– జగన్ ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు మానేసి, వాస్తవాలు బయటపెట్టాలి.
– ప్రత్యేకహోదా ఎంపీల రాజీనామాలతోనే సాధ్యమన్న జగన్ రెడ్డి, ఇప్పుడు తన 28మంది ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించడంలేదు?
– ఎంపీలకు, ముఖ్యమంత్రికి తమస్వప్రయోజనాలు తప్ప రాష్ట్రప్రయోజనాలు, సమస్యలు పట్టడంలేదు.
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
కేంద్రహోంమంత్రి అధ్యక్షతన జరిగిన సదరన్ కౌన్సిల్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఏం డిమాండ్లు అమిత్ షా ముందుంచారు.. ఏఏ అంశాలు ఆయనతో చర్చించారో, ప్రత్యేకహోదా సహా, ఇతరత్రా సమస్యలపై ముఖ్యమంత్రి, సదరు సమావేశంలో ఏంచర్చించారో, కేంద్రహోం మంత్రి స్పందనేమిటో తక్షణమే ప్రజలకు చెప్పాలని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తనకు 25మంది ఎంపీలనిస్తే, కేంద్రం మెడలు వంచుతానని, ఎంపీలంతా రాజీనామాలుచేస్తే ప్రత్యేకహోదా ఎందుకురాదని జగన్మోహన్ రెడ్డి బీరాలు పలికాడు. ప్రత్యేకహోదావస్తే రాష్ట్రయువత ఉద్యోగాలు, ఉపాధికోసం ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదని ఊదరగొట్టాడు. మరిఇప్పుడు 28మందిఎంపీలను తనచేతిలో ఉంచుకున్న జగన్మోహన్ రెడ్డి, ఏరోజూ ప్రత్యేకహోదాపై మాట్లాడకుండా, అది ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానని ఎందుకు మాట్లాడటంలేదు?
ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ ప్రజలహక్కని, మన్మోహన్ సింగ్ నేత్రత్వంలోని యూపీఏప్రభుత్వం ప్రత్యేకహోదాను ఏపీకి ప్రకటించిందని, దాన్ని ఎందుకుఅమలుచేయడంలేదని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న కేంద్రపెద్దలను ఎందుకు నిలదీయడంలేదు? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికే గతంలో ప్రత్యేకహోదాను వాడుకొని, అవసరం తీరిందని ఇప్పుడు వదిలేశారా? చంద్రబాబు ప్రత్యేకహోదా తీసుకురావడంలేదని గతంలో విషప్రచారం చేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఏంసమాధానంచెబుతారు? ఆంధ్రా ప్రజలు ఎప్పుడూ ప్రత్యేకహోదాను మర్చిపోరు, వదలరు. అది రాష్ట్రప్రజలహక్కు అనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి.
ప్రత్యేకహోదాసహా రాష్ట్రప్రయోజనాలను ఈ ముఖ్యమంత్రి తనపై ఉన్న కేసులకోసం తాకట్టుపెడతారా? అలానే విభజనచట్టంలో పేర్కొన్న రైల్వేజోన్, పెట్రోకెమికల్ కారిడార్, వెనుకబడినజిల్లాలకు నిధులు, పోలవరానికి నిధులు, కడపస్టీల్ ఫ్యాక్టరీ, పోర్టుల గురించి, సదరన్ కౌన్సిల్ లో ప్రస్తావించకుండా ఏం చేయాలనుకుంటున్నారో, ముఖ్యమంత్రి విజ్ఞప్తులపై అమిత్ షా ఏంహామీఇచ్చారో ఎందుకుబయటపెట్టరు? ఈ వ్యవహారమంతా గమనిస్తుంటే, ముఖ్య మంత్రి, కేంద్రహోంమంత్రితో జరిపిన చర్చల్లోని డొల్లతనం బయటపడుతోంది. ముఖ్యమంత్రి హాజరైన సమావేశం సాధించింది ఏమీలేదు.. కేవలం ఫొటోలు, లంచ్ లు , డిన్నర్ లకే పరిమితమైందని అనుకోవాలా?
పోలవరం ప్రాజెక్ట్పనులు టీడీపీహయాంలో 72శాతంవరకు పూర్తయ్యాయి. కేంద్రప్రభుత్వం రూ.54వేల కోట్లకు ప్రాజెక్ట్ అంచనాలను టీడీపీప్రభుత్వ హయాంలోనే ఆమోదించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ అంచనాలను కేంద్రప్రభుత్వం రూ.20వేలకోట్లకు తగ్గించినా కూడా నోరు మెదపడంలేదు. షెడ్యూల్ 9, 10 లోని రూ.లక్షా97వేల280కోట్ల విలువైన ఆస్తులసాధనకోసం ముఖ్యమంత్రి ఏనాడూ ఎలాంటి ప్రయత్నంచేయలేదు. తెలంగాణలో ఉన్న రాష్ట్రఆస్తులు, భవనాలను బ్లాంక్ చెక్ రూపంలో జగన్ రెడ్డి, కేసీఆర్ కు రాసిచ్చేశాడు. జగన్ ఇచ్చిన లేఖతోనే, ఉమ్మడి ఆస్తి అయిన సచివాలయాన్ని కూలగొట్టి, కేసీఆర్ కొత్తగా సెక్రటేరియట్ నిర్మిస్తున్నాడు. ఆర్టీసీకిచెందిన ఆస్తులపంపకం, ఉద్యోగుల విభజన, రూ.6వేలకోట్ల విద్యుత్ బకాయిల గురించి సదరన్ కౌన్సిల్ సమావేశంలో జగన్ ఏమైనా మాట్లాడారా?
రెండున్నర సంవత్సరాలైన ఉభయరాష్ట్రాల మధ్య ఉన్నసమస్యలు, నీటివివాదాలు, కేంద్రంతో ఉన్న పేచీలపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు తెరిచే ధైర్యంచేయడంలేదు? ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినాకూడా ఎవరిని కలిసి ఏంమాట్లాడారో ప్రజలకు తెలియదు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఏవి అమ్మితే, ఎంత ఆదాయంవస్తుంది….తాను నిర్వహిస్తున్న వ్యాపారాలు ఎలా చక్కబెట్టుకోవాలి… ఇంకా అధికారాన్ని అడ్డంపెట్టుకొని కొత్త వ్యాపారాలు ఎలాచేయాలి… ప్రజలపై ఎంతెంత పన్నులు బాదాలనే ఆలోచనలుతప్ప ముఖ్యమంత్రికి ఏమీపట్టడంలేదు.
రేపోమాపో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం, రాష్ట్రప్రయోజనాలు ఏంసాధించిందో ప్రజలకు వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో పోలీసులు, అధికారులసాయంతో వైసీపీప్రభుత్వం రాక్షసక్రీడ ఆడుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నిలను వికృతంగా మార్చారు. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తూనే ఉన్నాం. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడా ఎన్ డీఏ ప్రభుత్వానికి సరైన మెజారిటీఉంది… ఇప్పుడు అంతకంటే ఎక్కువబలం ఉంది.
అయినాకూడా జగన్ రెడ్డి ప్రత్యేకహోదా సహా, ఇతర రాష్ట్రప్రయోజనాల కోసం తనఎంపీల సాయంతో కేంద్రంపైఎలాంటి ఒత్తిడి చేయడంలేదు. కేంద్రంలోని ఎన్ డీఏకు పూర్తి మెజారిటీలేకుండా, తనపార్టీ ఎంపీలమద్దతే అవసరమైన పక్షంలో, తనఎంపీలను ఉపయోగించి, జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేయిం చుకునేవాడు తప్ప, రాష్ట్రానికిఏమీ సాధించేవాడుకాదనేది, ఈ రెండున్నరేళ్లనుంచి ఆయన చూపుతున్న వ్యవహారశైలే తెలియచేస్తోంది. జగన్మోహన్ రెడ్డి, ఆయనపార్టీ ఎంపీలు వారివారి వ్యాపారప్రయోజనాలు, స్వప్రయోజనాల్లో మునిగితేలుతూ రాష్ట్రప్రయోజనాలను గాలి కొదిలేశారు.