టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడింది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
‘‘బయోమెట్రిక్ అమలు చేయడం వల్ల ఇబ్బందేమిటి?గతంలో అలా అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపండి. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్‌ను మీరే అమలు చేయకపోతే ఎలా? ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తగా ఉండాలి కదా? నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉంది. అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయి’’ అని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.