”అణు”వణువునా క్షోభ..!
ఆరోజున ఆ వేదికపై భరించలేని ఉద్విగ్నత..
విశాలమైన ఆ హాల్లో కూర్చున్న వందల మంది కళ్ళలో నీరు.. ధారాపాతంగా..
అక్కడ మాట్లాడుతున్నది 97 సంవత్సరాల వృద్ధుడు..
అతడినే చూస్తూ కాస్త దూరంలో ఫియానో ముందు అంతే వయసున్న పండు ముసలి..
ఇద్దరూ అంత ముసలైపోయినా ఇద్దరి మొహాల్లోనూ అదోలాంటి ఆనందం..
కానీ.. మెరుస్తున్న ఆ ఇద్దరి కళ్ళ వెనుక అంతులేని బాధా వీచికలు..
అది వ్యక్తిగతంగా పడిన బాధ కాదు..
ఆ ఇద్దరూ ఎనభై ఏళ్ల క్రితం విడిపోయిన ప్రేమికులు.. జీవితంలో మళ్ళీ కలుస్తామనే
ఆశ లేశమాత్రమైనా లేని ఒకనాటి యువ జంట..
అయితే..ఆ ప్రేమికుల జంట వారి మధ్య మనస్పర్థల కారణంగానో..పెద్దల నడుమ
ఏకాభిప్రాయం కుదరకనో విడిపోలేదు సుమండీ..
అలాని..ప్రేమికులకు విధి విధించిన శాపం కూడా కానే కాదు.. అది మనుషులు చేసిన కరాళ నృత్యానికి ప్రతిఫలం..
ఒక భయంకర ఘటన.. అసలు మనిషనే వాడు ఊహించని విధ్వంసక సన్నివేశం..
నాడు..నేడు..ఏనాడు.. చరిత్ర మరువని ఒక భీకర ఘట్టం.. ఆ అందమైన జంటను విడదీసింది..
డెబ్భై మూడు సంవత్సరాల పాటు ఇద్దరూ వేరొకరు ఎక్కడ ఉన్నారో తెలియని..అసలు జంట పక్షి బ్రతికి ఉందో.. నిహతమై పోయిందో ఆచూకీ లేని
దుర్భర స్థితిలో కేవలం నిరాశ..నైరాశ్యం..వైరాగ్యంలో కాలం వెళ్ళబుచ్చారు..
తమలో రెండో వ్యక్తి బ్రతికి ఉందన్న ఆశ గాని..ఆలోచన గాని ఇసుమంతైనా లేని
తీవ్ర మానసిక క్షోభ..
ఆ రోజున ఆ జంట మాత్రమే విడిపోలేదు..ఎందరో అలాగే.. భర్తలకు దూరమైన భార్యలు.. తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు..కుటుంబాల నుంచి విడివడిపోయిన ఎందరో..
అసలు బ్రతికి ఉన్నారో.. మరణించారో..ఒకరి గురించి వేరొకరికి తెలియని దుర్భర అయోమయ స్థితి..
ఇంతకీ ఆ రోజు..
ఆగస్టు 6..1945..
స్థలం..హిరోషిమా..
జరిగింది ఏంటి..
ఒక భయంకర విస్ఫోటనం..
భీకర ఘటన..
ఒక ప్రాంతం గతిని..
జనాభా స్థితిగతులను
కొన్ని సంవత్సరాల పాటు..
తరాల పర్యంతం చిన్నాభిన్నం చేసిన భయానక దుర్ఘటన..
చరిత్ర మరువని ఉదంతం..
కొన్నాళ్ల పాటు
కొన్ని తరాలను
వెంటాడిన పీడకల..
మరచిపోవాలని అనుకున్నా సాధ్యపడని
భీకర అనుభవం..
అణుబాంబు ప్రయోగం..!
ఇప్పుడు మనం మాటాడుకుంటున్నది ఆ భీకర సంఘటన నుండి ప్రాణాలతో బయటపడ్డ ప్రేమికుల జంట గురించి.. అలాగని ఇదేమి సరదా సంతోషాల కథ కాదు.. ఇంతవరకు చరిత్ర ఎరుగని ఒక విచిత్ర గాథ..
ఆ రోజున ..
అణుబాంబు ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్న వేళ.. ఇవేవీ తెలియని
బాహ్య ప్రపంచం వలె.. ఆ ఇద్దరూ..పద్దెనిమిదేళ్ల లేత కుర్రాడు కెంజీ.. అతని నెచ్చెలి
సయూరి.. ఒక అద్భుత గీతాన్ని ఆలపించడానికి ఇద్దరూ ఉద్యుక్తులవుతున్నారు..
శాంతి సందేశంతో కూడిన ఆ గీతం రచించడానికి ఎంతో కష్టపడ్డారు ఇద్దరూ.. కానీ చాలా ఇష్టంగా రాశారు.. అతడు వయోలిన్.. ఆమె పియానోతో సిద్ధంగా ఉన్నారు..
వన్ టు త్రీ.. పాట అందుకోవడానికి కౌంట్ డౌన్ పూర్తయింది..
అయితే అదే సమయంలో అణు కేంద్రంలో కూడా.. యాదృచ్ఛికమే అయినా ప్రయోగానికి కౌంట్ డౌన్ ముగిసింది.
అంతే..
ఆ జంట రాగం అందుకునేలోగానే విస్ఫోటనం..
ఆకాశం జారి కింద పడిపోయిందా అన్నట్టు.. సూర్యుడు ఉన్నపళాన పేలిపోయాడా అనిపించేట్టు.. కాలి కింద భూమి బద్దలై పోయిందా అనుకునేట్టు.. క్షణమాత్రంలో ప్రపంచం తల్లకిందులైపోయినట్టు.. అంధకారబంధురం.. అల్లకల్లోలం..
ఇంత విధ్వంసాన్ని అధిగమించి కాసేపటికి శకలాల మధ్య నుంచి కళ్ళు తెరిచాడు కెంజి..
ఒక్క క్షణం తాను అనుభవించింది అంతా ఏంటో అర్థం కాని అగమ్యగోచర స్థితి..
అసలు తాను బ్రతికి ఉన్నానా..ఉంటే ఎలా బ్రతికి బయట పడ్డానని సందిగ్ధం..అంతలోనే తేరుకుని చూస్తే..అంతవరకు తన పక్కనే ఉన్న ప్రియసఖి ఎక్కడన్న వెతుకులాట..
ఎక్కడ చూసినా మనుషలు..ఎవరు బ్రతికి ఉన్నారో..ఎవరు చనిపోయారో తెలియడం లేదు..
తెగిపడి ఉన్న కాళ్ళు చేతులు.. శిధిలాల మధ్య నుంచి హాహాకారాలు..గుండెల్నిపిండి చేసే హృదయవిదారక రోదనలు.. మూలుగులు.. సహాయం కోసం అరుపులు..
లిప్త కాలంలోనే అన్ని గొంతులు ఆగిపోయాయి.
.ప్రపంచం ఉందా..సృష్టి మరి లేదా..కాలం స్తంభించిపోయిందా.. ఇన్ని ఆలోచనల మధ్య వెంటాడుతున్న ఒకే ప్రశ్న..
నా సయూరి బ్రతికి ఉందా..
చూసుకుంటే తన చేతి వేళ్ళు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. అలా చూసుకోడానికి కూడా ఒక కన్ను మాత్రమే ఉంది..ఎడమ కన్ను పూర్తిగా గుడ్డిదైపోయింది..
తన వయోలిన్ తునాతునకలై పోయింది.
ఇంతకీ ఎక్కడ సయూరి..
అందరిలాగా తను కూడా
తిరిగిరాని లోకాలకు వెళిపోయిందా..తన ప్రేమ కథ
ఇంతటి భయంకర అనుభవంతో మొగ్గలోనే
ముగిసిపోయిందా..
కథైతే ముగిసిపోలేదు..
మరి..ఒకరు బ్రతికి ఉన్నదీ లేనిదీ ఇంకొకరికి తెలియని స్థితిలో చిరంజీవిగా మిగిలిపోయిన అమరప్రేమ కథ అది..డెబ్భై మూడేళ్లకు పైగా గడిచిపోయినా
ఇద్దరి మనసుల్లోనూ చెక్కుచెదరని అనురాగం..ఇద్దర్నీ బ్రతికే ఉంచింది.. కానీ వేరువేరుగా.. ఒకరు ఉన్నారనే సంగతి ఇంకొకరికి ఎరుక లేకుండా..
చిత్రం ఏమిటంటే ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు.. తమ మనసుల్లోకి ఇంకొకరిని రానివ్వలేదు..
అయితే ఆనాటి నుంచి కెంజి మళ్ళీ వయోలిన్ ముట్టుకోలేదు
.మొదట్లో ప్రయత్నించినా ప్రతి తీగలు
ఆ విధ్వంసకాండ నాటి చేదు అనుభవాన్నే పలుకుతున్నాయి.
అయినా తెగిపోయిన వేళ్ళతో ఉన్న చెయ్యి కూడా సహకరించ లేదు.
ఇక ఈ జీవితం ఇంతే అనుకుని జీవచ్ఛవంలా బ్రతికేస్తున్నాడు భగ్న హృదయంతో కెంజి..
అప్పుడు జరిగిందది..
ఏడేళ్ల క్రితం ఒకరోజున అతడికి ఒక వర్తమానం అందింది..ఎక్కడో సుదూర తీరం నుంచి తీపి కబురు..
జపాన్ నుంచి వచ్చిన ఆ వర్తమానం అతన్ని తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది..
శుభవార్తే అయినా అది ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి అతడికి మూడు రోజులు పట్టింది..
తేరుకున్నాక అప్పుడు ఎరుకలోకి వచ్చింది.. తన కలలరాణి..ప్రియసఖి.. జీవితకాలపు నెచ్చెలి బ్రతికే ఉందని..
ఆమె అడిగిందట..
హిరోషిమా ప్రాంతంలో కెంజి అనే వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలుసా అని..
ఆ మాట అటూ ఇటూ తిరిగి చివరకు కెంజిని చేరింది..
ఇంకేమి..
హుటాహుటిన తన నెచ్చెలి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు..
ఆ క్షణాన అక్కడ పూల వర్షమే కురిసింది..ప్రకృతి పరవశించి కొత్త అందాలను తొడిగింది.. నెమలి నాట్యం చేసింది..
అపూర్వ సమాగమం..
అద్భుత సంగమం..
డెబ్భై మూడేళ్ల తర్వాత కలిసిన ఆ ఇద్దరి మధ్య కాసేపు మాటలు లేవు..ఒకరినొకరు చూసుకున్న ఆనందంలో మాట పెగల్లేదు.అదోలాంటి నిశ్శబ్దం..కళ్ళ వెంబడి ఆగని నీరు..అప్పుడు తేరిపార చూసాడు కెంజి తన ప్రియురాలు సయూరిని..
ఒళ్ళంతా కాలిన గాయాలు తన రూపాన్నే మార్చేశాయి.
ఆ మొహంలో ఇప్పటికీ నాటి భయంకర అనుభవం మిగిల్చిన విషాద చాయలు..
ఇద్దరూ బల్ల మీద కూర్చున్నారు..మౌనంగా.. బద్దలైపోయిన హృదయాలతో..
మొదటగా కెంజి సయూరిని అడిగిన ప్రశ్న.. ఆనాటి పాట గుర్తుందా..అని..
దానికి సయూరి సమాధానం.. నిన్నూ..ఆ పాటని అసలు మర్చిపోతే కదా..
ఆ తర్వాత ఏడేళ్లు పట్టింది ఇద్దరూ తేరుకోడానికి.. ఇక ఎప్పటికీ పాడలేని.. పూర్తి కాని తమ చిన్ననాటి పాటను పాడదామనే దృఢ సంకల్పంతో ఇద్దరూ ప్రాణాలను ఉగ్గబట్టుకుని బ్రతికారు..బ్రతికే ఉన్నారు.
ఒక భీకర ఘట్టానికి సజీవ సాక్షులుగా.. ఒక గొప్ప ప్రణయ గాథకు నిలువెత్తు రూపాలుగా..
అదిగో..ఆ పాటను నిన్నగాక మొన్న వినిపించారు.
కెంజి మళ్లీ వయోలిన్ మీటుతూ.. సహచరి సయూరి ఫియానో వాయిస్తూ.. వారి జీవితాలైతే మారిపోయాయి గాని.. అప్పటికీ..ఇప్పటికీ ప్రపంచ స్థితిగతులు మారలేదుగా..
అందుకే అదే సాన్నిహిత్యంతో అదే సాహిత్యం..
అదే సందేశం..
మారిన సన్నివేశం..!
విశ్వశాంతి కోసం ఆశగా..
అంతటి విధ్వంసం చూసినా గాని సామరస్యతపై
అంతే విశ్వాసంతో..
ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పాట
ముగిసింది..జనం చప్పట్లతో..
కన్నీటి అభిషేకాలతో..
ఇదే పాట..ప్రతీ చోట ఇలాగే
పాడుతుంటాము..
ప్రపంచ శాంతిని ఇలాగే కోరుకుంటూ ఉంటామని..
ఇలాంటి ప్రేమ జంట ఇంకొకటి ఉంటుందా..
మరణాన్ని జయించి ఎనిమిది దశాబ్దాల తర్వాత ప్రేమను గెలిపించుకున్న అద్భుత జంట..
ఇప్పుడు మళ్ళీ కలిసి.. తమ ప్రేమకు గుర్తుగా.. తమ పునరేకీకరణను
గొప్పగా చాటుకుంటూ..
కెంజి..సయూరి కోరుకున్నది.. కన్నెగా కన్నకలలు కథలుగా చెప్పుకోవాలని కాదు..
తమ కథ కలకాలం చెప్పినా కంచికి వెళ్లకూడదనీ కాదు..
యుద్ధమే లేని ప్రపంచాన్ని చూడాలని..
వైరమే ఉండకుండా దేశాలు విరాజిల్లాలని..
విశ్వమంతా శాంతి వెల్లివిరియాలని..
మానవాళి చిరకాలం ఎలాంటి భయాలు..
విధ్వంసాలు చవిచూడకుండా
ప్రశాంతంగా ఆయుష్షు ఉన్నంతవరకు జీవించాలని..
ప్రపంచం శాంతినిలయంగా వర్ధిల్లాలని..
జరిగే పనేనా అని
పెదవి విరవొద్దు..
అందరం కృషి చేద్దాం..
కురుక్షేత్ర సంగ్రామమైనా..
ప్రపంచయుద్ధాలైనా
ఒకనాటికి ముగిసిపోలేదా..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్..విజయనగరం
9948546286
7995666286