( శ్రీనివాస్ గన్నివరపు)
గ్రామీణ నిరుపేదల ఉపాధికి గ్యారెంటీ ఇచ్చిన గొప్ప ఏర్పాటు ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (MGNREGA). దాదాపు రెండు దశాబ్దాలుగా పేదరికంలో చిక్కుకున్న పల్లె జనానికి కూడు పెట్టిన ఈ చట్టం, నేడు తన ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్’ (VB-G RAM G) ముసాయిదా బిల్లు, ఉపాధి హామీ చట్టం యొక్క మౌలిక స్వరూపాన్నే మార్చేసేలా ఉండటం ఆందోళనకరం. పేదవాడికి ‘పని హక్కు’ను కల్పించిన ఒక చారిత్రక చట్టాన్ని, కేవలం నిధుల కేటాయింపుల పథకంగా మార్చే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
కొత్త బిల్లులో పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచడం స్వాగతించదగ్గ పరిణామమే!..కానీ, ఆ పెంపుదల వెనుక ఉన్న షరతులే అసలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా, వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ‘పని నిలిపివేత’ నిబంధన విధించాలన్న ప్రతిపాదన అత్యంత వివాదాస్పదం.
రైతుల పొలాల్లో కూలీల కొరతను నివారించడానికే ఈ నిర్ణయమని ప్రభుత్వం చెబుతున్నా, ఇది పరోక్షంగా పేద కూలీల బేరసారాల శక్తిని దెబ్బతీయడమే. కరువు కాలంలోనో, అవసరమైనప్పుడో పని అడిగే హక్కు కూలీకి ఉండాలి కానీ, ఫలానా సమయంలో పని అడగకూడదని ఆంక్షలు విధించడం ‘ఉపాధి హామీ’ అనే మాటకు అర్థం లేకుండా చేస్తుంది.
మరొక ప్రధాన ఆందోళన నిధుల కోత. ఇప్పటివరకు వేతనాల భారాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుండగా, కొత్త బిల్లులో దానిని కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో పంచుకోవాలని ప్రతిపాదించారు.ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఇది తలకు మించిన భారం. రాష్ట్రాలు తమ వాటా చెల్లించలేకపోతే, ఆ ప్రభావం నేరుగా పేద కూలీల పొట్టమీద పడుతుంది. నిధులు లేక రాష్ట్రాలు పనులు మంజూరు చేయకపోతే, ‘డిమాండ్ ఆధారిత’ పథకం కాస్తా ‘నిధుల ఆధారిత’ పథకంగా మారిపోతుంది.
ఇప్పటికే సాంకేతికత పేరుతో జరుగుతున్న ప్రయోగాలు గ్రామీణ కూలీలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆధార్ ఆధారిత చెల్లింపుల పేరుతో లక్షల మంది పేర్లు జాబితా నుండి గల్లంతయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్య చేపట్టిన ఈ కేవైసీ డ్రైవ్ వల్ల కేవలం ఆరు వారాల్లోనే 14 లక్షల మందికి పైగా కూలీలు ఉపాధి హామీకి దూరమయ్యారన్న గణాంకాలు కలవరపెడుతున్నాయి. పని ప్రదేశంలో ఇంటర్నెట్ లేక, వేలిముద్రలు పడక కూలీలు పస్తులు ఉండాల్సి వస్తున్న యదార్థాన్ని విస్మరించి, మరిన్ని కఠిన నిబంధనలు తీసుకురావడం శ్రేయస్కరం కాదు.
‘వికసిత్ భారత్’ నిర్మాణం జరగాలంటే గ్రామీణ భారతం బలంగా ఉండాలి. కేవలం చట్టం పేరులో ‘గాంధీ’ని తొలగించి ‘వికసిత్’ అని చేర్చినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదు. పల్లెల్లో కొనుగోలు శక్తిని పెంచి, వలసలను అడ్డుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం అంటే.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టడమే.
ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లుపై పునరాలోచించి, పేదల ‘పని హక్కు’కు భంగం కలగకుండా, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.