– జగన్ ఇక మారరా?
-చికిత్స పొందుతున్న చిన్నారులతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు
– జగన్ శైలిని మరోసారి ఆడేసుకుంటున్న సోషల్‌మీడియా విప్లవకారులు
( సుబ్బు)
‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చూశారా?.. అందులో బ్రహ్మానందం, రావుగోపాలరావు అసిస్టెంట్. రావుగోపాలరావు ఏదైనా విషాద వార్త చెబితే బ్రహ్మానందం ముసిముసి నవ్వులు నవ్వుతారు. దానికి చిరాకుపడ్డ రాంగోపాలరావు ‘‘ చస్.. ఎవడ్రా వీడికి ఉద్యోగం ఇచ్చింది. వీడు టీవీలో వార్తలు చదివేవోడు. చావు వార్తను కూడా నవ్వుతూ చెప్పినందుకు ఉద్యోగం ఊడ పీకార’’ని, బ్రహ్మానందం శైలి చూసిన వారితో చెబుతారు. గత పదేళ్ల నుండి తెలుగునాట కూడా అలాంటి పొలిటికల్ కామెడీ పండుతోంది. బ్రహ్మానందం పాత్రను జగనన్న విజయవంతంగా పోషిస్తూ, బోలెడు హాస్యం పండిస్తు సోషల్‌మీడియా ఉద్యమకారులకు చేతినిండా పనికల్పిస్తున్నారు. ఆ కథేమిటో చూద్దాం రండి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇక మారరా?.. తన శైలిపై మీడియాలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా పద్ధతి మార్చుకోరా?.. అసలు ఆయనకు చెప్పేవాళ్లు ఎవరూ లేరా?.. శుభకార్యాలకు వెళ్లినప్పుడంటే ‘షిక్కటి షిరునవ్వులు షిందించ’డం సహజం. కానీ చావులు, ప్రమాదాల పరామర్శలో కూడా షిక్కటి షిరునవ్వులు షిందించడం ఏంటి సామీ? అని కొన్నేళ్ల నుంచి సోషల్‌మీడియా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నా, జగన్ సారులో మార్పు వచ్చినట్లు లేదు.
తాజాగా అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన జగనన్న.. పనిలోపనిగా విశాఖ కేజీహెచ్‌లో హెపటైటిస్ ఏ తో బాధపడుతూ, చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్ధినులను పరామర్శించారు. మంచిదే. ఒక బాధ్యత గల నాయకుడిగా బాధితులను పరామర్శించి, నేనున్నానని ధైర్యం చెప్పడం మంచి విషయమే. దాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. అన్నట్లు.. యధాప్రకారంగా జగనన్న, ఆ పిల్లలకు నయాపైసా ఆర్ధిక సాయం చేసినట్లు కనిపించలేదు.
కానీ పుట్టెడు కష్టంలో ఉండి చికిత్స పొందుతున్న ఆ బాలికల నెత్తిన.. యధావిధిగా చేతులు వేసి, ‘షిక్కటి షిరునవ్వులు షిందించి’న ఫొటోలు చూసి.. సొంత పార్టీ కార్యకర్తలే తలపట్టుకుంటున్నారు. నిజానికి అలాంటి పరామర్శలకు వెళ్లినప్పుడు ఎవరైనా గంభీరంగా ఉంటారు. అదే పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు వెళ్లితే చిరునవ్వులు చిందిస్తారు.
కానీ జగనన్న మాత్రం చావుకు-లంఖణానికీ ఒకటే మందు అన్నట్లు.. శుభకార్యాలకు వెళ్లినా, విషాద పరామర్శలకు వెళ్లినా ఒకటే టైపు. జగన్ తాజా ఆసుపత్రి పరామర్శ దృశ్యాలు చూస్తే.. ‘‘జగన్ ఇక జన్మకు మారరు. ఎక్కడ ఎలా ఉండాలో.. ఎక్కడ గంభీరంగా ఉండాలో, ఎక్కడ నవ్వుతూ ఉండాలన్నది ఆయన కు మరో వందేళ్లకూ తెలియద’’న్న కామెంట్లు సొషల్మీడియాలో తెగ వెల్లువెత్తుతున్నాయి.