Suryaa.co.in

Andhra Pradesh

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ప్రాజెక్టులు చేపట్టారు?

-రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కటైనా మొదలుపెట్టారా?
-పనులు పూర్తి చేసి ప్రారంభించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా?
-కానీ ఏం పూర్తి చేశాడో ఆ మీడియా చెప్పలేకపోతున్నది
-ప్రశ్నించిన జలవనరుల మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:
బురద చల్లడమే వారి పని:
ఈనాడు పత్రిక కొన్ని కధనాలు ప్రచురించే కార్యక్రమం చేపట్టింది. మొన్న కూడా పోలవరం పునరావాసం రెండు ముక్కలు అని కధనం రాశారు. ఇది కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది అని రాశారు. నేను దానికి సమాధానం చెప్పి, కొన్ని ప్రశ్నలు అడిగాను. అయితే వాటికి సమాధానం చెప్పకుండా, ఇంకొన్ని కధనాలు వండి వార్చి, సీఎం వైయస్‌ జగన్‌పైనా, ఈ ప్రభుత్వంపైనా బురద చల్లుతున్నారు. అలా మళ్లీ చంద్రబాబును లేపే కార్యక్రమం చేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రాజెక్టులపై రూ.55 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం మూడేళ్లలో రూ.15 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని రాశారు. ఆ విధంగా ఆనాడు చంద్రబాబు ఏటా సగటున రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే, సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే, చాలా తక్కువ ఖర్చు చేశారని, నీటి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదని రాశారు.

వాళ్లు ఇలా అవాస్తవాలు పదే పదే చెబుతున్నారు. అందుకే మేము మాట్లాడాల్సి వస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ ప్రాధాన్యత కలిగిన కీలక పనులేవీ చేయలేదు. వారి పనులన్నీ అప్రధాన్యమైనవి. కాంట్రాక్టర్లకు చాలా మిగిలే పనులు. చాలా సులువుగా చేసే పనులు మాత్రమే చేశారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక, అన్నీ సమీక్షించి, ఏ పనులు చేస్తే ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తవుతాయో అవే చేస్తున్నాం. వాటి మీదే ఖర్చు చేస్తున్నాం.
రెండుసార్లు కోవిడ్‌ వచ్చింది. మూడు వేవ్‌లు వచ్చాయి. అయినా ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయడం కోసం పని చేస్తున్నాం. అయినా బురద చల్లుతున్నారు.

మా నాయకుడు ఆనాడే చెప్పారు:
ఇటీవల మా పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఆ సందర్భంగా సీఎం ఒక మాట చెప్పారు. మనం కేవలం చంద్రబాబుమీద మాత్రమే కాకుండా ఎల్లో మీడియా మీద.. రామోజీరావు మీద, రాధాకృష్ణ మీద, టీవీ5 మీద అని చెప్పారు. ఈ రెండేళ్లు వారు కలిసికట్టుగా విష ప్రచారం చేస్తారని అన్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. రామోజీరావు ఆ పని మొదలు పెట్టారు.

చంద్రబాబు ఒక్క ఎకరాకైనా నీరిచ్చారా?:
నాడు నదీ జలాలన్నీ సద్వినియోగం కావాలని, భూములు సాగు కావాలని, రైతులు బాగు పడాలని మహానేత వైయస్సార్‌ జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు చేపట్టారు. ఆ తర్వాత మనందరి ప్రభుత్వం వచ్చాక 6 ప్రాధాన్యత ప్రాజెక్టులు చేపట్టి, ఆ పనులు చేస్తున్నాం. అయితే కోవిడ్‌ వల్ల పనుల్లో కాస్త ఆలస్యం అవుతోంది.

చంద్రబాబు ప్రాజెక్టులపై బాగా ఖర్చు చేశారని రామోజీరావు రాశారు. మరి ఒక్క ఎకరానికి అయినా ఆయన నీళ్లిచ్చారా? 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు, తన హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసి, రైతులకు నీళ్లిచ్చారా? ఎంతసేపూ సులభంగా అయ్యే పనులు, కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు చేసి కమిషన్లు పొందాడు తప్ప, ఒక్క రైతుకు కూడా మేలు చేయలేదు.
అందుకే స్వయంగా మోదీ అన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను ఏటీఎంగా వాడుకుంటున్నారని.
అందుకే రామోజీరావుకు, రాధాకృష్ణకు, టీవీ5ని ఒక్కటే కోరుతున్నా. ఇకనైనా వాస్తవాలు రాయండి. మీరు ఎంత లేపినా చంద్రబాబు తిరిగి సీఎం కాలేరు.

అది చంద్రబాబు పాపమే:
చంద్రబాబు చేసిన పాపం వల్లనే ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు కుంటు పడ్డాయి. ఇవాళ ఈనాడులో కధ రాశారు. పోలవరం సవాళ్లపై ఈనెల 22న మేధోమధనం. కేంద్ర మంత్రి సలహాదారు వెదిరే శ్రీరాం నేతృత్వంలో ఒక కమిటీ ఇక్కడకు వస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ఆగిపోయిన, కుంటుపడిన పనులు సమీక్షించి, రీడిజైన్‌ చేయడం కోసం వస్తున్నారు. ఎందుకంటే ఆ పని చేయకపోతే ప్రాజెక్టు ముందుకు జరగదు.

మీకు తెలుసు. వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది. అలా ఎందుకు జరిగింది? మీరు స్పిల్‌వే పూర్తి చేయకుండా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు మధ్యలో గ్యాప్‌ పెట్టి కట్టారు. దీంతో గోదావరికి వరదలు రావడంతో డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది.

ఎక్కడైనా సరే స్పిల్‌వే పూరై్తన తర్వాతే కాఫర్‌ డ్యామ్‌లు కట్టాలి. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. దీంతో రూ.400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్లీ అది కట్టాలంటే ఎంత ఖర్చవుతుందో తెలియదు. పైగా అది కట్టాలంటే, మొత్తం నీటిని తోడాలి. అందుకోసం రూ.2 వేల కోట్లు ఖర్చవుతాయి. మరి ఈ పాపం చంద్రబాబుది, అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుది కాదా?

ఈ రెండేళ్లలో అన్ని ఎకరాలకు:
గత రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రైతులకు సాగు నీరందించాం. ఖరీఫ్‌లో 14 లక్షలకు పైగా ఎకరాలకు, రబీలో 31 లక్షల ఎకరాలకు సాగు నీరందించాం. ఇదీ మా చిత్తశుద్ధి.
కానీ గత ప్రభుత్వం నీరు–చెట్టు పేరుతో విచ్చలవిడిగా దోచుకున్నారు. ఎస్సీలు పొరంబోకు భూముల్లో సాగు చేస్తుంటే, వారిని తరిమేసి ఆ భూముల్లో మట్టి తవ్వి అమ్ముకున్నారు. అయితే అది గొప్ప పని అని ఈనాడు రాసింది.

దుర్మార్గపు రాతలు:
మేము 6 ప్రాధాన్య ప్రాజెక్టులు పెట్టుకున్నాం. అందులో భాగంగా నెల్లూరు సంగం బ్యారేజీని జూలైలో ప్రారంభించే లక్ష్యంతో పని చేస్తున్నాం. అయినా దుర్మార్గంగా రాస్తున్నారు. అలాగే అవుకు కుడి సొరంగంలో 160 మీటర్ల మేర ఫాల్ట్‌ జోన్‌ ఉంది. దాన్ని వదిలేసిన చంద్రబాబు మిగిలిన పనులు చేశాడు. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఆ పని చేయరు. తమకు కమిషన్‌ రాదు కాబట్టి. కానీ మేము అధికారంలోకి వచ్చాక, ఆ పనులపై దృష్టి పెట్టాం. వేగంగా పనులు పూర్తి చేసి, నీరివ్వాలని పని చేస్తున్నాం.

కోవిడ్‌ కష్టకాలంలోనూ..:
అలాగే కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయింది. అయినా ఈ మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు ఇచ్చాం. అంటే ఏటా రూ.50 వేల కోట్ల చొప్పున పథకాల్లో ఇచ్చాం.

ప్రాధాన్యతా ప్రాజెక్టులు:
కోవిడ్‌ తగ్గడంతో గత మూడు నెలలుగా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకున్నాయి. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం, వెలిగొండ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార రెండో దశ, పోలవరం పెండింగ్‌ పనులు ప్రాధాన్య ప్రాజెక్టులుగా చేపట్టాం.

రెండు దశల్లో పోలవరం నీళ్లు:
పోలవరం ప్రాజెక్టు కింద రెండు దశల్లో నీరివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది శాస్త్రీయమైంది. ముందు ప్రాజెక్టును పాక్షికంగా వినియోగించుకోవాలి. అది 41.15 మీటర్ల ఎత్తులో ఎండీడీఎల్‌ (మినిమమ్‌ డ్రా డౌన్‌ లెవెల్‌) నుంచి రెండు కాల్వల ద్వారా నీరిచ్చి పాక్షికంగా వినియోగిస్తూ, తర్వాత ఫుల్‌ రిజర్వాయర్‌ లెవెల్‌ వరకు తీసుకురావడం జరుగుతుంది. దాన్ని కూడా వ్యంగ్యంగా ఈనాడు రెండు ముక్కలు అని రాసింది.

చంద్రబాబు ఏం చేశారు?:
చంద్రబాబు తన హయాంలో చేశానంటూ.. పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులను ప్రస్తావిస్తారు. నిజానికి పట్టిసీమ పనుల్లో చాలా వరకు వైయస్సార్‌ హయాంలోనే పూర్తయ్యాయి. చంద్రబాబు చేసింది చాలా తక్కువ. ఇక పురుషోత్తమపట్నం పనులేవీ జరగడం లేదు. అయినా అప్పుడు ఆ రెండింటిపై చంద్రబాబు చేసిన వ్యయం ఏకంగా రూ.3580 కోట్లు. ఆ ఖర్చంతా పోలవరం మీద చేసి ఉంటే, ఫలితాలు మరో విధంగా ఉండేవి. రైతులకు నీళ్లూ అందేవి.
చంద్రబాబు పరిపాలనలో ప్రాజెక్టుల్లో చేసిన వ్యయంలో సగం నొక్కేశారు. అంతేతప్ప, రైతులకు మేలు చేయాలని ఆయన ఎక్కడా పని చేయలేదు. అయినా చంద్రబాబును లేపి మళ్లీ సీఎం చేయాలని ఈనాడు రామోజీరావు, ఏబీఎస్‌ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు కలిసికట్టుగా పని చేస్తున్నారు. అయితే వారు ఏ ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మబోరు.

దమ్ముంటే చర్చకు రండి:
చంద్రబాబు నిర్ణయాలే ఇవాళ పోలవరం పనులకు శాపంలా మారాయి. దమ్ముంటే రండి చర్చిద్దాం. స్పిల్‌వే పూర్తి కాకుండా కాఫర్‌ డ్యామ్‌లు మధ్యలో గ్యాప్‌లతో కట్టారు. దాని వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది. దాన్ని మళ్లీ కట్టాలంటే నీళ్లు ఖాళీ చేయాలంటే రూ.2 వేల కోట్లు కావాలి.
ఆయన చేసిన నిర్వాకం వల్లనే ఇవాళ మేధ్మో«మధనం జరుగుతోంది. ప్రాజెక్టు రీడిజైన్‌ చేయాల్సి వస్తోంది. ఇంకా ప్రాజెక్టుల్లో జాప్యం. తద్వారా నిర్మాణ వ్యయం పెంపు. రైతులకు నష్టం కలుగుతోంది.

మీడియా ప్రశ్నలకు బదులుగా..
చంద్రబాబు ఎంత బలహీనుడో, లోకేష్‌ ఎంత బలహీనుడో నేను ప్రత్యేకంగా చెప్పాలా. చంద్రబాబు కుప్పంలో మున్సిపాలిటీలు కూడా గెలవలేకపోయాడు. లోకేష్‌ మంగళగిరిలో కూడా ఓడిపోయాడు. ఎన్టీ రామారావు దేవుడు. చంద్రబాబు రాముడు. నేను మూర్ఖుడిని అని లోకేష్‌ అంటున్నాడు.
అసలు ఎవరు బలహీనుడు. ఎవరు బలవంతుడు చెప్పండి.
మళ్లీ అధికారంలోకి రామని తెలిసి, బాబు కొడుకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE