లేదు. తిరుమల ఆలయం ఇప్పుడు చూస్తే చాలా విశాలంగా, నాలుగు మాఢ వీధులు వంద మీటర్ల వెడల్పుతో గొల్ల మండపం నుంచి, బేది ఆంజనేయ స్వామి గుడి వరకు విశాలమైన ప్రదేశంతో ఎంతో అందంగా ఉంటుంది.
కానీ 1970లకు ముందు మాఢ వీధుల నిండా రకరకాల చిల్లర కొట్లతో, బిచ్చగాళ్లతో, పూసలు, దండలు అమ్ముకునేవాళ్ళతో, ఆలయానికి సంబంధం లేని క్షురకులతో కిక్కిరిసిపోయి ఉండేవి. వీటికి దగ్గరలోనే గుడిసెలు, మురికి వాడలు దర్శనమిచ్చేవి. ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్ మధ్యలో గుడి ఉన్నట్టుగా ఉండేది. దీంతో దొంగలు, యాత్రికులను బురిడీ కొట్టించి సొమ్ము దండుకునే దళారులు రెచ్చిపోయేవారు.

రేకుల షెడ్డు క్యూలైన్లలో జనం
ఎంతో మంది కార్యనిర్వాహణాధికారులు ఆ అక్రమంగా కట్టబడిన షాపులను, ఇళ్లను ఖాళీ చేయించాలని ప్రయత్నం చేశారు. కానీ అక్కడి స్థానికులు కోర్టులో వేసిన స్టే లతో టిటిడి న్యాయశాఖకు చెందిన లాయర్లకు బాగా పని ఉండేది తప్ప ప్రయోజనం లేదు.
అయితే 1978లో టిటిడి కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు చేసింది మాత్రం తిరుమల ఆలయ రూపురేఖల్ని మార్చేసింది. ఆయన తిరుమల మాస్టర్ ప్లాన్ అమలు చేశారు.
దీనిలో భాగంగా అక్కడ నివసించేవారి కోసం విడిగా తిరుమలలోనే ఒక టౌన్ షిప్ కట్టించి ఇచ్చి, ఇక్కడి ఇళ్లను కూల్చేశారు. అలాగే దుకాణదారులకు కూడా వేరే చోట స్థలం ఇచ్చారు. బిచ్చగాళ్లను తిరుపతి తరలించేశారు. మాఢ వీధుల్లో అంతకుముందు ఉన్న మఠాలను కొత్తగా కట్టిన మఠాల వీధికి మార్పించేశారు.
ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్న సుదర్శనం క్యూకాంప్లెక్స్, మాఢ వీధులు, యాత్రికులు అన్ని ఊరేగింపులనూ చూసేందుకు వీలుగా ఉత్తర మాఢ వీధి వైపు మెట్లు, ఉచిత భోజనశాల, కొత్త కళ్యాణ కట్ట వంటివన్నీ నిర్మించారు.
ఒకప్పుడు రేకుల షెడ్డు క్యూలైన్లలో రోజుల తరబడి ఎదురు చూసి, ఒక్క క్షణం దేవుణ్ణి చూసి, బయటకి రాగానే జనాలు, దొంగలు, దుకాణాలతో జాతరలా ఉన్న ప్రదేశాన్ని ఈదుకుని ఇవతలకి రావాలంటే ఎంత విసుగ్గా ఉండేదో, ఇప్పటి ఆలయాన్ని చూస్తున్న మన తరం వాళ్ళు ఊహించడానికి కూడా ఇష్టపడమేమో.
– మీనా యోగీశ్వర్.వై