Suryaa.co.in

Andhra Pradesh

క్యాసినోలు,క్యాబరేలతో రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?

-సంస్కృతి, సాంప్రదాయాల నిలయమైన ఆంధ్రప్రదేశ్ లో విషబీజాలు నాటుతారా?
-తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆగ్రహం

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగువాడి ఖ్యాతి, కీర్తి , తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు దశ, దిశలా కొనియాడబడేలా చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా జరుపుకుంటుంటే దురదృష్ట వశాత్తు మన రాష్త్రంలో అధికార పార్టీ పెద్దలు క్యాసినో, క్యాబరేలు నిర్వహిస్తూ రాష్ట్రం పరువు తీస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో మంత్రులే విదేశీ విష సంస్కృతిని ప్రోత్సహిస్తూ క్యాసినో, జూదo, మహిళల అర్ధనగ్న నృత్యాలను విచ్చలవిడిగా నిర్వహిస్తూ మన సంస్కృతి, సాంప్రదాయం మీద దాడులు చేస్తున్నారు. తెలుగు సంస్కృతిపై జరుగుతున్న ఈ దాడిని తెలుగు ప్రజలందరూ సమిష్టిగా ఎదుర్కోవాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నాను. తెలుగు సంస్కృతిపై దాడులను ప్రోత్సహించడo ముఖ్యమంత్రి ప్రోత్సహించడం మంచిది కాదు.

గుడివాడలో సంక్రాంతి పేరుతో సాక్షాత్తు రాష్ట్రమంత్రికి చెందిన కె. కన్వెన్షన్ లో క్యాసినో, అసభ్య నృత్యాలను నిర్వహించడం ద్వారా సుమారు 250 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పత్రికలు కోడై కూస్తుంటే ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం గుడ్లప్పగించి చూడటం దారుణం. ఇన్ని సాక్ష్యాలున్నా బాధ్యులపై చర్యలు తీసుకోలేని మీ దుస్థితి చూసి జాలేస్తోంది. పోలీసు వ్యవస్థను ఇంతటి అదఃపాతాళానికి దిగజార్చిన ఘనకీర్తి డీజిపి గౌతమ్ సవాంగ్ కే దక్కుతుంది. ఇదంతా చూస్తే రాష్ట్రంలో పరిస్థితి కంచే చేనుమేసిన చందంగా తయారైంది. ముఖ్యమంత్రి, డీజిపి ఈ సంఘటనలపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే వారి అండతో ఈ సాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు భావించాల్సి వస్తుంది.

LEAVE A RESPONSE