– ఎప్పటి నుంచో కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్
– స్మార్ట్ మీటర్లు.. ట్యాబుల కొనుగోళ్ల లో పెద్ద ఎత్తున కుంభకోణం
– ట్యాబుల కొనుగోళ్ళ లో 221 కోట్ల అవినీతి
– జీసస్ రక్తం చిందిస్తే… జగన్ రక్తం తాగుతున్నాడు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
అగ్రవర్ణ పేదల ( ఈ డబ్ల్యూ ఎస్ ) రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించడానికి ఎటువంటి అడ్డంకులు లేవన్నారు. కోర్టు కూడా స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు.
అయినా, రాష్ట్ర ప్రభుత్వం కోర్టులను వంక చూపి కాపులకు ద్దు శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా తాత్సారం చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రతిపాదించారనే జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం లేదన్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుకు లభిస్తుందన్న అక్కసుతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కోర్టు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రాథమిక విద్య తెలుగు మాధ్యంలోనే కొనసాగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోయినా తెలుగు మీడియంలో జగన్మోహన్ రెడ్డి ఎత్తివేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే 11474 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని తెలిపారు.
కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తుందని రఘురామకృష్ణం రాజు చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కటి ఆలోచన చేశారు. కాపులలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కేటాయించాలని నిర్ణయించారు. తాను కూడా గతంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాపు కులం పై ఉన్న ద్వేషంతో ఎంతమంది చెప్పినా,ఆ కులం వారు ఎన్ని మార్లు వినతి పత్రాలను అందజేసిన అమలుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
కోర్టు ఇబ్బందులు ఉన్నాయని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు ఐదు శాతం కాపులకు అమలు చేయడం పట్ల, ఇతర కులాలలోని అగ్రవర్ణ పేదలకు కించత్ బాధ కలిగే అవకాశం ఉన్నప్పటికీ, అగ్రవర్ణ పేదలలో 50 శాతం మంది కాపులలోనే ఉన్నారు. కాపులకు ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు ఐదు శాతం అమలు చేయడం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు.
రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లలో, విద్యార్థులకు ఇవ్వనున్న ట్యాబ్ లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. కడపలోని ఒక మీడియం సైజ్ కంపెనీ అయిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ద్వారా స్మార్ట్ మీటర్లను ఎలా కొందామని, ఎలా డబ్బులను కొట్టేద్దామని అనుకున్నారని ఒక ప్రముఖ దినపత్రికలో సమగ్ర వార్తా కథనం వచ్చింది.. మీటర్ ఖరీదు 100% పెంచి వసూలు చేయాలని, నిర్వహణ ఖర్చును ఏడాదికి 300 శాతం పైగా, చిన్న చిన్న ఉప పరికరాలకు 20 రెట్లు ధరలను పెంచుకొనేలా ప్రణాళికలు రచించారు.
స్మార్ట్ మీటర్లు పెట్టాలా వద్దా అన్నది పక్కన పెడితే, నిధులను ఎలా కొట్టేయ్యాలన్నది జగనన్న స్మార్ట్ సాయి దీవెన పథకం. రాష్ట్రంలో స్కాం లేని స్కీమే లేదు. ఈ దోపిడీకి కామ పడింది. ఫుల్ స్టాప్ పడాలి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఇండో సోల్ పేరిట మరొక కంపెనీని ఏర్పాటు చేసింది. 70 వేల కోట్ల పెట్టుబడులతో హైడ్రో పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇండోసోల్ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారన్నది ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులకి తెలియాలి. ఎన్నో వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును కేటాయిస్తే, మెగావాటుకు పాతిక వేల డబ్బులు కట్టమంటే, చెల్లించేందుకు నిరాకరించారు.
భూములు ఇతర మౌలిక వసతులు కల్పించాకే నామినల్ ఫీజును కడుతామని ఇండో సోల్ కంపెనీ తెలియజేసింది . ఆ సౌకర్యాలను కల్పించడానికి నామినల్ ఫీజు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కడప జిల్లా వాసులకే సీనియర్లను కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి పదవులు అప్పగించారు. కులము చూడం మతం చూడడం అంటూనే… తమ కులానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. టెండర్లలో పాల్గొనే వారికి కూడా చివరన రెండు అక్షరాలు ఉండాలి అధికారికంగా నిబంధనలు పెట్టలేదు కానీ రాష్ట్రంలో అదేవిధంగా అమలు జరుగుతోంది అని రఘురామకృష్ణం రాజు అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అందజేయనున్న ఐదు లక్షల ట్యాబ్ ల కొనుగోలులో 221 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. 8.7 అంగుళాల ట్యాబ్ కావాలని ప్రభుత్వం కోరింది. ఆ సైజు ట్యాబ్ లను సాంసంగ్ కంపెనీ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అమెజాన్ లో 8.7 అంగుళాల ట్యాబ్ 11200కు దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ట్యాబులను 13వేల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐదు లక్షల ట్యాబుల కొనుగోళ్లలో 221 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. నేరుగా సాంసంగ్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కొనుగోలు జరిపి ఉంటే, మరో 200 కోట్ల రూపాయలు ఆదా అయి ఉండేది. 400 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు ఏమో తెలియదు. అధికారిక లెక్కల ప్రకారం మాత్రం 221 కోట్ల రూపాయల అవినీతి జరిగింది.
స్మార్ట్ మీటర్లు, ట్యాబుల కొనుగోళ్లు ఏమిటి అర్థం కావడం లేదు. ఈ దోపిడీకి ఎప్పుడు పుల్ స్టాప్ పెడతారో చూడాలి. పిల్లలకు మీ మామయ్య ట్యాబులు ఇచ్చారని జగన్ చెప్పారు. అదే ప్రేమ చెల్లెలిపై చూపించాలి. ప్లాస్టిక్ నిషేధం అన్నారు. ప్రజల సొమ్ముతో గన్నవరం నుంచి విజయవాడ వరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు దారి పొడవునా ఏర్పాటు చేయడం అవసరమా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు..
జీసస్ ప్రజల కోసం రక్తం చిందిస్తే… జగన్ ప్రజల రక్తం తాగుతున్నాడని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. జగన్ జన్మదినోత్సవ రోజున జీసస్ మళ్లీ పుట్టాడని కీర్తించడం హాస్యాస్పదంగా ఉంది. గిన్నిస్ బుక్ తరహాలో వీరు మామ జీనియస్ బుక్ ఉందట. జగన్ జన్మ దినోత్సవం రోజు రక్తదానం చేయడానికి పది లక్షల మంది నమోదు చేసుకున్నారట. సిగ్గు లేకుండా సాక్షి దినపత్రికలో రాయించుకున్నారు. విదేశాల్లో కూడా రక్తదానం చేశారని చెప్పడం సిగ్గుచేటు. రక్తదానం చేసేవారు ఎవరూ లేరు. రక్తదానం చేయడానికి వాలంటీర్లు పారిపోయారు. 12000 మంది రక్తదానం చేస్తే మహా గొప్ప. తన జన్మదినోత్సవం నా డు జగన్, ఆయన తల్లి, చెల్లి, భార్య, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలు ఎందుకు రక్తదానం చేయలేదని ప్రశ్నించారు.
జగన్ అవినీతిపై డిఎల్ ఆవేదన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ సహచరుడు, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడిన వీడియోను రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. ల్యాండ్, శ్యాండ్ , మైను, వైనులలో జరుగుతున్న అవినీతిపై డి ఎల్ నిర్వేదంగా మాట్లాడారని రఘురామా అన్నారు . అధికారంలో రాకముందు తాను అవినీతి చేయనని చెప్పి మోసం చేశారని బాధపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారన్నారు.
ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పేరును ప్రస్తావించనప్పటికీ, కొందరు అప్పుచేసి పప్పుకూడు అనే తరహాలో వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో అమలు జరిగిన సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి జాతీయ దినపత్రికలలో ప్రచారం ఎందుకని ప్రశ్నించారు.. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంలో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతోందన్నారు. అయినా ఆరోగ్యశ్రీ పథకం ప్రచారంలో తండ్రి కొడుకుల ఫోటోలను ముద్రించుకోవడం పట్ల తాను పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అభ్యంతరాన్ని తెలియజేశానని చెప్పారు.
రానున్న రోజులలో ఆరోగ్య శ్రీ తో పాటు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి ప్రచారం కల్పించే విధంగా ఫోటోలు ముద్రించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఆయనకు ప్రత్యేకంగా ఫోటోలు ముద్రించి ప్రచారం చేసుకోవలసిన అవసరం లేదన్నారు.