“రెండు, మూడు మెతుకులను ముట్టుకుని చూస్తే సరిపోతుంది…
అన్నం ఉడికిందో లేదో తెలియటానికి”…….
అదే విధంగా….
రెండు, మూడు వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడైఉంటే చాలు…
మనఘల మనస్తత్వాలు , సదరు సమాజ స్వభావ తీరును ఇట్టే పసిగట్టేయోచ్చు ఎట్లా ఉంటాయో..!!
ఒక క్షణం తలని ఇటువైపు తిప్పండి… అవి ఏంటో చుసేద్దాం ఓ మారు….!!
వాట్సప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉండికూడ ఏ పోస్టింగ్ కు స్పందించని వారు
నాటి తరగతి గదుల్లో చివరి బెంచ్ స్టూడెంట్స్ అయి ఉంటారు…,
అదే విధంగా ఇతర గ్రూప్ ల్లోని పోస్టింగ్స్ ని ఏరికొచ్చి గ్రూపును నింపేసేవారు
నాటి తరగతి గదుల పరీక్షల్లో కాపీ రాయుళ్లు అయ్యి ఉంటారు…!!
తమ పోస్టింగ్స్ కి స్పందనలు కరువయ్యాయి అంటూ..
రుసరుల లాడుతూ గ్రూప్ నుండి జారుకునేవారు మరి కొందరు… !
విచిత్రం ఏమిటి అంటే అట్లా జారుకున్నవారు
మరొకరి పోస్టులకు స్పందించిన దాఖలాలు దాదాపు శూన్యమే…!
ఇట్లాంటి వారు ప్రయివేట్ స్కూల్సులో చదువుకున్నవారు లేదా
కార్పొరేట్ సంస్ధల్లో మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నవారై ఉంటారు…!!
..కళాతృష్టను, వివిధ అభిరుచులను కలిగిన వారందర్ని
ప్రతిఫలాపేక్షను అశించకుండా సముహంగా ఒక చోటకు చేరుస్తుంటారు కొందరు
అట్లాంటి సముహాలే నేటి వాట్సప్ గ్రూపులు, వాటిని ఏర్పరచిన వారే గ్రూప్ ఆడ్మిన్లు..!
రాజ్యాలను ఏలుతూనే కళలను ఆదరించిన రాజులై ఉంటారు గత జన్మల్లో ఈ అడ్మిన్లు..
“కళల ఆదరణకు రాజుల ఆదరణ అనివార్యం” నానుడిని వాస్తవం చేసేస్తుంటారు వీరందరు..!!
ఫ్రెంచ్.. డచ్చ్…బ్రిటీష్, ఆంగ్ల రచయితల రచనల గురించి ఊదరగొట్టేస్తుంటారు కొందరు..
సరిగ్గా నోరు కూడ తిరగని సదరు రచయితల పేర్లను చూసి నోరు వెళ్ళబెట్టెస్తుంటారు
అయా వాట్సప్ గ్రూపుల్లోని మిగిలిన సభ్యులు..!
తెలుగువారి అచార, వ్యవహారాలు సాంప్రదాయాలు.. గ్రంధాలు.. మహానీయుల
గురించి ఒక్కముక్కైన పట్టదు ఇటువంటి పోస్టింగ్సును చేసే వారికి…!
తమకున్న పరబాష పాండిత్యం గురించి డప్పులు కొడుతూ డాబుసరిగా కనపడ్డమే
ఈ తరహా పోస్టింగ్సుకు పాల్పడేవారి ప్రధాన లక్షణాలై ఉంటాయి…!!
గ్రూప్ లోని తోటి సభ్యుల పోస్టింగ్ లపై స్పందనలు ఉండవు
కాని పరగ్రూప్ ల నుండి మోసుకొచ్చిన విషయాలపైన, సెలబ్రెటీలకు
సంబంధించిన వివాదస్పద అంశాలపైన గంటల తరబడి వాదోపవాదాలకు దిగేవారు కొందరు..!
“పొరిగింటి పుల్లకూర రుచి” అనే స్వభావన్ని కలిగిఉన్నవారై ఉంటారు వీరందరు…!!
తమ మాటకి.. అభిప్రాయానికి స్పందనలు వస్తూంటే మురిసిపోతుంటారు
వాట్సప్ గ్రూపులోని ఇంకొందరు…
అటువంటి స్పందనలలో తాము పొగొట్టుకున్నదాన్ని, స్పందిస్తున్నవారిలో తమకు కావల్సిన ఆత్మబంధువులను చూసుకుంటు ఉంటారు వీరిలో చాలమంది.!.
ప్రేమభిమానాలకు దూరమై కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవుతున్న
కుటుంబాలలోని వృద్దులై ఉంటారు వీరందరు…!!
తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలే కథా అంశాలు….
తమ కళ్ళ ముందు ఉన్న వ్యక్తులే పాత్రధారులు కొందరి రచయితలకు…!
కాని సదరు పబ్లిక్ మరియు సమాజంతో అంటిముట్టనట్టుగా ఉంటారు వీరిలోని కొందరు..
ఈ తరహా శైలి తమ పరపతిని మరింత ఇనుమడింప చేసే అంశం అనుకుంటుంటారు వీరు..!
అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకునే నైజం లేనివారు, నిరంకుశ స్వభావులైన వారై ఉంటారు వీరందరు..!!
సెలబ్రెటీల పోస్టింగులకు మాత్రమే స్పందిస్తూ…
శంఖంలో పోసిందే తీర్ధం అన్నచందాన వ్యవహారించేవారు ఒకరైతే,
మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే యత్నంలో భాగంగా
తమలోని భావాలను ఊతంగా అందిస్తూ వ్రాయకలిగే వారిని ఉత్తేజపరిచేవారు మరికొందరు.
ఈ విధంగా “జిహ్వ కో రుచి…పుర్రె కో బుద్ది” నానుడిలోని వాస్తవికతను
మన ముందుంచే దర్పణాలే నేటి వాట్సప్ గ్రూపులు.