– ఆం.ప్ర. పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్
– ఆం.ప్ర.సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు
వార్డు, గ్రామ సచివాలయాలపై కాగ్ చెప్పింది వాస్తవాలే. ఇదే విషయాన్ని గత మూడు సంవత్సరాలుగా మా A.P పంచాయతీరాజ్ ఛాంబర్, A.P సర్పంచుల సంఘాలు మొత్తుకుంటూ, ఆందోళనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలలోని ఆర్టికల్ 243G, 11 మరియు 12 వ షెడ్యూల్స్ కు పూర్తి వ్యతిరేకంగా ఈ వార్డు, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం.
స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, వార్డు కమిటీలు, గ్రామ సభలతో సంబంధం లేకుండా సర్వ స్వతంత్ర వ్యవస్థలుగా / సంస్థలుగా, వార్డు/ గ్రామ సచివాలయాల వ్యవస్థలను ఏర్పాటు చేయడం అప్రజా స్వామి కం. వీటివలన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నిర్వీర్యమైపోయి – సర్పంచ్ లు, ఎంపీటీసీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు ఉత్సవ విగ్రహాలు లాగా మారిపోయారు.
సర్పంచ్, కౌన్సిలర్, ఎంపీటీసీల కన్నా వాలంటీర్స్ శక్తివంతులయ్యారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు డమ్మీలైపోయారు. ఇవి స్థానిక స్వపరిపాలనకు, అధికార వికేంద్రీకరణకు, స్థానిక ప్రభుత్వాల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. కనుక ఇప్పటికైనా వార్డు/ గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను మా గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
అవసరమైతే మేం ఉద్యమం చేయడమే కాక సచివాలయాలు, వాలంటీర్ల ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘనల పైన, వాటిని మా స్థానిక ప్రభుత్వాల్లో విలీనం చేయాలని కోరుతూ మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు హైకోర్టులో కూడా కేసులు వేస్తాము.