Suryaa.co.in

Andhra Pradesh

కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు?

-రాత్రి పూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు?
-తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు
-అయ్యన్నది కబ్జా కాదు….ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా!
-నిత్యం టిడిపి నేతల హౌస్ అరెస్ట్ లు జగన్ పిరికితనాన్ని చాటుతున్నాయి
-టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిపై ప్రభుత్వ దాడికి సిఎం జగన్ సమాధానం చెప్పాల్సిందే అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్నటి కూల్చివేతలు….ప్రభుత్వ కక్ష సాధింపే అన్న తమ వాదనే నిజమని కోర్టు వ్యాఖ్యల ద్వారా తేలిందని చంద్రబాబు అన్నారు. అర్థరాత్రి కూల్చివేతల అవసరం ఏంటనే కోర్టు వ్యాఖ్యలకు సిఎం జగన్ ఏం సమాధానం చెపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. నిత్యం టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు జగన్ పిరికితనాన్ని చాటుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. గట్టిగా గళం వినిపిస్తున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు, అరెస్ట్ లు, ఇళ్ళ పై దాడుల తో జగన్ వేధించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

జగన్ కక్ష సాధింపు కోసం కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రతి అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి చిక్కుల్లో పడవద్దని అధికారులకు చంద్రబాబు సూచించారు. అయ్యన్న చేసింది కబ్జా కాదని….ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడం నిజమైన కబ్జా అని చంద్రబాబు అన్నారు. అయ్యన్న ఇంటిని కూల్చివేసేందుకు వందల మంది పోలీసులతో, ముగ్గురు ఐపిఎస్ లను, సమస్త రెవెన్యూ అధికారులను మోహరించడం పతనమైన జగన్ ప్రభుత్వ ఆలోచనలకు పరాకాష్ఠ అని చంద్రబాబు మండిపడ్డారు. టిడిపి సభలు విజయవంతం అవ్వడం, ప్రజలనుంచి కూడా తిరుగుబాటు మొదలవ్వడంతో తీవ్ర ఫ్రస్టేషన్ లో జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో నాడు సబ్బంహరి, పల్లా శ్రీనివాస్ ఇళ్లపై, ఆస్తులపై ప్రభుత్వ చర్యల ముసుగులో దాడి చేయించిన జగన్…ఇప్పుడు అయ్యన్న ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఈ దాడులు, కక్ష సాధింపు చర్యలకు టిడిపి నేతలు ఎవరూ భయపడరని చంద్రబాబు అన్నారు.

LEAVE A RESPONSE