పక్షులు ఎగిరేప్పుడు V ఆకారంలో ఎగరడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉండొచ్చు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. మొదటిది, V ఆకారంలో ప్రయాణించడం వల్ల వెనుక ఉన్న పక్షులకు ముందు ఉన్న పక్షులు అడ్డంగా ఉండవు. వెళ్ళే మార్గాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడగలవు.
ఇక రెండవది, పక్షి రెక్కలు ఆడించినపుడు గాలిని కిందకు తోస్తుంది, రెక్కల కింద ఉన్న గాలి కిందకు వెళుతూ, రెక్కల పక్కకు ఉన్న గాలి పైకి వస్తూ ఒక సుడిగుండం లాంటి ప్రవాహాన్ని సృష్టిస్తుంది. దీనిని updraft అంటారు. ఈ updraft వల్ల పక్షి ఎగరగలుగుతుంది. ఇలా పుట్టిన వాయుగుండం మొదటి పక్షి రెక్కలకు చివరలో ఉంటుంది. ముందు వెళ్తున్న పక్షి సృష్టించిన ఈ updraft లో ప్రయాణించడం వల్ల గాలి నిరోధకత తగ్గి వెనుక ఉన్న పక్షి ఎక్కువగా శ్రమ పడకుండానే, తక్కువ శక్తిని ఖర్చు చేసి ఎగరగలుగుతుంది.
ముందు వెళ్తున్న పక్షి స్థానాన్ని కొంత దూరం ప్రయాణించిన తర్వాత మరొక పక్షి తీసుకుని మొదటిపక్షి ని వెనక్కు పంపుతుంది. ఈ విధంగా అన్ని పక్షులు వీలైనంత తక్కువ శ్రమతో ఎక్కువ దూరాన్ని ప్రయాణించగలుగుతాయి. అయితే, ఎక్కడ ఎగిరితే ఈ updraft ఉపయోగపడుతుందని పక్షులు ఎలా తెలుసుకుంటాయి అనే విషయంపై శాస్త్రవేత్తల దగ్గర ఇంకా సరైన వివరణ లేదు.
-షేక్ వలి