Suryaa.co.in

Telangana

ఈ సన్నాసి సీఎం ఏం చేస్తున్నాడు?

– పైన జుమ్లా పీఎం ఉంటే ఇక్కడేమో హౌలా సీఎం
– స్కూళ్లలో చాక్ పీస్ లకు కూడా పైసలు లేవు
– మూసీలో పారబోసేందుకు లక్షా 50 వేల కోట్లు ఉన్నాయంట
– బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ఏం రోగం?
25 సార్లు ఢిల్లీకి పోయి రూ. 25 పైసలు తేలేదు
– చిట్టి నాయుడు పాలనలో బాధ పడని వాళ్లు లేరు
– ఊళ్లలో రైతులు పొట్టు పొట్టు తిడుతున్నారు
– కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణను తీసుకపోయి ఆంద్రాలో కలపాలి
– తెలంగాణకు అతి ప్రమాదకరమైన పార్టీ బీజేపీ
– తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ ప్రతినిధుల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో మహా ఉద్ధండ పిండాలతో కొట్లాడినం.చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అంతటి ఉద్ధండుల ముందు ఈ చిట్టి నాయుడు ఎంత? ఈ చిట్టి నాయుడిని తిట్టాలన్న, ఏదైనా చెప్పాలన్న మనసు రావటం లేదు. ఎందుకంటే ఆయనకు ఏమీ తెల్వదు. ఏమీ తెల్వదన్న విషయం కూడా ఆయనకు తెల్వదు.

మొన్న వికారాబాద్ వెళ్లి హైదరాబాద్ చుట్టు మూడు దిక్కులు సముద్రం ఉందంటాడు. ఆగస్టు 15 రోజు స్పీచ్ లో భాక్రానంగల్ తెలంగాణలో ఉందంటాడు. రాసిచ్చినది కూడా చూసుకోకుండా చదువుతాడు. విప్రో సీఈఓ సత్య నాదెళ్ల అంటాడు. అలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన ఖర్మ.

గుంపు మేస్త్రీ అంటే ఇళ్లు కట్టేటోళ్లు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇళ్లను కూలగొట్టేటోడు. పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి లా మారింది. రేవంత్ రెడ్డి బాధపెట్టినా సరే, ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావాలని 95 శాతం కొలువులు మన బిడ్డలకే దక్కేట్టు పోరాటం చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది కేసీఆర్ . జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కళాశాల, గురుకులాలు. ఇవన్నీ మనం సాధించిన విజయాలు.

తెలంగాణ మీద ప్రేమ ఉన్న కేసీఆర్ కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి. తెలంగాణకు ఓ పెట్టుబడి, ఓ అవార్డు వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషపడే వాళ్లం. శ్రీకాంత్ చారి, యాదిరెడ్డి, ఇషాంత్ రెడ్డి లాంటి వందల మంది విద్యార్థుల త్యాగాలతో పునీతమైన నేల తెలంగాణ. నీళ్లు, నియామాకాలు, నిధులు అనే నినాదాన్ని ప్రామాణికంగా పనిచేశాం.

నీళ్ల రంగంలో సంపూర్ణ విజయం సాధించాం. కాళేశ్వరం పూర్తి చేశాం. పాలమూరు-రంగారెడ్డి పనులు 90 శాతం పూర్తి చేశాం. నల్గొండలో ఫ్లోరోసిస్ ను పూర్తిగా తుడిచి వేసిన ఘనత కేసీఆర్ది. తలసరి ఆదాయంలో రాష్ట్రం ఏర్పడే నాటికి మనది 14 వ స్థానం. కేసీఆర్ దిగిపోయేనాటికి నంబర్ వన్ గా నిలిచి కాలర్ ఎగరవేసుకొని పరిస్థితి వచ్చింది.

నీళ్లు, రైతుబంధు సహా భూముల విలువ పెంచి…కేసీఆర్ రైతుల్లో ధీమా నింపారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలకు కష్టం వచ్చిన సరే ప్రజలు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ఆశ ఆడ బిడ్డలు వచ్చి కేసీఆర్ మేము అడగకుండానే 9, 900 ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మాకు 18 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబితే మోసం పోయామని చెబుతున్నారు.

చిట్టినాయుడిని కదిలించాలంటే మీరు వేలాది గా తరలి రావాల్సిన అవసరముందని వారికి చెప్పాను. గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ చేయాలని అశోక్ నగర్ లో పోరాటం చేసిన విద్యార్థులు తెలంగాణ భవన్ కు వచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను అవమానించేలా రిజర్వేషన్లలో మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో విద్యార్థులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలతో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రద్దయ్యే పరిస్థితి ఉంది. అశోక్ నగర్ కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ అక్కడ పోలీసులను పెట్టటంతో విద్యార్థులే తెలంగాణ భవన్ కు వచ్చారు. ప్రజలకు కష్టమొస్తే గాంధీ భవన్, బీజేపీ ఆఫీస్ కు కాదు…తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు.

ప్రజల గూడు కూలగొడుతుంటే కేసీఆర్ కు చెప్పుకుంటే సమస్య తీరుతదని ప్రజలు భావిస్తున్నారు. నేను బయలుదేరే ముందు ఇంటి వద్దకు ఆటో యూనియన్ వాళ్లు కూడా వచ్చి వాళ్ల ధర్నాకు రావాలని కోరారు. చిట్టి నాయుడు పాలనలో బాధ పడని వాళ్లు లేరు. ఊళ్లలో రైతులు పొట్టు పొట్టు తిడుతున్నారు.

తులం బంగారం, బతుకమ్మ చీరలు ఏదీ దిక్కులేని పరిస్థితి తెచ్చారన్నారని మండిపడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆడ బిడ్డలను ఇంటి ఆడపడుచును చూసుకున్నట్టు చూసుకున్నాడని గుర్తు చేసుకున్నారు. టెన్త్ పాసైతే చాలు పది వేలు, ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పాసైతే 25 వేలు, పీజీ పాసైతే లక్షా, పీహెచ్ డీ చేస్తే లక్షా అన్నాడు. ఎవరికైనా వచ్చాయా? ఈ విషయాలను మనం ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి.

కేసీఆర్ పదేళ్లలో 60 డిగ్రీ కాలేజ్ లు ఏర్పాటు చేశారు. ఇంటర్ రెసిడెన్షియల్ కాలేజ్ లు 146 ఉంటే 592 చేశారు. గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లను 294 నుంచి 1022 కు పెంచారు. మెడికల్ కాలేజ్ లు 5 ఉంటే 33 చేశారు. నర్సింగ్ కాలేజ్ లను కూడా 33 చేశారు. మెడికల్ సీట్లు 800 ల నుంచి 3,581 కు తీసుకొచ్చారు.

సిద్దిపేటలో ఒకటే ఇంట్లో నాలుగు మెడిసిన్ సీట్లు వచ్చాయంటే చాలా సంతోషం అనిపించింది. రాష్ట్రంలో వైట్ కోట్ విప్లవం తెచ్చాం. ధాన్యం ఉత్పత్తి లో నంబర్ వన్ అయ్యాం. అది కేసీఆర్ ఘనత. ఈ సన్నాసి సీఎం ఏం చేస్తున్నాడు? స్కూళ్లలో చాక్ పీస్ లకు కూడా పైసలు లేవు. కానీ మూసీలో పారబోసేందుకు లక్షా 50 వేల కోట్లు ఉన్నాయంట. గురుకులాల అద్దె కట్టేందుకు డబ్బులు లేవు. బడా పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్లు దోచిపెడుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ఏం రోగం ఈ ముఖ్యమంత్రికి?

25 సార్లు ఢిల్లీకి పోయి రూ. 25 పైసలు తేలేదు. తన సీటు కాపాడుకునేందుకు హైకమాండ్ కు కప్పం, ఢిల్లీ కి మూటలు సర్దేందుకే ముఖ్యమంత్రికి సమయం సరిపోతోంది. గురుకులాల్లో పాములు కుట్టి విద్యార్థులు చనిపోవటం చాలా దారుణం. కేసీఆర్ సమయంలో గురుకులాల విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే…చిట్టి నాయుడు మాత్రం గురుకులాలను పాతాళంలోకి తీసుకెళ్తున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణను తీసుకపోయి ఆంద్రాలో కలపాలి. తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేస్తామంటే ఏ మూర్ఖులకు ఏం చెప్పాలె. తులం బంగారం ఏమైందంటూ ప్రశ్నిస్తే జగిత్యాలలో కేసు పెట్టారు. ప్రశ్నించకపోతే తెలంగాణ మూగబోతుంది. కాంగ్రెస్ వాడు ఏం చేసిన బీజేపీ వాళ్లు మాట్లాడటం లేదు.

పైన జుమ్లా పీఎం ఉంటే ఇక్కడేమో హౌలా సీఎం ఉన్నాడు. ఈ సీఎం కు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆగమాగం జగన్నాథం అన్నట్లు ఉన్నాడు. మేము గెలుస్తమని మేమే అనుకోకుండా అడ్డగోలు హామీలిచ్చామని ఓ కాంగ్రెస్ మంత్రి నాతోనే అన్నాడు. మీరే 15 మంది మార్చుకుంటే గెలుస్తుండే అన్నాడు. కానీ నా పేరు చెప్పవద్దంటూ అన్నీ చెప్పేసిండు. కాంగ్రెస్ మళ్లీ గెలిచేది లేదని నడిచినన్నీ రోజులు నడుస్తుదని ఎవ్వరి దుకాణం వాళ్ల తెరుచుకుంటున్నారు.

మేము ఉన్నప్పుడు పెద్ద బిల్డింగ్ ల పర్మిషన్లకు కూడా మంత్రిని కలవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు కరెంట్ కనెక్షన్ కోసం కూడా రూ. 25 లక్షలు తీసుకున్నారని ఓ బిల్డర్ చెప్పాడు. అందినకాడికి దోచుకో. అవన్నీ దాచుకో అని కాంగ్రెస్ వాళ్ల యవ్వారం ఉంది.

గత పదినెలల్లో మన పార్టీ అన్ని కష్టకాలాలను అధిగమించింది. కొన్ని పొరపాట్లు, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన అడ్డగోలు హామీలతో మనం ఓడిపోయాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఊహించని విధంగా ఓడిపోయాం. ఆ తర్వాత కేసీఆర్ కి గాయం. కొంతమంది పార్టీ మారటం, మన పార్టీ నాయకురాలు కవితను జైలుకు పంపించటం చేశారు. అయినా సరే పోరాటం చేశాం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనకు ఎదురుదెబ్బ తగిలింది. పది నెలల్లో అన్ని కష్టాలను అధిగమించాం.

ఇప్పుడు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మనల్నే తలచుకుంటున్నారు. దసరా రోజు ప్రతి ఇంట్లో ప్రజలు కేసీఆర్ ని తలుచుకున్నారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు. తెలంగాణకు అతి ప్రమాదకరమైన పార్టీ బీజేపీ. మతాన్ని అడ్డంపెట్టుకొని రెచ్చగొట్టే పార్టీ బీజేపీ. మనకు ఒక్క మెడికల్, నర్సింగ్, నవోదయ పాఠశాల ఇవ్వలేదు. తెలంగాణ విద్యార్థులకు ఏం చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు.

ప్రతి జిల్లాల్లో బీఆర్ఎస్వీ సమావేశాలు జరగాలి. ఎక్కడికక్కడ మీటింగ్ లు పెట్టుకుందాం. మన పార్టీలో ఎంతో మంది యువ నాయకులు ఉన్నారు. వాళ్లను ప్రోత్సహించుకుందాం. మనకు చాకుల్లాంటి యువ నాయకత్వం ఉంది. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నప్పటికీ ఆ పోరాటాన్ని చూపించే ధైర్యం ప్రధాన మీడియా చేయటం లేదు. సోషల్ మీడియాలో మనమే పోరాటం చేయాలే. కేసులు పెట్టినా సరే భయపడవద్దు. మన లీగల్ సెల్ ను మరింత బలోపేతం చేసుకుందాం.

పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా మారిపోయారు. మనం సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికీ పంపించాలి.బీఆర్ఎస్వీ జెండా లేని కాలేజ్ మనకు కనిపించవద్దు. డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్లు రాబోతున్నాయి. చాలా మందికి అవకాశాలు వస్తాయి. కొత్త నాయకత్వాన్ని మనం తయారు చేసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గొంతుక.

పేద ప్రజల ఇళ్లు కూలగొడుతుంటే, కేసులు పెడుతుంటే బీజేపోళ్లు మాట్లాడుతున్నారా? పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్ జరిగితే మాట్లాడుతున్నారా? పైన ఆడే నాటకం ఒకటి. లోపల మాత్రం వాళ్లు రెండు ఒక్కటే. తోడు దొంగలు.తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. సోషల్ మీడియా లో బూతులు తిట్టవద్దు. అది మన తెలంగాణ సంస్కృతి కాదు. మనం సబ్జెక్ట్ ను మాత్రమే చర్చకు పెడదాం.

చిట్టి నాయుడు 60 వేల ఉద్యోగాలు ఇచ్చినా అని అంటుంటే మాత్రం చిత్రంగా అనిపిస్తోంది. ఉద్యోగం ఇవ్వాలంటే నోటిఫికేషన్, పరీక్షలు పెట్టాలె. మరి చిట్టి నాయుడు వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు మాత్రం 2 ఉద్యోగాలు వచ్చాయి. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోవటం లేదు.

ప్రజలు మనకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. వాళ్లను అనటానికి ఏమీ లేదు. మనమే పొరపాట్లు చేశాం. మళ్లీ ప్రజలు మెచ్చే విధంగా వాళ్లకు దగ్గరవుదాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజలది. డీఎంకే మాదిరిగా మరో 70 ఏళ్ల పాటు బలంగా ఉండేలా తీర్చిదిద్దుకుందాం. విద్యార్థి నాయకులంతా కూడా ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, నాయకులు కావాలి.

LEAVE A RESPONSE