– ప్రభుత్వ తీరుపై అంబటి రాంబాబు ధ్వజం
తాడేపల్లి: జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తామంటే ప్రభుత్వం, కూటమి పార్టీలు డిక్లరేషన్ పేరుతో నానా రాద్దాంతం చేస్తున్నారని, ఆయన పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
మరోవైపు తమ పార్టీ రాయలసీమ నాయకులెవ్వరూ తిరుపతి వైపు రావద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తూ, వారిని హౌజ్ అరెస్టు చేస్తున్నారన్న మాజీ మంత్రి.. పోలీసులు ఆ నోటీసులో ఏం ప్రస్తావించారన్నది చదివి వినిపించారు.
ఇదెక్కడి విడ్డూరమన్న ఆయన, మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్ళడానికి పోలీసుల అనుమతి కావాలా? అని నిలదీశారు. చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అని ప్రస్తావించారు.
జగన్ తిరుపతి వెళ్లడం ఇది తొలిసారి కాదని, గతంలో ఆయన చాలాసార్లు స్వామివారిని దర్శించుకున్నారని, సీఎం హోదాలో వరసగా 5 ఏళ్లు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు.
రాజకీయాలు చేయాలనుకుంటే అనేక విషయాలు వేరే ఉన్నాయని, వాటిపై ఆలోచన చేయాలని సూచించారు. ప్రభుత్వ తీరు, కూటమి పార్టీల వైఖరిపై ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, హిందూత్వవాదులు ఖండించాలని అంబటి రాంబాబు కోరారు.