Suryaa.co.in

Andhra Pradesh

ఇన్చార్జిలు ఇంకెప్పుడు వేస్తారు బాబూ?

– గుంటూరు జిల్లా పార్టీలో గందరగోళం

తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో సైతం సంస్థాగత దిద్దుబాటు చేయడంలో అధిష్టానం చేస్తున్న తాత్సారం స్థానిక పార్టీ కేడర్లో అసంతృప్తిని రగిలిస్తుంది. గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. తెలుగుదేశానికి కంచుకోట అయిన సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాథుడు కరువయ్యాడు. అధికారం కోల్పోయి రెండున్నరేళ్లు అయినా ఇంత వరకు అక్కడ పార్టీ ఇన్చార్జిని నియమించలేదు.

kodelaమాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి గెలుపొందారు. తరువాత జరిగిన ఎన్నికల్లో కోడెల ఓడిపోవడం ఆయన మరణించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ పార్టీకి పెద్ద దిక్కు లేక కార్యకర్తలు మనోవేదన చెందుతున్నారు. పార్టీకి బలంగా ఉన్న సత్తెనపల్లిలో అధిష్టానం ఇన్చార్జి నియామకంలో ఎందుకు ఇంకా తాత్సారం వహిస్తున్నారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం సీటు కోసం పలువురు క్యూ కట్టి ఎవరికి వారు సొంత అజెండాతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

డాక్టర్ కోడెల తనయుడు కోడెల శివరాం ఇన్చార్జి కోసం అధినేత చంద్రబాబు ప్రధాన కార్యదర్శి లోకేష్ చుట్టూ తిరుగుతూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన శైలిలో కోడెల తనయుడిగా తనకూ కలిసి వస్తుందని పావులు కదుపుతున్నారు. అదే విధంగా వివాద రహితుడు మాజీ ఎమ్మెల్యే వై వి ఆంజనేయులు తిరిగి సత్తెనపల్లి పై దృష్టి సారించి ఊరూరా తిరుగుతుంన్నారు. యువనేత మన్నె శివ నాగమల్లేశ్వరరావు (మల్లి) వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రతి కార్యక్రమంలో ముందుండి పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా సీటు కోసం ప్రయత్నం చేసి బంగ పడ్డారు. యూత్ లీడర్ గా మల్లి కి మంచి క్రేజ్ ఉంది.

అదే విధంగా ఇటీవల మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబుతో భేటీ అయి తన కుమారుడు రాయపాటి రంగబాబు కు సత్తెనపల్లి సీటు ఇవ్వాలని కోరారు. సత్తెనపల్లి తో వారికి రాజకీయ అనుబంధం ఉంది. తన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారు. సామాజిక సమీకరణల్లో భాగంగా వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబును ఎదుర్కోవాలంటే అదే సామాజిక వర్గాన్ని అభ్యర్థిగా బరిలోకి దింపాలని కూడా పార్టీలో ఒక వర్గం ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగా గుంటూరు టిడిపి పార్టీ అధ్యక్షులు యువ పారిశ్రామికవేత్త డేగల ప్రభాకర్ పేరు కూడా ప్రచారం జరుగుతుంది. ఇలా ఎవరికి వారు సత్తెనపల్లి సీటు పై కన్నేసి పార్టీ కార్యక్రమాలు విడివిడిగా చేసుకుపోతున్నారు. అయితే అధిష్టానం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది తెల్చుకోలేక ఇన్చార్జి నియామకంలో నాన్చుడు ధోరణితో ఉండడం అధికారపార్టీకి కలిసి వస్తుందని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

ఇదే విధంగా ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో కూడా పార్టీ నిర్ణయం పై విమర్శలు వినవస్తున్నాయి. ఎస్సీ రిజర్వుడ్ నియోజక వర్గంలో అక్కడి ఇన్చార్జి నియామకం ఓసి అయిన సీనియర్ నేత మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య నియామకంపై కూడా వివాదం రేకెత్తించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బలమైన ఎస్సీ అభ్యర్థిని ఇన్ఛార్జ్ గా నియమించి పార్టీ పూర్వ వైభవానికి పాటుపడాలని పలువురు కోరుతున్నారు. అప్పటికప్పుడు ఎవరో ఒకరు కొత్త అభ్యర్థిని బరిలో దింపడం వలన నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ ఇప్పటికైనా పునరాలోచన చేయాలని కోరుతున్నారు.

ఇక కక్షలు కార్పణ్యాలతో అట్టుడికే పల్నాడు ప్రాంతం అయిన మాచర్లలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇదే విధంగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా చలమారెడ్డి అధికార పార్టీనీ తట్టుకొని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండలేకపోతున్నారు అని విమర్శలు ఉన్నాయి. ఇటీవల చంద్రబాబు సమక్షంలో మాచర్ల నియోజకవర్గం పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్త జూలకంటి బ్రహ్మారెడ్డి ని పార్టీ ఇన్చార్జిగా నియమించాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం మాత్రం ఇంకా బ్రహ్మ రెడ్డిని ఇన్చార్జిగా ప్రకటన చేయలేదు.

ఇదిఇలా ఉంటే నరసరావుపేటలో గత ఎన్నికల్లో ఓడిపోయిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుని ఇన్చార్జిగా నియమించారు. పార్టీ కార్యక్రమాలను జిల్లాలో అందరికంటే ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఇటీవల డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు తనకు సీటు కావాలని పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కలిసి కోరడం ఆ నియోజకవర్గం పార్టీలో చిచ్చు రేపుతుంది. లోకేష్,డాక్టర్ కడియాల కుటుంబ సభ్యులతో డాక్టర్ అరవింద బాబు ఉన్నాడు కదా అని స్పష్టంగా చెప్పకపోవడం పార్టీలో కొత్త వివాదానికి తెర తీశారు.

ఇలా తెలుగుదేశానికి బలమైన గుంటూరు జిల్లాలో పార్టీ ప్రతిష్ఠత పట్ల అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని అధికారపార్టీకి కలిసి వచ్చే విధంగా ఉన్నాయని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం అధినేత చంద్రబాబు ఉండే గుంటూరు జిల్లా పార్టీ పరిస్థితి చక్క దిద్దక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ పూర్వ వైభవానికి నియోజకవర్గాల్లో ఇన్చార్జిల నియామకం చేసి నాయకుల మధ్య అరమరికలు తొలగించి పార్టీని గాడిలో పెట్టాలని పలువురు కోరుతున్నారు.

LEAVE A RESPONSE