టూర్చిందట.
పండగ అంటే కొత్తదనం, మార్పు మరియు ఉత్సాహం కోరుకునే ప్రత్యేక రోజు. అలాంటి ప్రత్యేకమైన రోజున కూడా, జీవితంలో కొత్తదనం లేకుండా, రోజూ చూసే పాత మనిషే తారసపడటం లేదా పాత విషయమే ఎదురుకావడం పట్ల కలిగే నిరాశను ఈ సామెత వ్యక్తపరుస్తుంది.
ఈ ఉత్సవం సామాజిక కట్టుబాట్లు బలహీనంగా ఉన్న కాలంలో లేదా కొన్ని తెగలలో ఆచారంగా ఉండేదని చెబుతారు. ఈ పద్ధతి ప్రస్తుతం ఎక్కడా ఆచరణలో లేదు మరియు దీని చారిత్రక ప్రామాణికత గురించి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఈ సామెత ఈ రవికల పండుగ అంటే కంచుకోత్సవం సందర్భంలో నుంచే పుట్టిందని ఒక కథ ప్రచారంలో ఉంది.
పండితుల అభిప్రాయం. ప్రకారం :
చాలా మంది భాషావేత్తలు మరియు పండితుల అభిప్రాయం ప్రకారం, ‘పండగ రోజు కూడ పాత మొగుడేన’ అనేది తప్పుగా వాడబడిన లేదా కాలక్రమంలో మార్పు చెందిన సామెత.
అసలు సామెత: “పండగ పూట పాత మడుగేనా ?”
అర్థం : ఇక్కడ ‘మడుగు’ అంటే వస్త్రం లేక బట్ట అని అర్థం.
పండుగ రోజున కొత్త బట్టలు అంటే మడుగులు ధరించడం ఆనవాయితీ. అలాంటి పండుగ రోజున కూడా పాత బట్టలు వేసుకుంటారా ? కొత్త బట్టలు వేసుకోండి అని చెప్పడానికి ఈ సామెతను వాడేవారు.
కాలక్రమేణా, ‘మడుగు’ అనే పదం ‘మొగుడు’గా మారి, అసలు అర్థం మారిపోయి, ‘పండగ రోజు కూడ పాత మొగుడేన’ అనే వివాదాస్పద సామెత వాడుకలోకి వచ్చిందని చెబుతారు.
– ఎస్.ఎస్.రెడ్డి
తిరుపతి