Suryaa.co.in

Andhra Pradesh

మొక్కుబడి అసెంబ్లీ సమావేశాలపై టిడిటిడిఎల్పి నిరసన

– కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండ్
తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టిడిఎల్ పి) సమావేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగింది. 2021లో ఇప్పటివరకు కేవలం ఒక్కరోజు జరగ్గా, నానాటికీ శాసనసభ సమావేశాల పనిదినాలు తగ్గడం పట్ల సమావేశం నిరసన వ్యక్తం చేసింది.
మేనెల 20వతేదీన ఒక్కరోజు బడ్జెట్ సమావేశం జరగ్గా, నవంబర్ 19వతేదీతో ఆరునెలల సమయం పూర్తవుతున్న సందర్భంలో అనివార్యంగా కావడంతో ఒకరోజు సమావేశం జరపడం ప్రభుత్వ పలాయనవాదానికి అద్దంపడుతోంది. రేపు జరగబోయే సమావేశాలు కనీసం 15రోజులు జరపాలని సమావేశం డిమాండ్ చేసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చట్టసభలను ప్రభుత్వం అభాసు పాల్జేస్తోంది, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్షాన్ని చూసి భయపడుతోందని సమావేశం ధ్వజమెత్తింది.
పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్రప్రభుత్వం తగ్గించినప్పటికీ రాష్ట్రప్రభుత్వం మాత్రం తాము తగ్గించబోమని మొండిపట్టు పట్టడాన్ని సమావేశంలో దుయ్యబట్టింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు తాను అధికారంలోకి వస్తే పొరుగురాష్ట్రాల కంటే తక్కువ ధరకు పెట్రోలు, డీజిల్ అందిస్తానని మాటఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేశంలోనే అధికధరలకు విక్రయించడంపై సమావేశం ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఉద్యోగస్తులకు తాను అధికారంలోకి వస్తే వారంరోజుల్లో సిపిఎస్ రద్దుచేస్తామని నమ్మబలికి, రెండున్నర సంవత్సరాలైనా పిఆర్ సిని అమలుచేయక ఉద్యోగస్తులు తమ నిరసన గళాన్ని విన్పించగానే అవినీతి నిరోధక శాఖకు ప్రజలంతా ఫిర్యాదు చేయాలని ఉద్యోగస్తులపై ప్రజల ఉసిగొల్పడం దారుణమని సమావేశం పేర్కొంది.
ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించిన విద్యుత్ కు సంబంధించి సుమారు 9వేల కోట్లరూపాయలు ఉండగా, సబ్సిడీల నిమిత్తం ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సుమారు 16వేల కోట్లు కలిపి దాదాపు 25వేలకోట్లు బకాయిలు ఉండగా, విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టాలు వచ్చాయనే సాకుతో ట్రూ అప్ చార్జిల పేరుతో విద్యుత్ చార్జిలు పెంచి ప్రజలపై భారం వేయడాన్ని సమావేశం తీవ్రంగా నిరసించింది.
నిత్యావసరాల ధరలు, మున్సిపల్ పన్నులు, చెత్తపై పన్ను, ఆర్ధిక సంక్షోభం, సీపీఎస్ రద్దు, ఏపీపీఎస్సీ రీ నోటిఫికేషన్, డ్రగ్స్ కు అడ్డాగా ఏపీ మారడం, కేంద్ర ప్రాయోజిత పధకాలు నిధుల మళ్ళింపు, జీవో నెం. 217, మత్స్యకారుల సమస్యలు, రాష్ట్రంలో గనుల సీనరేజ్ వసూలు ప్రైవేట్ సంస్దలకు అప్పగింత, అగ్రిగోల్డ్ బాధితులు – ఆస్తులు వేలం, వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు, అమరావతి ఉద్యమం, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు పెడుతున్న వైనాలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది.
ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాలపై పోలీసులతో దాడులు చేయించడం, పోలీసుల అండతోనే దొంగఓట్లు వేయించడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాల్జేయడమేనని సమావేశం అభిప్రాయపడింది.
ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకునే కుట్రను నిరసిస్తూ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం, రైతులు తమ ఉత్పత్తులకు మద్దతు ధర కోరుతూ రోడ్లపైకి రావడంతో వారిపై పోలీసులతో పైశాచికంగా దాడులు చేయించడాన్ని సమావేశంలో తీవ్రంగా ఖండించింది.
అమరావతి రైతులు…ముఖ్యంగా మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేస్తున్న మహా పాదయాత్రను అపహాస్యం చేయడం, విచ్చిన్నం చేసేందుకు పోలీసులను ప్రయోగించడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనం. మహా పాదయాత్రకు మద్దతు ఇస్తూ దారిపొడవునా మహిళలు, రైతులు వేలాది తరలివచ్చిన వైనం ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెల్లుబికుతున్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తోందని సమావేశం అభిప్రాయపడింది. అమరావతి రైతులు చేస్తున్న న్యాయపోరాటానికి సమావేశం సంఘీభావం ప్రకటించింది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE